విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో రక్షణ పరిశోధన – అభివృద్ధి సంస్థ విజ్ఞాన్ ప్రసార్ సంయుక్త వైజ్ఞానిక ప్రదర్శన తిలకిస్తున్న డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ సతీష్‌రెడ్డి
సాక్షి, అమరావతి: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువత మరిన్ని పరిశోధనలు చేసి దేశాన్ని అగ్రగామిగా నిలపాలని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి చెప్పారు. ‘ఆజాదీ అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఇస్రో, డీఆర్‌డీవో, ఎన్‌ఐటీలు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా)లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. అనంతరం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశ ప్రగతిని, భవిష్యత్తులో సాధించాల్సిన అభివృద్ధిని అక్కడికి వచ్చిన విద్యార్థులకు వివరించారు. స్వాతంత్య్రం సాధించిన 75 ఏళ్లలోనే భారతదేశం అన్ని రంగాల్లోనూ గణనీయమైన ప్రగతి సాధించిందని చెప్పారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన ఐదారు దేశాల సరసన నిలిచిందని తెలిపారు. స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తయ్యే నాటికి.. అంటే 2047కు అన్ని రంగాల్లోనూ దేశాన్ని అగ్రగామిగా నిలపాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని తెలిపారు. దేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువత ఉన్నారని, వీరిలో అధికశాతం పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఉత్సుకత చూపుతున్నారని చెప్పారు. ఇటీవల 60 వేల స్టార్టప్‌లు ప్రారంభం కావడమే ఇందుకు నిదర్శనమన్నారు.
కరోనా మహమ్మారి ప్రబలిన మూడున్నర నెలల్లోనే.. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించిన ఘనత మనకు దక్కిందన్నారు. కరోనా మహమ్మారి తొలి దశలో విరుచుకుపడినప్పుడు డీఆర్‌డీవో అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా రోజుకు నాలుగు లక్షల పీపీఈ కిట్‌లు, 60 వేలకుపైగా వెంటిలేటర్లను తయారుచేసి, దేశంతో పాటు ప్రపంచానికీ అందించామన్నారు. రక్షణ రంగంలో అత్యున్నత ప్రమాణాలతో వివిధ రకాల క్షిపణులను తయారుచేశామని వివరించారు.
వీటిని దేశ రక్షణ అవసరాలకు వినియోగించడంతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నామన్నారు. ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలతో అర్జున్ ట్యాంక్‌ను తయారుచేశామని చెప్పారు. రోదసీ రంగంలో అమెరికా, చైనా, రష్యాలతో ఇస్రో పోటీ పడుతోందన్నారు. చంద్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలకు చంద్రయాన్, మంగళయాన్‌లను చేపట్టామని వివరించారు. ప్లాస్టిక్‌ను నిర్మూలించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పారు. ప్లాస్టిక్ బ్యాగ్‌ల స్థానంలో పర్యావరణ హితమైన బయోడిగ్రేడబుల్ బ్యాగ్‌లను డీఆర్‌డీవో రూపొందించిందన్నారు. ఈ పరిజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తామని, ఆ బ్యాగ్‌లను విరివిగా తయారుచేయాలని యువతకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment