
సాక్షి, రాజమహేంద్రవరం: రామోజీ ఫిల్మ్ సిటీ అక్రమ నిర్మాణమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఫిల్మ్ సిటీ కోసం ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను ఉల్లంఘించి భూములు సేకరించారని విమర్శించారు. ఫిల్మ్‌సిటీ రెండు వేల ఎకరాల భూముల విలువ ఇప్పుడు రూ.2 లక్షల కోట్లన్నారు. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు.
ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌లో జమీందార్లు, పెద్దలు కూడా భూములు కోల్పోయారన్నారు. కానీ రామోజీ మాత్రం అందుకు భిన్నమన్నారు. ఇందుకు మార్గదర్శి కేసులో జరుగుతున్న విచారణే నిదర్శనమని తెలిపారు. రామోజీకి కోర్టుల్లో చాలా పలుకుబడి ఉందని, ఆయన అడ్వొకేట్లు ఎవరికి కావాలనుకుంటే వారికి శిక్షలు వేయించగలరని చెప్పారు.
మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో రామోజీరావు, శైలజా కిరణ్‌లను అధికారులు ప్రశ్నించిన వీడియో బయటపెట్టాలని ఉండవల్లి కోరారు. మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘన ఆంధ్రాలో జరిగితే తెలంగాణ కోర్టులో విచారించాలని పట్టుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. దీన్నిబట్టి ఏపీ ప్రభుత్వం కన్నా రామోజీరావుకు పలుకుబడి ఉందని అర్థం అవుతోందన్నారు.
‘ఈనాడు’తోవ్యవస్థలను భయపెడుతున్నారు..
రామోజీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈనాడు పేపర్‌ను అడ్డం పెట్టుకుని వ్యవస్థలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. అందుకే ప్రతి కేసులో ‘ఈనాడు పత్రిక అధిపతి’ అని ప్రస్తావన తీసుకువస్తారన్నారు. ఒక కేసులో రామోజీరావు మార్గదర్శి ఎండీ అని, మరో కేసులో మార్గదర్శితో రామోజీరావుకు సంబంధం లేదని అఫిడవిట్ వేశారన్నారు. అలాంటి వ్యక్తిపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.
ఏపీలో ప్రజలు కట్టిన సొమ్ముకు, మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ వద్ద ఉన్న సొమ్ముకు వ్యత్యాసం ఉందన్నారు. ఆదిరెడ్డి అప్పారావుని అరెస్టు చేసినప్పుడు రామోజీని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఆదిరెడ్డిని పరామర్శించిన చంద్రబాబు రామోజీ గురించి మాట్లాడలేదన్నారు. తన రాజగురువుకు కోపం వస్తే పునాదులు కదులుతాయని ఆయన భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. మార్గదర్శి వ్యవహారంలో రామోజీ తప్పు చేయలేదని బాబు చెప్పగలరా? అని సవాల్ విసిరారు.
మార్గదర్శి కేసులో ప్రభుత్వం నాకు సహకరించాలి..
మార్గదర్శి అక్రమాలపై జరుగుతున్న విచారణ చూస్తుంటే చట్టం ముందు అందరూ సమానం కాదన్న భావన కలుగుతోందన్నారు. న్యాయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. మార్గదర్శి కేసులో నిజాలు బయటపెట్టాలంటే ప్రభుత్వం తనకు సహకరించాలని కోరారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ప్రభుత్వంపై ఇంకా వ్యతిరేక కథనాలు కోకొల్లలుగా వస్తాయన్నారు. చిరంజీవి పిచ్చుక కాదని.. సొంత పార్టీ పెట్టి 18% ఓట్లు సాధించారని గుర్తు చేశారు.