సూపర్‌–6 అంటే భయమేస్తోంది.. | Previous government is responsible for the current economic crisis says babu | Sakshi
Sakshi News home page

సూపర్‌–6 అంటే భయమేస్తోంది..

Published Sat, Jul 27 2024 6:15 AM | Last Updated on Sat, Jul 27 2024 6:15 AM

Previous government is responsible for the current economic crisis says babu

రూ.100 రాబడి వస్తుంటే రూ.113 ఖర్చు ఉంటోంది

దీనికి ఎన్నికల హామీలు అదనం

కేంద్రం రూ.15 వేల కోట్లు అప్పు ఇప్పిస్తామంటే ఆనందపడ్డా

ప్రాజెక్టులను ‘పీపీపీ’ మోడల్‌లో ప్రైవేటుకు ఇద్దాం

సంపద సృష్టించే మార్గాలను సభ్యులు అన్వేషించాలి

ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం

అమరావతి అభివృద్ధిని నిలిపివేయడంతో భారీ నష్టం

రాష్ట్ర ఆర్థిక విధానంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం 

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి వచ్చే ఆదాయం కంటే ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు, ఇతర చెల్లింపుల ఖర్చే అధికంగా ఉందని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఇవిగాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు చేయాల్సిన ఖర్చు అదనంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ‘సూపర్‌–6’ అంటే భయమేస్తోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితులపై శుక్రవారం సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు ఆయన ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో రూ.100 ఆదాయం వస్తుంటే వేతనాలు, పెన్షన్లు, అప్పులు, వడ్డీలకు రూ.113 ఖర్చవుతోంది. దీంతో రాష్ట్రాభివృద్ధి, ఇచ్చిన హామీల అమలు ఎలాగో తెలీడంలేదు. ప్రస్తుతం సంపద సృష్టించే మార్గాలు కావాలి. సభ్యులు అలాంటి ఆలోచనలు చేయాలి. 

ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలి. 2014–19 మధ్య రాష్ట్రాన్ని నేనెంతో గొప్పగా అభివృద్ధి చేస్తే, 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమంపై పెట్టిన ఖర్చు అభివృద్ధిపై పెట్టకపోవడంతో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్రంలో అంతర్గత రోడ్ల పునర్నిర్మాణం కోసం ‘పబ్లిక్‌–ప్రైవేట్‌–­పార్ట్‌నర్‌షిప్‌’ (పీపీపీ) విధానాన్ని తెచ్చే యోచన చేయాలి. అందుకు కార్లు, బస్సులు, లారీల వంటి వాహనాల నుంచి ‘టోల్‌’ వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తే రహదారులు బాగుపడతాయి.  

మేం ఉంటే 2021కి పోలవరం పూర్తయ్యేది..
మా ప్రభుత్వమే అధికారంలో ఉండి ఉంటే 2021కి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. ఇప్పుడిది ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. ఇది పూర్తయి ఉంటే రూ.45 వేల కోట్ల ఆదాయం వచ్చేది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.95,185 ఉంటే, విభజన తర్వాత 2014–15లో రూ.93,903కు తగ్గింది. గతంలో మా ప్రభుత్వంలో విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప విమానాశ్రయాలను అభివృద్ధి చేశాం. భోగాపురం కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఏర్పాట్లుచేశాం. అలాగే, పాత పోర్టులు కాకుండా మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం కొత్త పోర్టులను ‘పీపీపీ’ విధానంలో చేపట్టాం.

 కానీ, గత ప్రభుత్వం పాలసీని మార్చి ఈపీసీ మోడల్‌ తీసుకొచ్చింది. ఇక వైజాగ్‌–చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (వీసీఐసీ), చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (సీబీఐసీ)లను అభివృద్ధి చేశాను. అనేక కంపెనీలుం తీసుకొచ్చా. సంక్షేమాన్నీ మరువలేదు. రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచాం. మళ్లీ ఇప్పుడు రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.4 వేలు చేశాం. డ్వాక్రా మహిళల తలసరి ఆదా­యం రూ.36 వేల నుంచి రూ.84,670 పెంచాం.  

అమరావతి ఆదాయాన్ని దెబ్బతీశారు..
అనుకున్న ప్రకారం అమరావతి పూర్తయితే ప్రపంచంలో గొప్ప సిటీగా మారేది. కానీ, గత ప్రభుత్వం దాన్ని పూర్తిచేయలేదు. అది జరిగి ఉంటే అమరావతిలో ఇప్పటికి 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. తద్వారా.. రూ.4 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశాన్ని గత ప్రభుత్వం దెబ్బతీసింది. మళ్లీ అమరావతికి పూర్వవైభవం తెస్తాం. అలాగే, గత ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేసింది. 

తలసరి అప్పు రూ.74,790 నుంచి రూ.1,44,336కు పెరిగింది. అదే సమయంలో ఆదాయం 13.2 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గింది. పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలేవీ గత ప్రభుత్వం చేయలేదు. అప్పులు చేసి నిధులు పక్కదారి పట్టించారు. ప్రస్తుతం కాస్తోకూస్తో ఆదాయం ఎక్సైజ్‌ నుంచి వస్తే అది అప్పులు కట్టడానికి సరిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం రూ.15 వేల కోట్లు అప్పు ఇస్తామంటే సంబరపడిపోయా.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement