రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జైవిక్‌ ఇండియా అవార్డు | Prestigious Jaivik India Award for the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జైవిక్‌ ఇండియా అవార్డు

Published Sat, Aug 26 2023 4:31 AM | Last Updated on Sat, Aug 26 2023 4:31 AM

Prestigious Jaivik India Award for the state - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రకృతి సాగు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు జైవిక్‌ ఇండియా అవార్డు దక్కింది. ఈ మేరకు ఇంటర్నేషనల్‌ కాంపిటెన్స్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ (ఐసీసీవోఏ) సంస్థ 2023కి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి జైవిక్‌ ఇండియా అవార్డును ప్రకటించింది. జాతీయ స్థాయిలో 10 విభాగాల్లో 51 అవార్డులను వెల్లడించగా.. ఇందులో రాష్ట్రానికి 3 అవార్డులు దక్కడం విశేషం.

పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరుకు చెందిన అత్తలూరుపాలెం ఆర్గానిక్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎఫ్‌పీవో)తో పాటు బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం చిమటావారిపాలెంకు చెందిన గనిమిశెట్టి పద్మజ కూడా జైవిక్‌ ఇండియా అవార్డులకు ఎంపికయ్యారు. వీటిని సెప్టెంబర్‌ 7న ఢిల్లీలో జరిగే ‘బయోఫాక్‌ ఇండియా నేచురల్స్‌ ఎక్స్‌ పో’లో ప్రదానం చేయనున్నారు.

ప్రకృతి సాగులో ఏపీ బహు బాగు..
కాగా రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ఉద్యమంలా సాగుతోంది. 700 గ్రామాల్లో 40 వేల మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం పుష్క­లంగా లభిస్తోంది. దీంతో ప్రకృతి సాగు ప్రస్తుతం 3,730 పంచాయతీల పరిధిలో విస్తరించింది. 9.40 లక్షల ఎకరాల్లో 8.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములవు­తున్నారు. ప్రకృతి, సేంద్రియ సాగులను ప్రోత్సహించేందుకు ఏపీ సీడ్‌ సర్టిఫికేషన్‌ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటినీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ప్రస్తుత సీజన్‌ నుంచే గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీసెస్‌ (జీఏపీ) సర్టిఫికేషన్‌ జారీ చేయనుంది. 

అత్యుత్తమ ఎఫ్‌పీవోగా.. అత్తలూరుపాలెం 
రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీవో) కేటగిరీలో పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరుకు చెందిన ‘అత్తలూరుపాలెం ఆర్గానిక్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎఫ్‌పీవో)’కు జైవిక్‌ ఇండియా అవార్డు దక్కింది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ చేసి మార్కెటింగ్‌ చేయడంలో ప్రావీణ్యం సంపాదించిన ఈ ఎఫ్‌పీవో పరిధిలో 400 మంది రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ గ్రామాల పరిధిలో ఇతర రైతులకు అవసరమయ్యే జీవ ఎరువులను అందజేస్తున్నారు.

అంతేకాకుండా వారు పండించిన కూరగాయలు, అపరాలు, చిరు ధాన్యాలు, బియ్యం, వంట నూనె­లు, పొడులు, పచ్చళ్లను మార్కెటింగ్‌ చేస్తున్నారు. అలాగే 70 దేశీ ఆవులతో ప్రత్యేకంగా ఆవుల పెంపకం కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆవు పాలు, నెయ్యి, మజ్జిగలను కూడా మార్కెటింగ్‌ చేస్తున్నారు. రైతులు మార్కెట్‌ ధర కంటే అధిక ఆదాయం పొందేలా ఎఫ్‌పీవో కృషి చేస్తోంది.

అంతేకాకుండా ప్రకృతి సాగు చేసే రైతులకు అవసర­మయ్యే శిక్షణ కూడా అందిస్తోంది. అలాగే ఆర్గానిక్‌ ఫుడ్స్‌ పేరుతో గుంటూరు విద్యానగర్‌లో హోటల్‌ను సైతం నడుపుతోంది. గుంటూరు, విజయవాడల్లో ప్రత్యేక స్టోర్‌ల ద్వారా ఆర్గానిక్‌ ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది. 

మహిళా రైతుకు జాతీయ అవార్డు..
ఉత్తమ ప్రకృతి వ్యవసాయ మహిళా కేటగిరీలో బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం చిమటా­వారిపాలెంకు చెందిన గనిమిశెట్టి పద్మజ జైవిక్‌ అవార్డుకు ఎంపికైంది. ఆమె గత నాలుగేళ్లుగా సేంద్రియ సమీకృత వ్యవసాయం చేస్తోంది. పద్మజ సేవలను గుర్తించి ఇటీవల రైతు సాధికార సంస్థ ఆమెను మోడల్‌ మేకర్‌గా ఎంపిక చేసింది. ఆమె తనకున్న ఎకరంలో ఏటా రూ.లక్షన్నర ఆదాయం ఆర్జిస్తోంది. అలాగే పశువుల పెంపకం ద్వారా రూ.60 వేలు, కషాయాల విక్రయాల ద్వారా మరో రూ.5 వేలు సంపాదిస్తోంది. 

ఆదర్శంగా తీసుకున్న పలు రాష్ట్రాలు..
ఏపీలో ఉద్యమంలా సాగు­తున్న ప్రకృతి సాగును కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ప్రకృతి ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసేందుకు రైతు బజా­ర్లలో ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వీక్లీ మార్కెట్ల ద్వారా కూడా ప్రోత్సాహం అందజేస్తోంది.

ఈ క్రమంలో ప్రకృతి ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసేందుకు ముందుకొచ్చిన అమూల్‌ ఆర్గానిక్స్‌తో త్వరలో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకోనుంది. ఇలా దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వాల కోటాలో ఏపీ ఉత్తమ ప్రభుత్వంగా నిలిచి జైవిక్‌ ఇండియా అవార్డుకు ఎంపికైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement