సాక్షి, అమరావతి: చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడటంలో తనకు సాటిలేదని చెరుకూరి రామోజీరావు మళ్లీ మళ్లీ నిరూపించుకుంటూనే ఉన్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లను సేకరించడమే కాకుండా తన చర్యను నిస్సిగ్గుగా సమర్థించుకునేందుకు బరితెగించడం ఆయనకే చెల్లింది.
తటస్థుల ముసుగులో టీడీపీ సానుభూతిపరులతో మాట్లాడిస్తూ మరో నాటకానికి తెర తీశారు. డిపాజిట్ల సేకరణ ముమ్మాటికీ చట్టవిరుద్ధమేనని ఆర్బీఐ కొరడా ఝళిపించడం, అడ్డంగా దొరికిపోవడంతో కేసు విచారణ ఇంకా కొనసాగుతుండగానే నేరపూరిత కుట్రతో నాడు ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ను రామోజీ మూసివేశారు.
ఇక ఇప్పుడు ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్’ పేరిట రశీదుల రూపంలో అక్రమ డిపాజిట్ల సేకరణకు బరితెగించారు. చందాదారుల సొమ్ముతో అక్రమ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారుల సోదాలతో ఈ అక్రమాల బాగోతం మరోసారి బట్టబయలైంది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట సాగించిన దందా విషయంలో ఆనాడు ఆర్బీఐ ఏం చెప్పిందో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మార్గదర్శివి అక్రమ డిపాజిట్లే...
‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట చెరుకూరి రామోజీరావు అక్రమ డిపాజిట్లు సేకరించారని ఆర్బీఐ తేల్చింది. ఈమేరకు 2006 నవంబరులో కేంద్ర ఆర్థిక శాఖకు లిఖితపూర్వకంగా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఓ లేఖ ద్వారా వెల్లడించింది. డిపాజిట్ల సేకరణను సమర్థించుకుంటూ రామోజీరావు చేసిన వాదన పూర్తిగా అహేతుకం, చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.
ఆదాయపన్ను చట్టం ప్రకారం తమ వ్యాపార సంస్థలన్నీ హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్) కిందకు వస్తాయి కాబట్టి ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయవచ్చని, ఆర్బీఐ చట్టంలోని ‘45 ఎస్’ నిబంధన తమకు వర్తించదని రామోజీ అడ్డగోలుగా వాదించారు. దీన్ని ఆర్బీఐ పూర్తిగా తిరస్కరించింది. ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట వసూలు చేసినవి అక్రమ డిపాజిట్లేనని స్పష్టం చేసింది.
కొత్తగా సేకరించొద్దు.. రెన్యూవల్ చేయొద్దు
మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు రూ.2,204.42 కోట్లు అక్రమంగా డిపాజిట్లుగా సేకరించారని ఆర్బీఐ వెల్లడించింది. 2.50 లక్షల మంది డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ తక్షణం డిపాజిట్ల సేకరణను నిలిపివేయాలని ఆదేశించింది. కొత్తగా డిపాజిట్లు సేకరించడం, కాలపరిమితి ముగిసిన పాత డిపాజిట్లు రెన్యూవల్ చేసేందుకు వీల్లేదని తేల్చిచెప్పింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రామోజీరావు డిపాజిట్ల సేకరణను నిలిపివేశారు.
అప్పటికే సేకరించిన రూ.2,204.42 కోట్లను డిపాజిట్‌దారులకు వెనక్కి ఇచ్చేస్తామని ఆర్బీఐకి లిఖితపూర్వకంగా తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో తమ మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థను మూసివేశారు. నాడు దివంగత వైఎస్సార్ సకాలంలో స్పందించి 2.50 లక్షల మంది డిపాజిట్‌దారుల హక్కులను పరిరక్షించారు.
మళ్లీ అక్రమ డిపాజిట్లు సేకరణ
ఆర్బీఐ ఆదేశాలతో మార్గదర్శి ఫైనాన్సియర్స్ దుకాణాన్ని మూసివేసిన రామోజీ ఈసారి మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరుతో అక్రమ డిపాజిట్లకు తెరతీశారు. చందాదారులు పాడిన చిట్టీ మొత్తాన్ని వారికి పూర్తిగా చెల్లించకుండా రశీదుల రూపంలో డిపాజిట్లుగా వసూలు చేశారు. చిట్‌ఫండ్ కంపెనీలు డిపాజిట్లు వసూలు చేయడం చిట్‌ఫండ్ చట్టం–1982కు విరుద్ధం. మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల నుంచి అక్రమ డిపాజిట్లను సేకరించి హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి తరలించారు.
అక్కడ నుంచి తమ అనుబంధ సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, మార్గదర్శి చిట్‌ఫండ్స్(తమిళనాడు)–చెన్నై, మార్గదర్శి చిట్‌ఫండ్స్(కర్ణాటక)–బెంగళూరులలో అక్రమ పెట్టుబడులు పెట్టారు. ముంబైలోని మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు, షేర్ మార్కెట్లో కూడా అక్రమ పెట్టుబడులుగా మళ్లించారు. తన చేతి సొమ్ము రూపాయి పెట్టకుండా చందాదారుల కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టి భారీగా ఆస్తులు కూడగట్టారని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారుల సోదాల్లో వెల్లడైంది.
చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనన్న ఆర్బీఐ
నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లను సేకరించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని ఆర్బీఐ 2006లోనే స్పష్టం చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ పెట్టుబడుల అంశంపై నాడు ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్‌బీఐకి ఫిర్యాదు చేశారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ద్వారా ఆర్బీఐ దృష్టికి తేవడంతో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది.
డిపాజిట్‌దారుల ప్రయోజనాలకు కాపాడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. అక్రమ డిపాజిట్లు వసూలు చేసే ఆర్థిక సంస్థలపై చర్యలు తీసుకునే యంత్రాంగం ఆర్బీఐకి ప్రత్యేకంగా లేదని పేర్కొంది. ఆ తరహా ఆర్థిక నేరాలను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సీఐడీ విభాగం ప్రత్యేకంగా ఉందని ఆర్బీఐ ప్రస్తావించడం గమనార్హం. ఆమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 1999 రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
నాడు ఆర్బీఐ ఆదేశాలతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై చర్యలు చేపట్టింది. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక మోసాలపై అదే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటోంది. సోదాలు నిర్వహించి అక్రమాలు జరిగినట్లు వెల్లడి కావడంతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
2006లో ఆర్బీఐ ఏం చెప్పిందంటే..?
► ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’వి కచ్చితంగా అక్రమ డిపాజిట్లే
► నిబంధనలకు విరుద్ధంగా రూ.2,205 కోట్ల డిపాజిట్ల సేకరణ
► డిపాజిట్‌దారులకు తక్షణం డిపాజిట్ మొత్తాన్ని మొత్తం చెల్లించాలి
► కొత్తగా డిపాజిట్ల స్వీకరణ, పాతవి రెన్యూవల్ చేయకూడదు
► ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే
Comments
Please login to add a commentAdd a comment