చంద్రయాన్‌లో మనోళ్లు..  | Scientists from our state in Chandrayaan | Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌లో మనోళ్లు.. 

Published Thu, Aug 24 2023 3:47 AM | Last Updated on Thu, Aug 24 2023 3:48 AM

Scientists from our state in Chandrayaan - Sakshi

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా)/ఒంటిమిట్ట/విజయనగరం అర్బన్‌/రాజంపేట టౌన్‌ :  పున్నమి చంద్రుడి సొగసు చూస్తూ మురిసిపోయిన భారతావని.. ఇప్పుడా నెలరాజుపై పరిశోధనలకు ల్యాండర్‌ విక్రమ్‌ను దింపి విజయగర్వంతో ఉప్పొంగుతోంది. ప్రపంచ దేశాలన్నీ భారత్‌ వైపు చూసేలా చేసింది.

ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ ప్రక్రియను విజయవంతం చేయడంలో మన రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్తలూ ఉన్నారు. వీరిలో చిత్తూరుకు చెందిన కె. కల్పన, వైఎస్సార్‌ కడప జిల్లా యువతి అవ్వారు చందన.. విజయనగరానికి చెందిన డా. కరణం దుర్గాప్రసాద్‌.. రాజంపేటకు చెందిన ఎర్రబాలు రాజేంద్ర ఉండటం మనందరికీ గర్వకారణం.

అలాగే.. చిత్తూరుకు చెందిన కె. కల్పన ప్రముఖ పాత్ర పోషించడం తెలుగు వారికి గర్వకారణం. ల్యాండర్‌ సేఫ్‌ ల్యాండింగ్‌ అయిన వెంటనే బెంగళూరులోని ఇ్రస్టాక్‌ కేంద్రంలో ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రాజెక్టులో ఆమె అసోసియేట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ల్యాండర్‌ను సేఫ్‌గా దించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి.. మధురమైన జ్ఞాపకమన్నారు. ఈ ప్రయోగం సక్సెస్‌తో కల్పనకు ప్రత్యేకమైన గౌరవం లభించడమే కాక తెలుగుజాతి మొత్తం ఆమెకు అభినందనలు తెలియజేస్తోంది. మిగిలిన ముగ్గురూ చంద్రయాన్‌–3లో తమ అనుభవాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు..  

థర్మోఫిజికల్‌ లీడ్స్‌లో ఒకడిని.. 
అహ్మదాబాద్‌లోని అంతరిక్షం ఇస్రో విభాగమైన ఫిజికల్‌ రీసెర్చ్‌ లా»ొరేటర్‌ (పీఆర్‌ఎల్‌)లో ప్లానెటరీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. చంద్రయాన్‌–1 నుంచి ప్రస్తుత చంద్రయాన్‌–3 వరకు పనిచేసిన అనుభవం ఉంది. చంద్రుని ఉపరితల థర్మోఫిజికల్‌ ప్రయోగం (సీహెచ్‌ఏఎస్‌టీఈ) అనే పరికరం లీడ్స్‌లో నేను ఒకడిని. ఇదొక థర్మామీటర్‌లా పనిచేస్తుంది.

చంద్రుని మొదటి ఉపరితలం సీటు థర్మల్‌ ప్రొఫైల్‌ను అందించేందుకు చంద్రుని ఉష్ణోగ్రతలను కొలుస్తుంది. చంద్రునిపై నీటి ఉనికి, స్థిరత్వం, చలనశీలతను నిర్దేశించే ప్రయోగం ఇది. భవిష్యత్తులో చంద్రుని అన్వేషణలో ముఖ్యమైన అంశం అయిన నీరు–మంచు, ఇతర వనరుల స్థిరత్వ మండలాల గురించి చెప్పే ముఖ్యమైన ప్రయోగం చంద్రయాన్‌–3.  – డాక్టర్‌ కరణం దుర్గాప్రసాద్, విజయనగరం 


మాటల్లో వర్ణించలేని ఆనందమిది.. 
చంద్రయాన్‌–3 ప్రయో గం జరుగుతున్న తరుణంలోనే నేనూ సైంటిస్ట్‌ అయ్యి ఈ ప్రయోగంలో భాగస్వామ్యం కావడం, అలాగే చంద్రయాన్‌–3 విజయవంతం కావ డం మాటల్లో వర్ణించలేని ఆనందాన్ని ఇస్తోంది. విక్రమ్‌ ల్యాండర్‌ చందమామకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఉత్కంఠభరితమైన క్షణాలను గడిపాం. చందమామపై విక్రమ్‌ ల్యాండర్‌ సాఫ్ట్‌గా ల్యాండ్‌ అయిన క్షణం నాకు తెలియకుండానే నా కళ్ల నుంచి ఆనందభాష్పాలు వచ్చాయి.

ఈ ప్రయోగం నా జీవితంలో మరచిపోలేని ఓ తీపిగుర్తు. నేను ఎంటెక్‌ పూర్తిచేశాక హైదరాబాద్‌లోని క్వాల్‌కం కంపెనీ తమ సంస్థలో ఉద్యోగం ఇ చ్చేందుకు రూ.43 లక్షల ప్యాకేజీ ఆఫర్‌ ఇచ్చింది. అయితే, తన మేధస్సును దేశానికి ఉపయోగించాలన్న ఆలోచనతో ఆ ఉద్యోగాన్ని తిరస్కరించా.

ఆ తరువాత తన అడుగులు శా స్త్రవేత్తగా ఈ రంగంపై పడ్డాయి. అన్నమ య్య జిల్లా రాజంపేట మండలం దిగువ బసినా యుడుగారిపల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసే వై.సుబ్రమణ్యంరెడ్డి, చ ంద్రకళ.. రాజేంద్రప్రసాద్‌రెడ్డి తల్లిదండ్రులు.  – ఎర్రబాలు రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి, రాజంపేట 

ఇది చిన్నప్పటి కల.. 
వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం, కొత్తమాధవరం మా స్వగ్రామం. తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో హైదరాబాద్‌ వారు నిర్వహించిన యంగ్‌ సైంటిస్ట్‌ కార్యక్రమంలో ప్రతిభ చూపడంతో శాస్త్రవేత్తగా ఎదిగేందుకు అవసరమైన సూచనలు చేశారు. ఇంటర్‌లో ఉపకార వేతనం లభించింది.

కడపలోని అంబేద్కర్‌ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతూ డీఏఐడీ పూర్తిచేశాను. విజయవాడలో డీఎస్సీ శిక్షణ తీసుకున్న అనంతరం ఇస్రో పరీక్షలకు సిద్ధమై ఎంపికయ్యాను. మూడో స్థానం దక్కింది. తల్లి ఆదిలక్ష్మి, అమ్మమ్మ సాలమ్మల ప్రోత్సాహం మరువలేనిది.

ఇస్రోకు ఎంపికైన తర్వాత బెంగళూరు యుఆర్‌.రావు శాటిలైట్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాను. అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో రాకెట్‌ లాంచ్‌ అంశంపై అవగాహన పెంచుకున్నా. చంద్రయాన్‌–3 డిజైనర్‌గా నేను భాగస్వామి కావడం నాకు ఆనందంగా ఉంది. ఇది నా చిన్నప్పటి కల. మరిన్ని విజయాల్లో నేనూ భాగస్వామి కావాలని ఉంది. – చందన, కొత్త మాధవవరం, ఒంటిమిట్ట మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement