సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుదామని ఉద్యోగ సంఘాలను ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ఆహ్వానించారు. గురువారం తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి్త చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ విద్రోహ శక్తులు చొరబడి సమస్యను పక్కదారి పట్టించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉద్యోగులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పీఆర్సీ వల్ల ఏ ఒక్క ఉద్యోగి వేతనమూ తగ్గలేదన్నారు. ఉద్యమాలతో ఉద్యోగులకు నష్టం చేయవద్దని కోరారు. ఇప్పటికే ఉద్యోగుల ఖాతాల్లో జమ అయిన జీతాలను పరిశీలించుకుంటే తగ్గాయో పెరిగాయో వారికే అర్థమవుతుందన్నారు.
మిగతావాటిపై ముందుకు రావాలి..
ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ మంగళవారం సాయంత్రం, బుధవారం ఉదయం చర్చించినట్లు సజ్జల తెలిపారు. మూడు డిమాండ్లపైనే పట్టుబట్టడం సరి కాదని, మిగతా అంశాల పరిష్కారానికి ముందుకు రావాలని కోరారు. ఆ 3 డిమాండ్లకు కాలం చెల్లిందన్నారు. ఇప్పటికే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేశామని, మిగతా రెండు డిమాండ్లు నెరవేర్చడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యే అవకాశం లేదన్నారు. పీఆర్సీ నివేదికను ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు.
వైషమ్యాలతో సాధించేదేముంది?
అసలు సమస్యలపై చర్చించేందుకు రావాలని, ఉద్యోగ సంఘాల కార్యాచరణ వాయిదా వేసుకోవాలని కోరితే ఇప్పటివరకూ ఎలాంటి లేదని సజ్జల పేర్కొన్నారు. సమ్మెకు దిగక ముందే చలో విజయవాడ పేరుతో రోడ్డెక్కడం సరి కాదన్నారు. ఆ పేరుతో చేసేది బలప్రదర్శనే మినహా మరొకటి కాదన్నారు. సామరస్యంగా పరిష్కరించుకుందామని, ఉద్యమాల ద్వారా సమస్యను జఠిలం చేసుకోవద్దని హితవు పలికారు. సీపీఎస్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఒక పట్టాన తెగేవి కాదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులపై అభిమానంతోనే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశామని సజ్జల తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను సమ్మెలోకి దించి బస్సులు ఆపి బల ప్రదర్శన చేయాలని చూస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యతని, కరోనా నేపథ్యంలో ఆందోళనలకు అనుమతి లేదన్నారు. ఉద్యోగులపై చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవదన్నారు. కరోనా వల్ల ఆదాయం తగ్గి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని పలుదఫాలు చెప్పామని, ఇది ఉద్యోగ సంఘాలకు తెలియంది కాదన్నారు.
రాజధానిపై...
ఇప్పుడు వెలగపూడి నుంచే పరిపాలన సాగుతోందని, సాంకేతికంగా పాలన ఎక్కడినుంచి జరుగుతుందో అదే ప్రస్తుత రాజధాని అవుతుందని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలనను వికేంద్రీకరించాలని నిర్ణయించామని, అందులో భాగంగానే 3 రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ నిర్ణయం మేరకు భవిష్యత్తులో రాజధాని మార్పు ఉంటుందన్నారు. బడ్జెట్‌లో కేంద్రం ఏటా రాష్ట్రానికి అన్యాయమే చేస్తోందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ వల్లే ప్రత్యేక హోదా ఇప్పటికీ సజీవంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment