
సాక్షి, అమరావతి: ఏపీలో అధిక సంఖ్యలో కోవిడ్–19 పరీక్షలు నిర్వహించడంపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ప్రత్యేకంగా అభినందించారు. కరోనా వల్ల సంభవించే మరణాలను కనిష్ట స్థాయికి తెచ్చేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, ఆస్పత్రుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంటైన్మెంట్ ప్రాంతాలు, వాటి వెలుపల నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాజీవ్ గౌబ ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ నీలం సాహ్ని మాట్లాడుతూ ఏమన్నారంటే..
► రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రోజూ సరాసరి ఐదు వేలు, రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల దాకా టెస్టులు నిర్వహిస్తాం.
► రాష్ట్ర వ్యాప్తంగా 20 వీఆర్డీఎల్ ల్యాబ్‌లు ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నాం.
► టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్, ట్రీట్మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి కేసులు, మరణాల సంఖ్య తగ్గింపునకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.
► ఇటీవల పాజిటివ్‌ల సంఖ్య పెరగడంతో మరణాల సంఖ్య కూడా పెరిగింది.
► రాష్ట్ర వ్యాప్తంగా 138 ఆస్పత్రుల ద్వారా కరోనా రోగులకు వైద్య సేవలందిస్తున్నాం.
► వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్ పాల్గొన్నారు.