మహారాణిపేట: విశాఖ తూర్పు నియోజకవర్గంలో దొంగ ఓట్లు రగడ సృష్టిస్తున్నాయి. నియోజకవర్గంలో సుమారు 40 వేల నకిలీ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని ఇళ్లలో వాస్తవంగా ముగ్గురు, నలుగురు ఉంటే.. 10 నుంచి 15 వరకు ఓటర్లు ఉన్నట్లు జాబితాలో ఉండడం కలకలం రేపింది. దీంతో అధికారులు ఆ ఓట్లను తొలగించారు. వాటిని తిరిగి చేర్చాలని తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అవన్నీ తెలుగుదేశం పార్టీ వారు చేర్పించిన దొంగ ఓట్లని, వాటిని తిరిగి జాబితాలో చేర్చవద్దని వైఎస్సార్‌సీపీ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు ఇరు పార్టీల నేతలు మంగళవారం కలెక్టర్ మల్లికార్జునకు వినతిపత్రాలు సమర్పించారు. దీంతో ఈ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ వారే అక్రమంగా జాబితాలో చేర్పించారన్న ఆరోపణలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి. ఎటువంటి వివాదాలు చెలరేగకుండా కలెక్టరేట్ వద్ద పోలీసులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు.
దొంగ ఓట్లతోనే వెలగపూడి గెలుపు
విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నేత వెలగపూడి రామకృష్ణబాబు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతి ఎన్నికలకు ముందు వెలగపూడి దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, ఆ ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, వీఎంఆర్డీఏ చైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల ఆరోపించారు. ఈమేరకు ఆమె కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దొంగ ఓట్లన్నింటినీ పూర్తిగా తొలగించాలని, తొలగించిన ఓట్లను తిరిగి జాబితాలో చేర్చవద్దని కలెక్టర్‌ను కోరారు.
అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. వెలగపూడి స్థానికేతరుడు కావడం వల్ల విజయవాడ, గుంటూరు, గన్నవరం తదితర ప్రాంతాల ప్రజలు, గీతం కాలేజీ విద్యార్థులను ఓటర్ల కింద నమోదు చేశారని ఆరోపించారు. ఒకే ఇంటి నంబర్‌పై 20 ఓట్లు ఉంటున్నాయని, 2019 ఎన్నికల్లో జనవరి నుంచి మార్చి వరకు కనీసం 40,000 ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. దొంగ ఓట్లతో గెలవడం నిజమైన విజయం కాదన్నారు. ప్రజలకు మంచి చేసి ఓట్లు వేయించుకోవాలని అన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.
ఇష్టానుసారం తొలగించేశారు: వెలగపూడి
మరోపక్క టీడీపీ ఓట్లు తొలగించారంటూ ఎమ్మెల్యే రామకృష్ణబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో అక్రమంగా 40,000 ఓట్లు తొలగించారని వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు మాత్రమే తొలగించారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యేకు 30,000 నుంచి 40,000 ఓట్లు నమోదు చేసే అవకాశం ఉంటుందా అని ప్రశ్నించారు. తొలగించిన ఓట్లన్నీ తిరిగి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఓట్లు తొలగించిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment