ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి స్థాయికి పెరిగి విశిష్ట సేవలు అందిస్తున్న ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి మరో సారి ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కింది. రాష్ట్రంలోనే వరుసగా ఏ ప్రభుత్వ ఆస్పత్రికి లభించని విధంగా వరుసగా నాల్గో ఏడాది కూడా కాయకల్ప అవార్డు వరించింది. వైద్యశాలకు వచ్చే రోగులకు అందించే సేవల్లో వైద్య సిబ్బంది నిబద్ధత, కృషి ఫలితంగా ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చిందని వైద్యాధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మకూరు(నెల్లూరు జిల్లా): ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వరసగా నాలుగో సారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందజేసే ప్రతిష్టాత్మకమైన ‘కాయకల్ప’ అవార్డు దక్కింది. పీహెచ్‌సీ నుంచి సీహెచ్‌సీగా, 2015లో నూరు పడకల ప్రాంతీయ వైద్యశాలగా ఎదిగి విశిష్ట సేవలు అందించిన ఈ ఆస్పత్రి ఏడాది కాలానికే జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ సాధించింది. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల ప్రజలతో పాటు వైఎస్సార్ జిల్లా బద్వేల్, పోరుమామిళ్ల, మైదుకూరు వంటి దూరప్రాంత ప్రజలకు ఉత్తమ వైద్యసేవలు అందిస్తోంది. 23 మంది వైద్యులు, 30 మందికిపైగా సిబ్బందితో విశేష సేవలు అందిస్తూ.. అనతి కాలంలోనే నూరు పడకల నుంచి 150 పడకల ఆస్పత్రిగా రూపాంతరం చెందింది. ఈ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ (చిన్నపిల్లల వ్యాధులు), ఈఎన్‌టీ, ఆప్తామాలిక్, జనరల్ మెడిసిన్, సర్జరీ, దంత వైద్యం, ఫిజియోథెరపీ, ఎన్‌సీడీ (నాన్ కమ్యూకబుల్ డిసీజెస్) తదితర పలు రకాల వ్యాధులకు మెరుగైన వైద్య సేవలు ఈ ఆస్పత్రిలో లభిస్తుండడంతో సోమ, బుధవారాల్లో ఓపీ 600 మందికిపైగా నమోదు అవుతుందంటే అతిశయోక్తి కాదు. ఇలా ఆరోగ్య పరంగా విశిష్ట సేవలు అందిస్తున్న ఈ ఆస్పత్రిగా పేరుగాంచింది.
వరుసగా అవార్డులు
ప్రాంతీయ వైద్యశాలగా అప్‌గ్రేడ్ అయిన తొలి ఏడాదే 2016లో రాష్ట్రస్థాయి ఉత్తమ కాయకల్ప అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద రూ.3 లక్షలు ఆస్పత్రి అభివృద్ధి కోసం ప్రోత్సాహక నగదు బహుమతి అందజేశారు. 2017–18, 2018–19 సంవత్సరాల్లో కాయకల్ప అవార్డులు లభించాయి. ఈ అవార్డుల కింద ఏటా రూ.10 లక్షలు నగదు ప్రోత్సాహక బహుమతులు లభించాయి. కరోనా నేపథ్యంలో మధ్యలో రెండేళ్ల పాటు అవార్డుల ప్రకటన చేయలేదు. తిరిగి 2020–22 సంవత్సరానికి అవార్డుల ఎంపికలో ఆత్మకూరు ఆస్పత్రికి రాష్ట్ర స్థాయిలో నాలుగో సారి కాయకల్ప అవార్డు దక్కింది. ఈ అవార్డుతో పాటు ఎన్‌క్యూఏఎస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ కంపెనీ సర్టిఫికేషన్) అందజేయనున్నారు.
డిసెంబరులో అవార్డు అందజేత
జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల్లోని జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ఉత్తమ సేవల ఎంపికలో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి కాయకల్ప అవార్డులభించడంతో డిసెంబరులో న్యూఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్‌క్యూఏఎస్ సర్టిఫికెట్‌తో పాటు అవార్డు షీల్డ్, రూ.20 లక్షల ప్రోత్సాహక నగదు చెక్కు ఆస్పత్రికి అందజేయనున్నారు. రాష్ట్రంలోనే వరసగా నాలుగు సార్లు ఉత్తమ అవార్డు దక్కించుకున్న చరిత్ర ఆత్మకూరు ఆస్పత్రికి దక్కడం విశేషం.
బ్లడ్ స్టోరేజ్‌కి అవార్డు
ఈ ఆస్పత్రిలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ (రక్తనిల్వ మాత్రమే) నిర్వస్తున్నారు. వేలాది మందికి సకాలంలో కావాల్సిన మేరకు రక్తం సరఫరా చేయడంలో, ఉత్తమ సేవలు అందించడంలో ఆ విభాగంలో గతేడాది ఈ ఆస్పత్రి రాష్ట్ర స్థాయిలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ అవార్డు దక్కింది. అప్పట్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చొరవతో బ్లడ్ బ్యాంక్ (సేకరణ, నిలువ) మంజూరు అయింది. త్వరలోనే భవన వసతిని చూసుకుని ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించనున్నారు.
అవార్డుకు ఎంపిక ఇలా
ఈ అవార్డు ఎంపిక కోసం రాష్ట్ర స్థాయిలో డాక్టర్లతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. వారు ఆస్పత్రులను పరిశీలించి పర్యావరణం, గ్రీనరీ, అత్యధిక విభాగాల్లో వైద్యసేవలు, యంత్ర పరికరాల నిర్వహణ, ల్యాబ్ నిర్వహణ, భవన వసతి, ఆస్పత్రి పరిసర ఆవరణలో పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న సేవలు, నీటి వినియోగం, ఆస్పత్రి వేస్టేజ్ మేనేజ్‌మెంట్ నిర్వహణ తదితర 16 అంశాల్లో పరిశీలించి ఈ అవార్డుకు ఎంపికలు చేస్తారు.
సమష్టి కృషితో సాధించాం
ఈ ఆస్పత్రికి వరసగా నాలుగు సార్లు కాయకల్ప అవార్డు రావడం ఎంతో సంతోషం. సహచర డాక్టర్లు, సర్వీస్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, అందరి సహకారంతోనే ఈ అవార్డు సాధించగలిగాం. గతంలో పనిచేసిన సూపరింటెండెంట్ డాక్టర్ చెన్నయ్య కృషి ఎంతో ఉంది. మరిన్ని పరికరాలు ఏర్పచుకొని మరింతగా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తాం.
– డాక్టర్ ఎంవీ సుబ్బారెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, ఆత్మకూరు
ప్రసూతిలో విశేష సేవలు
నాలుగేళ్లుగా ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్నాను. అన్ని వైద్య విభాగాలతో పాటు ప్రసూతి విభాగ నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఏడాదికి 1800పైగా కాన్పులు జరుగుతున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అత్యధికంగా అందజేస్తున్నాం. వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహక నగదు అందజేస్తున్నాం. మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాం.
– డాక్టర్ ఉషాసుందరి, ఆర్‌ఎంఓ, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, ఆత్మకూరు
Comments
Please login to add a commentAdd a comment