
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత చంద్రబాబు పాలనను ప్రజలు తిరస్కరించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు టీడీపీ పాలనను చీత్కరించి కొత్త ఆశలతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు.
30మే 2019లో అధికారం చేపట్టి 2020, 2021 సంవత్సరాలను పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. 2020లో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ విస్తరించిందని తెలిపారు. అప్పటికే టీడీపీ ప్రభుత్వం మిగిల్చిన రుణభారంతో రాష్ట్రం కుంగిపోయిందని.. కరోనా కూడా దెబ్బకొట్టిందని చెప్పారు.
ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొని సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను మొదటి ఏడాదిలోనే 95 శాతం అమలు చేశారని వివరించారు. ఏ పథకంలో కూడా అంతరాయం లేకుండా పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన పథకాలు సామాన్యమైనవి కావని, గ్రామ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం జనజీవనంలో భాగమయ్యాయని పేర్కొన్నారు.