చికిత్సకు ముందు, తరువాత షేక్ జోయా
సాక్షి, అమరావతి: ఆరోగ్య శ్రీ పథకం ఇద్దరు నిరుపేద బాలికలకు పునర్జన్మనిచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చొరవతో లక్షల మందిలో ఒకరికి చాలా అరుదుగా వచ్చే వ్యాధులకు గురైన ఆ బాలికలకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యమందింది. వైఎస్సార్ కడప, కృష్ణా జిల్లాలకు చెందిన ఇద్దరు బాలికలు అతి అరుదైన వ్యాధులకు గురయ్యారు. రెక్కాడితే కాని డొక్కాడని ఆ రెండు నిరుపేద కుటుంబాలు వారి చిన్నారుల కోసం చేయగలిగినంత చేశాయి. కానీ, వారి ప్రాణాలు కాపాడాలంటే లక్షలాది రూపాయలు ఖర్చయ్యే బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి. అంత ఖర్చు చేసే స్తోమతు లేక పిల్లల గురించి ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఆయన వెంటనే ఆ రెండు జబ్బులను ఆరోగ్య శ్రీ పథకం కింద చేర్చి, బాలికలకు ఉచితంగా వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు ఆ బాలికలకు హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. వీరిద్దరికీ రూ. 60 లక్షలు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించింది. ఇప్పుడా బాలికలు ఆరోగ్యంతో ఉన్నారు. వారి కుటుంబాల్లో ఆనందం నింపారు.
ఉల్లాసంగా జోయా
వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన డ్రైవర్ ఎస్. జాకిర్, షాను దంపతుల కుమార్తె జోయాకు మూడు నెలల వయస్సులో ఉన్నప్పుడు చర్మంపై దద్దుర్లు వచ్చాయి. పాప పెరిగేకొద్దీ దద్దుర్లు ఎక్కువై, చర్మం ఎర్రగా మారింది. రక్తస్రావం అయ్యేది. దీంతో కడప, తిరుపతి, హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో చికిత్స చేయించారు. లక్ష మందిలో ఒకరికి అరుదుగా వచ్చే హైపర్ ఐజీఈ సిండ్రోమ్ అనే జబ్బు పుట్టుకతోనే పాపకు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ జబ్బు క్యాన్సర్‌కు దారితీస్తుందని వైద్యులు చెప్పారు. అల్లోజెనిక్ బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని, రూ. 35 లక్షల వరకూ ఖర్చవుతుందని తెలిపారు. అప్పటికే రూ. 10 లక్షల మేర అప్పు చేసిన జాకిర్ దంపతులు ఆందోళనకు గురయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే ద్వారా విషయం సీఎం జగన్‌కు చేరింది. వెంటనే స్పందించి, ఆరోగ్య శ్రీ పథకం కింద పాపకు వైద్యం అందించాలని ఆదేశించారు. తొమ్మిది నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో పాపకు బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. వైద్యానికి అయిన రూ. 35 లక్షలు ప్రభుత్వమే భరించింది.
పునర్జన్మ ప్రసాదించారు
మా పాపకు సీఎం జగన్ పునర్జన్మ ప్రసాదించారు. చికిత్సకు భారీ మొత్తం ఖర్చు పెట్టే స్తోమత లేక పాపపై ఒక దశలో ఆశలు వదులుకున్నాం. చివరి ప్రయత్నంగా సీఎంకు వినతి పెట్టుకున్నాం. ఆయన వెంటనే స్పందించి, పాపకు ఉచితంగా వైద్యం అందించారు.
– షేక్ షాను, పాప తల్లి, రాయచోటి
ఆరోగ్యంగా యువంకిత
కృష్ణా జిల్లా లంకపల్లికి చెందిన కుంపటి కోటేశ్వరరావు, మహాలక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీలు. వారి కుమార్తె యువంకితకు 13 ఏళ్లు. పాప 10 ఏళ్ల వయసులో ఉండగా కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలికకు అప్లాస్టిక్ అనీమియా అనే జబ్బు ఉందని, దాని వల్ల శరీరంలో ఎముక మజ్జ కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేయడంలేదని వైద్యులు నిర్ధారించారు. ప్రతి 3.5 లక్షల మంది పిల్లల్లో ఒకరికి ఈ జబ్బు వస్తుందని వైద్యులు తెలిపారు. వెల్లూరు సీఎంసీలో చికిత్సకు రూ. 25 లక్షలు అవసరమని చెప్పారు. తిండి గడవడమే కష్టమైన పరిస్థితుల్లో అంత డబ్బు సమకూర్చడం సాధ్యం కాలేదు. ఎలాగోలా తిప్పలు పడి పాపకు తరచూ రక్తాన్ని ఎక్కిస్తూ కాపాడుకుంటూ వస్తున్నారు. కుమార్తె ఆరోగ్యంపై దిగులుతో గత ఏడాది కోటేశ్వరరావు చనిపోయాడు. దీంతో మహాలక్ష్మి మరింత దిగులు చెందింది. గ్రామంలో తెలిసిన వ్యక్తుల ద్వారా కలెక్టర్ దృష్టికి పాప విషయాన్ని కోటేశ్వరరావు కుటుంబం తీసుకువెళ్లింది. కలెక్టర్ ద్వారా సీఎం జగన్‌కు తెలిసింది. ఆయన వెంటనే ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. యువంకితకు ఆరోగ్య శ్రీ కింద ఈ ఏడాది ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లో బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స అందింది. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉంది. యువంకిత వైద్యానికి అయిన రూ.25 లక్షలు ప్రభుత్వమే చెల్లించింది.
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం
నా కుమార్తెకు రెండేళ్ల క్రితం జబ్బు ఉన్నట్టు నిర్ధారణ అయింది. కొత్త రక్తం ఎక్కిస్తూ, ఆసుపత్రుల్లో వైద్యం చేయిస్తూ పాప ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాం. గత ఏడాది పాప ఆరోగ్యంపై దిగులుతో నా భర్త కోటేశ్వరరావు గుండెపోటుతో చనిపోయారు. గ్రామంలో తెలిసిన వాళ్ల ద్వారా ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే ఉచితంగా పాపకు చికిత్స చేశారు. భర్తను కోల్పోయా. కుమార్తెను కూడా కోల్పోతానేమోనని చాలా ఆందోళన చెందాను. అలాంటి పరిస్థితుల్లో పాపకు ఉచితంగా వైద్యం చేయించి, ప్రాణాలు నిలబెట్టిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం.
– మహాలక్ష్మి, బాలిక తల్లి, లంకపల్లి
Comments
Please login to add a commentAdd a comment