సాక్షి, అమరావతి : చెప్పిందే చెప్పరా పాచిపళ్ల దాసరా.. అన్నట్లుగా ఉంది ఈనాడు రామోజీ తీరు. తన ఆత్మబంధువు చంద్రబాబు మీద ఎక్కడలేని పిచ్చి ప్రేమ.. సీఎం జగన్‌పై అర్థంపర్థంలేని అక్కసు, అసూయ, ద్వేషంతో ఆయన నిత్యం అసత్యాల వ్రతం చేస్తూ తన విషపుత్రిక ఈనాడులో అశుద్ధ కథనాలు వండివార్చడమే పనిగా పెట్టుకున్నారు.
చెప్పిందే చెప్పి.. రాసిందే రాస్తూ జగన్‌పై తన కడుపుమంటను చాటుకుంటున్నారు. ఇందులో భాగమే తాజాగా ఆదివారం ఈనాడులో రామోజీ తన విలువల వలువలన్నీ విడిచేసి సిగ్గూఎగ్గూ లేకుండా రాష్ట్ర అప్పులపై పచ్చి అబద్ధాలతో ‘వారం వారం రుణ పురాణం’.. పేరుతో జగన్ సర్కారుపై మళ్లీమళ్లీ పిచ్చి ప్రేలాపనలు పేలారు.
అనధికార అప్పులుండవని తెలిసినా..
నిజానికి.. ప్రభుత్వాలకు అనధికార అప్పులుండవని తెలిసినా సరే అనధికార అప్పులంటూ తన పాఠకులను రామోజీ ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే ప్రజలు నమ్ముతారనుకునే చంద్రబాబు సిద్ధాంతాన్ని రామోజీ తూచా తప్పకుండా పాటిస్తూ అబద్ధాలను అచ్చేస్తున్నారు. చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి పేరుతో అనధికారికంగా డిపాజిట్లు సేకరించడం ఈనాడు రామోజీకి చెల్లుతుంది తప్ప ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వానికి గానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి గానీ అనధికార అప్పులనేవి ఉండనే ఉండవు. ఈ విషయం తెలిసినా సరే రామోజీ పదేపదే జగన్ సర్కారుపై విషప్రచారానికి తెగబడుతూనే ఉన్నారు. ఆయన తాజా కథనంలో అక్కసు, కక్ష, అసూయ తప్ప ఒక్క వాస్తవం కూడా లేదు.
గత చంద్రబాబు హయాం నుంచి రాష్ట్రాల అప్పులకు ఏ నెలలో ఏ తేదీన సెక్యురిటీల విక్రయం చేయాలనేది ఆర్‌బీఐ నిర్ణయిస్తోంది. అందుకనుగుణంగా గత చంద్రబాబు ప్రభుత్వంతో పాటు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీనెలా ఆయా తేదీల్లో సెక్యూరిటీల విక్రయం ద్వారా అప్పులు చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వారం వారం జగన్ సర్కారు ఒక్కటే అప్పులు చేయడంలేదు. ఇక మంగళవారం ఏపీతో సహా మొత్తం 13 రాష్ట్రాలు రూ.24,280 కోట్ల మేర అప్పులు చేయనున్నాయి. దాన్ని వక్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే మంగళవారం రూ.1,100 కోట్లు అప్పు చేస్తోందంటూ ఈనాడు రామోజీ చేతికొచ్చింది ఇష్టారాజ్యంగా రాసిపారేశారు.
తప్పుడు రాతలు.. దొంగ లెక్కలు..
నిజానికి.. చంద్రబాబు గత ఎన్నికల ముందు ఏప్రిల్ 5న, ఏప్రిల్ 30న ఏకంగా రూ.5,500 కోట్లు అప్పుచేశారు. ఆ అప్పు కూడా 16 నుంచి 20 ఏళ్లలో తీర్చేలా చేశారు. ఇది ఈనాడు రామోజీకి తప్పుగా కనిపించలేదు. ఎందుకంటే చంద్రబాబు అంటే రామోజీకి ఎక్కడలేని ప్రేమ. ఇప్పుడు జగన్ అంటే నచ్చదు కాబట్టి నిబంధనల మేరకు అప్పులు చేస్తున్నా తప్పుగా కనిపిస్తాయి. రాష్ట్ర రుణాల మొత్తం, వడ్డీలు కలిపి చెల్లింపు భారం రూ.10 లక్షల కోట్లకు చేరిందంటూ పచ్చి అబద్ధాలను రామోజీ గుడ్డిగా అచ్చేశారు. దానికి కార్పొరేషన్ అప్పులను కూడా కలిపితే ఇలా ఉండవచ్చు అంటూ సొంత పైత్యాన్ని జోడించారు.
రాష్ట్ర అప్పులకు సంబంధించి భవిష్యత్తు చెల్లింపుల భారం గురించి కాగ్ నివేదికలో వాస్తవాలున్నా సరే అనధికారం, అంచనాల పేరుతో రామోజీ ఊహాగాన అంకెలతో నిస్సిగ్గుగా అచ్చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులను కూడా ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుస్తోంది. ఇదే విషయాన్ని కాగ్ చెప్పినా ఆయనకు కనిపించదు. ఎందుకంటే అది చంద్రబాబుకు ఇబ్బంది కాబట్టి. 2019 మార్చి 31 నాటికి చేసిన అప్పుల్లో వచ్చే ఏడేళ్లలో రూ,1,03,550 కోట్లు అంటే 53.51 శాతం చెల్లించాల్సి వస్తుందని కాగ్ నివేదిక స్పష్టంగా పేర్కొంది.
ఇంత మొత్తంలో చెల్లింపుల భారం ఉన్నందున అందుకు తగిన ప్రణాళికతో అదనపు రెవెన్యూ వనరులను సమీకరించుకోవాల్సి ఉందని, లేదంటే అభివృద్ధికి నిధులుండవని కాగ్ పేర్కొంది. వాస్తవాలిలా ఉంటే.. ఈనాడు రామోజీ జగన్ సర్కారుపై ఈర‡్ష్యతో అవాస్తవ గణాంకాలతో విషప్రచారానికి తెగబడుతున్నారు. 2022 మార్చి వరకు కాగ్ ఇచ్చిన నివేదికలో కూడా వచ్చే పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అసలు అప్పులు, వడ్డీ కలిపి రూ.3.36 లక్షల కోట్లు మాత్రమే ఉందని కాగ్ స్పష్టంచేసినా, చెల్లింపుల భారం రూ.పది లక్షల కోట్లకు పెరిగిదంటూ రామోజీ పచ్చి అబద్ధాలతో పేట్రేగిపోయారు.
వడ్డీ శాతంపైనా వంకర రాతలు..
ఇక 2017–18 చంద్రబాబు హయాంలో రాష్ట్ర అప్పులపై సగటు వడ్డీ 6.52 శాతం ఉందని, అదే 2021–22లో అప్పులపై సగటు వడ్డీ 6.15 శాతమేనని కాగ్ నివేదిక స్పష్టంచేసింది. అయినా సరే.. రామోజీ ఈ వాస్తవాలను పట్టించుకోకుండా సొంత గణాంకాలతో జగన్ సర్కారుపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. మూలధన వ్యయం కూడా గత చంద్రబాబు ఐదేళ్లలో కన్నా ఇప్పటి జగన్ సర్కారులో ఎక్కువగా ఉన్నప్పటికీ తప్పుడు గణాంకాలను ఈనాడు రాసింది.
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటు మూలధన వ్యయం రూ.15,227.80 కోట్లు ఉండగా.. వైఎస్ జగన్ సర్కారులో అది రూ.17,991.21 కోట్లుగా ఉంది. ఇక రెవెన్యూ రాబడులు కూడా పెరగడం లేదంటూ రామోజీ మరో అబద్ధాన్ని రంగరించారు. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు రెవెన్యూ రాబడి కేవలం 6 శాతమే పెరిగింది. అదే వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనలో రెవెన్యూ రాబడి 16.7 శాతం పెరిగింది.
కోవిడ్ సంక్షోభం లేకున్నా బాబు హయాంలో రాబడి పెరగకపోయినా పెన్నెత్తని రామోజీ.. ఇప్పుడు కోవిడ్ సంక్షోభంలోనూ రాబడి పెరిగినా సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. మరోవైపు.. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం బాండ్లు, బ్యాంకులు నుంచి 10.32 నుంచి 10.45 శాతం వరకు అధిక వడ్డీలతో అప్పులుచేసి రాష్ట్రంపై భారం మోపినా రామోజీ కిమ్మనలేదు. ఇప్పుడు జగన్ సర్కారు తక్కువ వడ్డీలకే అప్పులు పుడుతున్నా ఆయనకు తప్పుగా కనిపిస్తోంది.
టీడీపీ అప్పులకు ఈ ఏడాది కట్టాల్సిన వడ్డీ రూ.17వేల కోట్లు..
2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో వడ్డీల చెల్లింపులకు కేటాయించిన రూ.28,6p73.71 కోట్లలో టీడీపీ హయాంలో చేసిన అప్పులకే రూ.17,142.71 కోట్లు కట్టాల్సి వస్తోంది. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లింపులు రూ.11,531 కోట్లే. వాస్తవాలిలా ఉంటే.. మొత్తం రూ.28,673.71 కోట్ల వడ్డీ ఈ ప్రభుత్వం తీసుకున్న అప్పులపైనే చెల్లిస్తున్నట్లు ఈనాడు వక్రీకరిస్తూ ప్రజలకు తప్పుడు సమాచారం అందించింది.
నిజానికి.. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైన గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు అసలు, వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాస్తవాలేమీ చెప్పకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పులకే అసలు, వడ్డీలు రూ.10 లక్షల కోట్లు చెల్లించాలంటూ రామోజీ ఇష్టమొచ్చినట్లు రాసిపారేశారు.
ఇవేవీ రామోజీకి కనిపించవా?
రాష్ట్రంలో అభివృద్ధి లేదంటూ గగ్గోలు పెడుతున్న రామోజీకి వైఎస్ జగన్ సర్కారు కొత్తగా నిర్మిస్తున్న 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, రెండు విమానాశ్రయాలు, అలాగే.. గ్రామాల్లో 15 వేల సచివాలయాలు, 10,778 రైతుభరోసా కేంద్రాలు, 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్, 542 అర్బన్ హెల్త్ క్లినిక్స్ కనిపించడంలేదా.
వైద్య రంగంలో నాడు–నేడు పేరుతో 16 వేల కోట్లతో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, మనబడి నాడు–నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్లలో 16 వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన కనిపించడంలేదా? చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీగానీ, ఒక్క ప్రభుత్వ ఆస్పత్రిగానీ కట్టకపోయినా రామోజీ కళ్లకు అప్పుడంతా లేని అభివృద్ధి కలర్‌ఫుల్‌గా కనిపించింది. ఎందుకంటే బాబు అంటే ఇష్టం.. జగన్ అంటే కోపం.
Comments
Please login to add a commentAdd a comment