సాక్షి, అమరావతి: కొన్ని రాష్ట్రాల్లో టెస్టులు ఎక్కువగా చేయడం వల్ల కేసుల సంఖ్య పెరగవచ్చని, దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణకు లాక్ డౌన్ నిబంధనలను మే 3వ తేదీ వరకు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఆదివారం ఢిల్లీ నుంచి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. అవేంటంటే..
► రెడ్ జోన్లు, కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలి. అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోవాలి. కేసులు నమోదవుతున్న జిల్లాల్లో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి.
► రంజాన్ తదితర పర్వదినాలను పురస్కరించుకుని అధిక సంఖ్యలో ప్రజలు ఒక చోట గుమికూడ కుండా ఎవరి ఇళ్లలో వారు వేడుకలను జరుపుకోవాలి. ఈ విషయమై ఆయా మత పెద్దలతో రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడి తగిన సూచనలు ఇవ్వాలి.
► రేషన్ దుకాణాలు, నిత్యావసర సరుకులు తీసుకునే చోట, రైతు బజారులు, ఏటీఎంలు, బ్యాంకులు వంటి ప్రతి చోటా ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించేలా ప్రజలందరిలో పెద్ద ఎత్తున అవగాహన కలిగించాలి. ఏ రాష్ట్రంలోనూ కరోనా కేసుల సంఖ్యను తక్కువగా చూపడం లేదా దాచిపెట్టడం వంటి ప్రయత్నాలు చేయవద్దు.
ఏపీలో రోజుకు 8 వేల టెస్టులు: సీఎస్ నీలం సాహ్ని
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం రోజుకు ఎనిమిది వేల మందికి పరీక్షలు చేస్తున్నామని, ఈ సంఖ్యను పది వేలకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న కిట్లతో ఎక్కువ టెస్టులు చేస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్ పాల్గొన్నారు.
టెస్టుల్లో మరింత ముందుకు
ఏపీలో సగటున పది లక్షల జనాభాకు 1,274 టెస్టులు
రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు పెరుగుతున్నాయి. ఆదివారం నాటికి టెస్టుల్లో ఏపీ మరింత ముందడుగు వేసింది. రాష్ట్రంలో పది లక్షల జనాభాకు సగటున 1274 టెస్టులు చేశారు. దేశంలో సగటున పది లక్షల జనాభాకు 451 మందికే టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో వేయికి పైగా టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ముందుకు వెళుతోంది. ఆదివారం సాయంత్రం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 68,034 టెస్టులు చేస్తే 1097 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మన రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 1.6 శాతం మాత్రమే ఉన్నాయి. దేశంలో పాజిటివ్ కేసుల శాతం 4.21 శాతంగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment