
తిరుపతి రూరల్: క్షేత్రస్థాయిలోనే రైతు సమస్యలకు ఉత్తమ పరిష్కార కేంద్రంగా ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు) అద్భుతమని రాజస్థాన్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) జస్వంత్‌సింగ్ కొనియాడారు. ఆయన ఆదివారం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అగ్రికల్చర్ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రంలోని ఆర్‌బీకేని సందర్శించారు.
వ్యవసాయ శాఖాధికారులు, రైతులతో మాట్లాడారు. ఆర్‌బీకేలో రైతుల సంక్షేమం, అధిక దిగుబడి కోసం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న నాణ్యమైన క్రిమిసంహారిక మందులు, రైతులకు సీజన్ల వారీగా అందిస్తున్న సేవలను తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ప్రసాద్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆర్‌బీకేలో కియోస్క్ పనితీరు, వివిధ అవసరాలకు రైతులు కియోస్‌్కను ఉపయోగించుకుంటున్న విధానాన్ని వారు ఆసక్తిగా పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్‌బీకేలను ఏర్పాటు చేసిన తర్వాత వ్యవసాయ, పశుసంవర్ధకశాఖల అధికారులు రోజూ అందుబాటులో ఉంటున్నారని, విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించామని రైతులు తెలిపారు.
అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీ జస్వంత్‌సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఆర్‌బీకే వంటి పథకాలపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోందని చెప్పారు. అందులో భాగంగానే వ్యవసాయాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో వాటిని పరిశీలించేందుకు వచి్చనట్లు తెలిపారు. నిజంగానే ఆర్‌బీకేలు రైతులకు అద్భుతంగా సేవలు అందిస్తున్నాయని కితాబిచ్చారు. ఈ విషయమై తమ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖాధికారి సంగన మమత, అగ్రికల్చర్ అసిస్టెంట్ అయేషా, రైతులు పాల్గొన్నారు.
చదవండి: అన్ని ఆర్బీకేల్లో యంత్ర సేవా కేంద్రాలు!