
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) యూజీ–2023 తేదీ ఖరారైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నీట్ యూజీ–2023 క్యాలెండర్‌ను శుక్రవారం ప్రకటించింది. వచ్చే ఏడాది మే 7న దేశ వ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్ష రాయడానికి దరఖాస్తుల ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు పేర్కొంది.
17 ఏళ్ల వయసు కలిగి, గుర్తింపు కలిగిన బోర్డుల్లో బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ కోర్ సబ్జెక్టులుగా ఇంటర్ లేదా సమానమైన డిప్లమో కోర్సులు చేసిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. దేశ వ్యాప్తంగా 645 మెడికల్, 318 డెంటల్, 914 ఆయుష్, ఇతర కళాశాలల్లో నీట్–యూజీ అర్హత ఆధారంగా ప్రవేశాలుంటాయి. నీట్ యూజీ–2022ను ఈ ఏడాది జూలై 17న దేశ వ్యాప్తంగా నిర్వహించారు. ఈ పరీక్షకు ఏపీలో 65,305 మంది హాజరు కాగా 40,344 మంది అర్హులుగా నిలిచారు.
దేశవ్యాప్తంగా 17,64,571 మంది పరీక్ష రాశారు. వీరిలో 9.93 లక్షల మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేట్, 2 మైనారిటీ, శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 2,185, ప్రైవేట్, మైనారిటీ కళాశాలల్లో 3,175 ఎంబీబీఎస్ సీట్లు కలిపి రాష్ట్రంలో 5,360 ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం 5 వైద్య కళాశాలల్లో 2023 నుంచి అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. 2023 నుంచి ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment