తుంగభద్రను రక్షించుకుందాం | Rayalaseema Intellectuals Forum On Tungabhadra | Sakshi
Sakshi News home page

తుంగభద్రను రక్షించుకుందాం

Published Sat, Feb 25 2023 4:32 AM | Last Updated on Sat, Feb 25 2023 4:32 AM

Rayalaseema Intellectuals Forum On Tungabhadra - Sakshi

తిరుపతి అర్బన్‌: కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర ప్రాజెక్టుపై ఎగువభద్ర పేరుతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తుండడం రాయలసీమకు శాపంగా మారనుందని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఎస్వీ ఇంజనీరింగ్‌ కశాశాలలో శుక్రవారం ‘తుంగభద్రను కాపాడుకుందాం– సిద్దేశ్వరం అలుగుతో మనసీమను సస్యశ్యామలం చేద్దాం’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ రాయలసీమకు కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టును కాపాడుకోవడం కోసం విద్యార్థులు సోషల్‌ మీడియా వేదికగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తుంగభద్రకు సంబంధించి బచావత్‌ నీటి కేటాయింపులు లేకపోయినా, సుప్రీంకోర్టులో స్టే ఉన్నా ఎగు­వ రాష్ట్రం అయిన కర్ణాటక నిబందనలు ఉల్లంఘించి తుంగభద్ర ప్రాజెక్టుపై ఎగువన ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం దుర్మార్గమని చెప్పారు.

రెండు రాష్ట్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా రాయలసీమకు అన్యాయం చేస్తూ కర్ణాటకలో అనుమతులు లేని ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే కాకుండా నిధులు మంజూరు చేయడం అన్యాయమన్నారు.

సామాజిక మాధ్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలపాలని సదస్సులో తీర్మానించారు. ఆచార్య జయచంద్రా రెడ్డి, ఆచార్య సుబ్రమణ్యం, ఆచార్య నరేన్‌ కుమార్, ఇంజనీరింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement