సాక్షి, విశాఖపట్నం: ‘ఆంధ్రప్రదేశ్‌లో సమృద్ధిగా సహజ వనరులున్నాయి.. సన్నద్ధంగా నైపుణ్య మానవవనరులు ఉన్నాయి.. నైపుణ్యవనరులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిరునామాగా నిలుస్తుంది..’ అని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఎస్‌ఐ)లో రెండోరోజు శనివారం ఆరు సెక్టార్లలో సెమినార్‌లు నిర్వహించారు.
వీటిలో ప్రధానంగా స్కిల్ డెవలప్‌మెంట్, ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్‌సైన్సెస్, పెట్రోలియం–పెట్రోకెమికల్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్స్‌టైల్స్ రంగాల్లో సెమినార్‌లు నిర్వహించారు. పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లకు ఏపీ ప్రభుత్వం అందించే అవకాశాలతో పాటు ఇక్కడ సమృద్ధిగా ఉన్న వనరులు, నైపుణ్యం కలిగిన యువత, పుష్కలంగా నీటివనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, విస్తారంగా భూమి లభ్యత గురించి ఆయన వివరించారు.
స్కిల్లింగ్ ఏపీ ఫర్ సర్వింగ్ గ్లోబల్ ఎకానమీ
సదస్సు సెమినార్ హాల్లో జరుగుతున్న ప్యానల్ డిస్కషన్‌లో ముఖ్య అతిథిగా మంత్రి బుగ్గన హాజరయ్యారు. నైపుణ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ అధ్యక్షతన ‘స్కిల్లింగ్ ఏపీ ఫర్ సర్వింగ్ గ్లోబల్ ఎకానమీ’ అనే అంశంపై వారు చర్చించారు. టాటా స్టైవ్, సీఈవో అనితా రాజన్, ఈడీ4ఆల్ చైర్మన్ సంజయ్ విశ్వనాథన్, బెస్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవస్థాపకుడు భరత్‌లాల్ మీనా ఐఏఎస్ (విశ్రాంత), నాస్కమ్ ఫ్యూచర్ స్కిల్స్ సీఈవో కీర్తి సేథ్, సునీల్ దహియా (మాడరేటర్), నైపుణ్యాభివద్ధి, శిక్షణసంస్థ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి చర్చలో పాల్గొన్నారు.
ముందుగా సౌరభ్ గౌర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 175 స్కిల్ హబ్‌లు, 26 స్కిల్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీ, 55 స్కిల్ స్పోక్ ట్రైనింగ్ సెంటర్లు, స్కిల్ ఇంటర్నేషనల్ ఎకోసిస్టం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,87,932 మందికి నిరుద్యోగులకు స్కిల్ ట్రైనింగ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. 100కిపైగా జాబ్‌మేళాలు, 1,030 పూల్ డ్రైవ్స్ నిర్వహించినట్లు తెలిపారు.
సీఎం ఎక్సలెన్స్ సెంటర్ల ద్వారా 102 ఇంజినీరింగ్ కాలేజీల్లో 1.72 లక్షల మందికి ట్రైనింగ్, ఎంప్లాయిబిలిటీ స్కిల్ సెంటర్ల ద్వారా 498 డిగ్రీ, పీజీ కాలేజీల్లో 2.27 లక్షలమందికి నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. స్కిల్స్ స్పోక్స్–ఇండస్ట్రీ కస్టమైజ్‌డ్ స్కిల్ ట్రైనింగ్‌లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలనేది ఎంవోయూలో ప్రధానంగా ఉందన్నారు. ఇప్పటివరకు 21,411 మందికి శిక్షణ ఇచ్చామని, వీరిలో 18,043 మందికి ప్లేస్‌మెంట్ కల్పించామని చెప్పారు.
ఏపీఎస్‌ఎస్‌డీసీ రంగంలో 40 ఎంవోయూలు
టాటా స్టైవ్, ఈడీ4ఆల్, సాని భారత్, ద టైమ్స్ గ్రూప్, జేబీఎం గ్రూప్, జేసీబీ ఇండియా లిమిటెడ్, ప్రకార్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, ఆరెంజ్ క్రాస్, ఎకొహమా ఇండియా, గ్రీన్‌కో గ్రూప్, ఈ–ప్యాక్ కాంపోనెట్స్, డైకిన్ ఇండియా, స్కైదర్ ఎలక్ట్రిక్, వింగ్‌టెక్ ఇండియా, బొల్లినేని మెడ్‌స్కిల్స్, అపోలో మెడ్‌స్కిల్స్, ఎడ్యునెట్ ఫౌండేషన్, విహాన్ ఎలక్ట్రిక్స్, టెక్‌నోడోమ్ ఇండియా, రమ్యశ్రీ ఎలక్ట్రికల్ ఆటోమేషన్, ఇండస్ ఇన్‌ఫోటెక్, బ్రాండెక్స్, నాస్కోమ్ ప్యూచర్ స్కిల్స్, లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, కాపిటల్ గూడ్స్ స్కిల్ కౌన్సిల్, కన్‌స్ట్రక్షన్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ సెక్టార్ స్కిల్ ఇండియా, ఆటోమేటివ్ సెక్టార్, డొమెస్టిక్ వర్కర్స్ సెక్టార్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్‌మెంట్, లెథర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, హైడోకార్బన్, టెక్సటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ తదితర సంస్థలు ఏపీఎస్‌ఎస్‌డీసీ రంగంలో 40 ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఎంవోయూలను మంత్రి బుగ్గన చేతుల మీదుగా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment