ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 15.90 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి
కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. భద్రాచలం వద్ద ప్రమాదకరంగా ప్రవాహం
పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల నుంచి 13.35 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల
ఎగువన వర్షాలు తెరిపి ఇవ్వడంతో క్రమంగా తగ్గుముఖం
సాక్షి, అమరావతి/సాక్షి, అమలాపురం/ధవళేశ్వరం/చింతూరు/పోలవరం రూరల్: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మరింత ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం సా.6 గంటలకు బ్యారేజ్‌లోకి 15,99,761 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా.. డెల్టా కాలువలకు తొమ్మిది వేల క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 15,90,761 క్యూసెక్కుల ప్రవాహాన్ని అధికారులు 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి గరిష్టంగా వచ్చిన వరద ఇదే. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 15.7 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
మరోవైపు.. శనివారం రాత్రి నుంచి బేసిన్‌లో వర్షాలు కాస్త తెరిపివ్వడంతో ఎగువనున్న ప్రాణహిత, ఇంద్రావతి తదితర ఉప నదుల్లో వరద ప్రవాహం క్రమేణ తగ్గుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం కూడా క్రమేణ తగ్గుతోంది. ఆదివారం రాత్రి 7 గంటలకు 48.4 అడుగులకు చేరుకుంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుని రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇక చింతూరు, కూనవరం వద్ద శబరి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో గ్రామాలు, రహదారులు ముంపులోనే ఉన్నాయి.
చింతూరు డివిజన్‌లోని నాలుగు మండలాల్లోని 191 గ్రామాలు వరదలకు ప్రభావితమైనట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. 35,746 కుటుంబాలను 149 పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టులోకి 13,35,413 క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్ వే 48 గేట్ల ద్వారా ఆ మొత్తాన్ని దిగువకు వదిలేస్తున్నారు. స్పిల్ వే ఎగువన నీటి మట్టం 34.12 మీటర్లకు తగ్గింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గంలోని పోలీస్ చెక్‌పోస్ట్‌లో రెండు అడుగుల మేర నీరు చేరింది. దీంతో దీనిని మరోచోటుకి మార్చారు.
ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గంలో కూడా ఐదు అడుగుల మేర వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు, ఏజెన్సీ సిబ్బంది కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటుచేశారు. ఇక ఎగువన వరద ప్రవాహం క్రమేణ తగ్గుతుండడంతో సోమవారం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టనుంది.
లంక గ్రామాలను ముంచెత్తుతున్న వరద..
మరోవైపు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోసీమ జిల్లాలో గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల్లో శనివారం కన్నా ఆదివారం సాయంత్రం అడుగున్నర నుంచి రెండడుగుల ఎత్తున వరద పెరిగింది. మరో రెండడుగుల వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జిల్లాలోని లంక గ్రామాల్లో జూన్ 19న మొదలైన వరద ముంపు పది రోజులుగా కొనసాగుతోంది. పి. గన్నవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో వరద తీవ్రత అధికంగా ఉంది.
పలు లంక గ్రామాల్లోని ఇళ్లలోకి వరద చేరుతోంది. వరదలు, భారీ వర్షాలవల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. డెల్టాలో మురుగునీటి కాలువలు పొంగి పొర్లుతుండడంతో సుమారు 5 వేల ఎకరాల్లో చేలు నీట మునిగాయి. అలాగే, లంక గ్రామాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో అరటి, కంద, కూరగాయ పంటలు నీట మునిగాయని అంచనా. మరో నాలుగు రోజులపాటు వరద ముంపు ఉండే అవకాశం ఉన్నందున నష్టం మరింత పెరుగుతుందని రైతులు వాపోతున్నారు. మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్‌లు కె.గంగవరం మండలం కోటిపల్లి వరద ప్రాంతాల్లో పర్యటించారు.
పరిహారమివ్వండి.. పునరావాసం కల్పించండి..
వరద నీటిలో బాధితుల ఆందోళనఏటా వరదల కారణంగా బాధలు పడలేకపోతున్నామని, తమకు పోలవరం పరిహారం ఇచ్చి సురక్షిత ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో వరద బాధితులు ఆదివారం వరదనీటిలో ఆందోళన చేపట్టారు.
ఏటా జూలై నుంచి సెప్టెంబరు వరకు తమకు ఈ వరద కష్టాలు తీరడంలేదని, ఏడాది పొడవునా సంపాదించిందంతా వరదల సమయంలో సామాన్ల తరలింపుకే ఖర్చయిపోతోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వడంతో పాటు ఇతర ప్రాంతాల్లో పునరావాసం కల్పించి తమను ఇక్కడినుంచి తరలించాలని బాధితులు డిమాండ్ చేశారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న ఐటీడీఏ పీఓ కావూరి చైతన్య హామీతో వారు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment