సాక్షి, విజయవాడ: ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సూచనల మేరకు ఫీజులు తగ్గిస్తూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం జీఓ నెంబర్ 146ను జారీ చేసింది. దీంతో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద వైద్య విద్య అభ్యసించే ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. ఇందుకు సంబంధించిన ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వం ఆయా కోర్సుల ఫీజులను ఖరారు చేసింది. ప్రైవేట్, మైనార్టీ కాలేజీలకు ఇవి వర్తిస్తాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ ఎంబీబీఎస్‌కు ఐదేళ్ల ఫీజు వసూలు చేస్తుండగా, ఇకపై నాలుగున్నరేళ్లకు మాత్రమే తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తాజాగా నిర్ణయించిన ఫీజులు 2020-21 నుంచి 2022-23 వరకూ అమల్లో ఉంటాయని ఆయన వెల్లడించారు. కాగా, 17 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, 14 డెంటల్ కాలేజీలకు ఈ ఫీజులు నిర్ణయించారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాల్టీ కోర్సులకూ వీటిని ఖరారు చేశారు. ఏ ప్రైవేట్ కళాశాల అయినా సరే ఇతరత్రా ఫీజుల పేరుతో వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. అంతేకాక.. మెడికల్, డెంటల్ అభ్యర్థులకు విధిగా స్టైఫండ్ చెల్లించాలన్నారు.
ఈ సందర్భంగా రాష్డ్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియకి సిద్దమవుతున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. తొలివిడత కౌన్సిలింగ్‌ని నాలుగైదు రోజులలో ప్రారంభిస్తామన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. అలాగే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకి ఎ,బి,సి కేటగిరీ ఫీజులు ఖరారు చేస్తూ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమీషన్ సూచనల మేరకే నిర్ణయించామని తెలిపారు. (ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్)
ఎంబీబీఎస్ కన్వినర్ కోటా ఫీజు రూ.15 వేలగా నిర్ణయించగా... బి కేటగిరీ ఫీజు ఏటా రూ.12 లక్షలుగా.. ఎన్నారై కోటా ఫీజు రూ.36 లక్షలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఇక దంత వైద్య సీట్లకి కన్వినర్ కోటాకి రూ.13 వేలు, బి కేటగిరీకి రూ.4 లక్షలు, ఎన్నారై కోటాకి 12 లక్షల రూపాయిలుగా ఫీజులగా నిర్ణయించడం జరిగిందన్నారు. 2019-20 సంవత్సరంతో పోలిస్తే బీ, సీ కేటగిరి ఫీజులు తగ్గాయన్నారు. ఈ కొత్త ఫీజులు 2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరం వరకు అమలులో ఉంటాయన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియని రెండు విడతలలో పూర్తి చేస్తామని.. రెండో విడత కౌన్సిలింగ్ ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో చేపట్టనున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. (ఏపీలో పెట్టుబడులకు తైవాన్ కంపెనీల ఆసక్తి)
ఫీజుల వివరాలు:
►ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కింద రూ.15వేలు ఫీజు
►బి కేటగిరీ (మేనేజ్మెంట్) కోటా కింద రూ.12లక్షల ఫీజు
►ఎంబీబీఎస్ కోర్సులో బి కేటగిరీకి 6.8లక్షల వరకు ఫీజు తగ్గింపు
►సి కేటగిరీ (ఎన్ఆర్ఐ) కోటా కింద రూ.36లక్షల ఫీజు
►ఎన్ఆర్ఐ కోటాలో రూ.16లక్షల వరకు ఫీజు తగ్గింపు
►బీడీఎస్ కోర్సు కన్వీనర్ కోటా కింద రూ.13వేలు ఫీజు
►బీడీఎస్- బి కేటగిరీ (మేనేజ్మెంట్) కోటా కింద రూ.4 లక్షల ఫీజు
►బీడీఎస్ (మేనేజ్మెంట్) కోటాలో రూ.7లక్షల వరకు ఫీజు తగ్గింపు
►బీడీఎస్ - సి కేటగిరీ (ఎన్ఆర్ఐ) కోటా కింద రూ.12 లక్షల ఫీజు
►బీడీఎస్ (ఎన్ఆర్ఐ) కోటా కింద రూ.50 లక్షలకు పైగా ఫీజు తగ్గింపు
Comments
Please login to add a commentAdd a comment