భద్రాచలం వరకు గోదావరిలో పులసల స్వేచ్ఛా విహారానికి పోలవరం ప్రాజెక్టులో ప్రత్యేక ఏర్పాట్లు
పోలవరం ప్రాజెక్ట్ íస్పిల్‌వే రెండో బ్లాక్‌లో 252 మీటర్ల ఫిష్ ల్యాడర్ నిర్మాణం
జలాశయంలో డెడ్ స్టోరేజీ స్థాయి నుంచి గరిష్ట స్థాయిలో నీరు నిల్వ ఉన్నా రాకపోకలకు వీలుగా మార్గం
పులస మనస్తత్వాన్ని అధ్యయనం అనంతరం డిజైన్ చేసిన సీఐఎఫ్‌ఆర్‌ఐ
పుస్తెలు అమ్మి అయినా పులస తినాలనేది గోదావరి జిల్లాల్లో నానుడి. రుచిలోఅత్యంత మేటైన పులస చేపల ప్రవర్తన కూడా అంతే ప్రత్యేకమైనది. సముద్రం నుంచి గోదావరి నదిలోకి ఎదురీదుకుంటూ వచ్చే పులసల కోసం బంగాళాఖాతం నుంచి భద్రాచలం వరకూ స్వేచ్ఛగా విహరించేలా పోలవరం ప్రాజెక్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సాక్షి, అమరావతి: గోదావరిలోకి ఎర్రనీరు పోటెత్తగానే సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురీది వచ్చే పులసల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా పోలవరం స్పిల్‌వే రెండో బ్లాక్‌లో ఫిష్ ల్యాడర్ నిర్మాణం పూర్తయ్యింది. జలాశయంలో డెడ్ స్టోరేజి 25.72 మీటర్ల స్థాయి నుంచి గరిష్ట మట్టం 45.72 అడుగుల వరకూ ఏ స్థాయిలో నీరు నిల్వ ఉన్నా పోలవరం ప్రాజెక్టు నుంచి ఎగువకు దిగువకు పులసలు రాకపోకలు సాగించేలా ఫిష్ ల్యాడర్ నిర్మించారు.
గోదావరిలో వరద పెరుగుతుండటం.. ధవళేశ్వరం బ్యారేజి నుంచి వరద ప్రవాహం బంగాళాఖాతంలో కలుస్తుండటంతో సముద్రం నుంచి విలస ఎదురీదుతూ ఫిష్ ల్యాడర్ మీదుగా అఖండ గోదావరిలో విహరిస్తోంది. దేశంలో పులస, ఇతర చేపల స్వేచ్ఛా విహారానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన ఏకైక ప్రాజెక్టు పోలవరమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలో చేపల స్వేచ్ఛా విహారానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్న అతి పెద్ద జలాశయం పోలవరం ప్రాజెక్టే కావడం గమనార్హం. ప్రపంచంలో ఒక చేప జాతి సైకాలజీపై అధ్యయనం చేసి.. ఆ చేప జాతి స్వేచ్ఛకు విఘాతం కలి్పంచకుండా నిరి్మస్తున్న ఏకైక ప్రాజెక్టు కూడా పోలవరమేనని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
నదుల్లోకి ఎదురీదే అరుదైన జాతి
గోదావరిలో ఏడాది పొడవునా పులసలు దొరకవు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల వర్షాలు కురిసి.. గోదావరి వరద ప్రవాహం (ఎర్రనీరు) సముద్రంలో కలిసే సమయంలో (జూన్ 4వ వారం నుంచి జూౖలె, ఆగస్టు మధ్యన సముద్రంలో జీవించే విలస రకం చేపలు నదిలోకి ఎదురీదుతాయి. సముద్రపు జలాల నుంచి విలస గోదావరి నీటిలోకి చేరాక పులసగా రూపాంతరం చెందుతుంది. పులస సంతానోత్పత్తి కోసం గోదావరిలోకి ఎదురీదుతుంది.
వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను ఎత్తి ఉంచడం వల్ల గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది నుంచి దాదాపుగా భద్రాచలం వరకూ నదిలో ఎదురీదుతుంది. విలస గోదావరి నీటిలోకి ప్రవేశించాక.. దాని శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడం వల్ల పులసగా మారి అద్భుతమైన రుచినిస్తుంది. సంతానోత్పత్తి చేశాక తిరిగి సముద్రంలోకి చేరి.. విలసగా రూపాంతరం చెందుతుంది.
పోలవరం నుంచి స్వేచ్ఛా విహారం
పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే అత్యంత అరుదైన పులస చేపల స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమానాలు వ్యక్తం చేసింది. పులస స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా పోలవరం ప్రాజెక్టు మీదుగా ఎగువకు.. దిగువకు స్వేచ్ఛగా విహరించేలా ఏర్పాట్లు చేస్తేనే ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇస్తామని షరతు విధించింది. ఆ షరతుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది.
సైకాలజీపై ప్రత్యేక అధ్యయనం
సముద్రంలో ఉండే విలస.. గోదావరిలోకి చేరి పులసగా రూపాంతరం చెందాక.. అది ప్రవర్తించే తీరు(సైకాలజీ)పై అధ్యయనం చేసి.. దాని స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా ఎగువకు దిగువకు రాకపోకలు సాగించేలా పోలవరం ప్రాజెక్టుకు ఫిష్ ల్యాడర్ గేట్ల డిజైన్ రూపొందించే బాధ్యతను కోల్‌కతాలోని ప్రఖ్యాత సీఐఎఫ్‌ఆర్‌ఐ (సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. సుమారు ఐదేళ్లపాటు అధ్యయనం చేసిన సీఐఎఫ్‌ఆర్‌ఐ పులస స్వేచ్ఛా విహారానికి వీలుగా పోలవరం స్పిల్‌వే రెండో బ్లాక్‌లో అమర్చే ఫిష్ ల్యాడర్ గేట్లను డిజైన్ చేసింది. ఈ డిజైన్‌ను సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఆమోదించింది.
ఇంజనీరింగ్ అద్భుతం.. ఫిష్ ల్యాడర్
సీడబ్ల్యూసీ ఆమోదించిన మేరకు ఫిష్ ల్యాడర్ నిర్మాణాన్ని 2022లో పూర్తి చేసిన ప్రభుత్వం వాటికి గేట్లను కూడా అమర్చింది. గోదావరి నదిలో వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉన్నా పులసలు స్వేచ్ఛగా విహరించేలా పోలవరం స్పిల్‌వే రెండో పియర్‌కు మూడుచోట్ల ఫిష్ ల్యాడర్ గేట్లను అమర్చింది. ఫిష్ ల్యాడర్ 252 మీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని పోలవరం స్పిల్‌వే రెండో బ్లాక్‌లో నాలుగు అరలుగా నిరి్మంచారు. ఒక్కో అరకు ఒక్కో గేటు చొప్పున నాలుగు గేట్లను అమర్చారు. క్రస్ట్ లెవల్‌లో అంటే 25.72 మీటర్ల స్థాయిలో ఫిష్ ల్యాడర్ అరకు ఒకటి, 30.5 మీటర్ల స్థాయిలో అరకు రెండో గేటు అమర్చారు.
34 మీటర్ల స్థాయిలో అరకు మూడో గేటు, 41 మీటర్ల స్థాయిలో నాలుగో గేటు అమర్చారు. పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 45.72 మీటర్లు, కనిష్ట నీటిమట్టం 25.72 మీటర్లు. అంటే.. గోదావరిలో నీటిమట్టం గరిష్టంగా ఉన్నా.. సాధారణంగా ఉన్నా.. కనిష్టంగా ఉన్నా పులసలు ఎగువకు, దిగువకు రాకపోకలు సాగించేలా పోలవరం ప్రాజెక్టుకు ఫిష్ ల్యాడర్ గేట్లు అనుకూలంగా ఉంటాయి. పోలవరం స్పిల్‌వే మీదుగా పులస స్వేచ్ఛగా విహరిస్తుండటంతో ఫిష్ ల్యాడర్‌ను ఇంజనీరింగ్ అద్భుతంగా పర్యావరణ నిపుణులు అభివరి్ణస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment