
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈనెల 21వతేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగం క్రియాశీలకంగా వ్యవహరించేలా శాసనసభ్యులు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పరిశీలకులు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్ సీపీ 175కి 175 స్థానాలను ఖాయంగా గెలుచుకునే వాతావరణం ఉందన్నారు. దొంగ ఓట్ల తొలగింపుతోపాటు అర్హులను ఓటర్లుగా చేర్చేలా అప్రమత్తంగా ఉండాలన్నారు. 2014 – 19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బోగస్, సెకండ్ ఓట్లను చేర్చి వారికి అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసిందన్నారు.
బూత్ స్థాయిలో బోగస్ ఓట్లను గుర్తించి ఎన్నికల కమిషన్ దృష్టికి తేవాలన్నారు. పార్టీ బూత్ కమిటీల ఇన్ ఛార్జులు, గృహ సారథులతో దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని సూచించారు. తరచూ ముందస్తు ఎన్నికలనే ప్రచారాన్ని తెరపైకి తెస్తూ క్యాడర్‌ను కాపాడుకునేందుకు టీడీపీ ఆపసోపాలు పడుతోందని వ్యాఖ్యానించారు. శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ పరిశీలకులు, జేసీఎస్ కోఆర్డినేటర్లతో సజ్జల ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దీనికి సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సజ్జల ఏమన్నారంటే..
ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి..
దాదాపు 25 లక్షలకు పైగా అసైన్డ్ భూములు, 2 లక్షల ఎకరాల మేర చుక్కల భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 1.87 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. దశాబ్దాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన దుస్థితికి సీఎం జగన్ పరిష్కారం చూపారు. ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి మంచి నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. లబ్ది దారులతో ఎక్కడికక్కడ కార్యక్రమాలను నిర్వహించాలి. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణను ధర్మకర్తలకే అప్పగించడం లాంటి నిర్ణయాలు తీసుకున్నాం.
సంధాన కర్తలుగా పార్టీ పరిశీలకులు..
పార్టీ పరిశీలకులుగా నియమితులైనవారు శాసనసభ్యులకు, పార్టీ కోఆర్డినేటర్లకు సంధానకర్తలుగా వ్యవహరించాలి. సీఎం జగన్ మాటల్లో చెప్పాలంటే ఆయా నియోజకవర్గాలలో పరిశీలకులు ఎక్కువ సమయం వెచ్చించాలి. స్థానిక నేతల మధ్య చిన్న చిన్న బేధాభిప్రాయాలుంటే సర్దుబాటు చేయాలి. అవసరమైతే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల దృష్టికి, కేంద్ర కార్యాలయం దృష్టికి తేవాలి. ప్రజల ఆశీస్సులను ఓట్లుగా మలుచుకుని ఫలితాలు సాధించేలా కృషి చేయాలి. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం, ఏమరుపాటు పనికిరాదని గడప గడపకూ సమీక్షల్లో సీఎం జగన్ స్పష్టం చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నా.