సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత పాలకులు స్వలాభంతో అవసరానికి మించి కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్‌ఈజెడ్) కోసం బలవంతంగా సేకరించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రైతులకు ఇచ్చేస్తోంది. ఇలా సెజ్ కోసం సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇవ్వడమనేది దేశంలోనే ఇది మొదటిసారి. కేఎస్‌ఈజెడ్ అవసరం మేరకు ఉంచి, బలవంతంగా సేకరించిన భూములను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమే భూ యజమానుల పేరుతో తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తోంది.
నిజానికి.. నాడు భూసేకరణ వద్దని ఎదురుతిరిగిన రైతులను చంద్రబాబు సర్కారు వారిని గృహ నిర్బంధంలో పెట్టి భూములను బలవంతంగా లాగేసుకుంది. ఆ సమయంలో నాటి విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. కేఎస్‌ఈజెడ్ బాధితుల గ్రామాల్లో పర్యటించారు. బలవంతంగా సేకరించిన భూములను అధికారంలోకి రాగానే తిరిగి ఇచ్చేస్తామని మాట ఇచ్చారు. ఆయన సీఎం అయ్యాక ఆ మాటను నిలబెట్టుకుంటున్నారు. రైతుల పేరుతో తిరిగి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియకు ప్రభుత్వం ఇటీవలే శ్రీకారం చుట్టింది. దీనిపై బాధిత రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ప్లేటు ఫిరాయించిన ‘బాబు’
కాకినాడ తీరంలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుచేసేందుకు అవసరమైన భూముల సేకరణకు చంద్రబాబు సర్కార్ 2002లో నోటిఫికేషన్ ఇచ్చింది. 2006 నుంచి 2011 మధ్య భూ సేకరణ జరిగింది. ప్రభుత్వం 3,400.13 ఎకరాలు కొనుగోలు చేసి, కేఎస్‌ఈజెడ్‌కు ఇవ్వగా, 4,558.39 ఎకరాలను సెజ్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో 2,180 ఎకరాలకు చెందిన 1,307 మంది రైతులు అవార్డు తీసుకోలేదు.. భూములూ ఇవ్వలేదు.
రైతులకు ఇబ్బంది కలగకూడదన్న వైఎస్సార్
2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ఆయన రైతులకు ఇబ్బందిలేని రీతిలో భూ సేకరణ జరగాలని ఆదేశించారు. కానీ, అధికారంలో ఉన్నప్పుడు రైతుల నోట మట్టికొట్టిన చంద్రబాబు.. అధికారం కోల్పోయేసరికి ప్లేటు ఫిరాయించారు. అక్రమంగా భూములు దోచుకుంటున్నారని, సెజ్‌ను రద్దుచేసే వరకూ నిద్రపోనని, అధికారంలోకి వచ్చాక సెజ్ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. భూములను వైఎస్ కుటుంబమే కొనుగోలు చేసిందనే దుష్ప్రచారం చేశారు.
2014లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే మళ్లీ మాట మార్చారు. తన బినామీలకు లబ్ధిచేకూర్చేందుకు అక్రమ కేసులు, గృహ నిర్బంధాలతో రైతుల నుంచి భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక.. సెజ్ బాధిత గ్రామాలపై పోలీసులు ఉక్కుపాదం మోపి, అనేకమందిపై అక్రమ కేసులు పెట్టారు. ఆ సమయంలో ప్రజాసంకల్ప యాత్ర కోసం వైఎస్ జగన్ కేఎస్‌ఈజెడ్ గ్రామమైన పెరుమాళ్లపురంలో పర్యటించారు. ‘సెజ్ భూములు నావేనని చంద్రబాబు అంటున్నారు. అదే నిజమైతే భూములన్నీ మీరే తిరిగి తీసేసుకోవచ్చు’ అని జగన్ ప్రకటించారు.
అవసరానికి మించి చంద్రబాబు బలవంతంగా సేకరించిన భూములను ఆయా రైతులకు తిరిగి ఇచ్చేస్తామని కూడా హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన మాటను అమలుచేసేందుకు సీఎం జగన్ ఇప్పుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా.. కొత్తపల్లి, తొండంగి మండలాల్లో 148 ఎకరాలను 478 మంది రైతుల పేరుతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రెండు మండలాల్లో 597 ఎకరాలను భూమికి భూమి పద్ధతిలో కొనుగోలు చేసి రైతులకు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ఎంఎల్‌హెచ్‌పీలకు జోన్–2లోనే ఎక్కువ ఖాళీలు
Comments
Please login to add a commentAdd a comment