తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
అల్పపీడనంగా బలపడితే నేటి నుంచి వర్షాలకు ఆస్కారం
15న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
23న తూర్పు బంగాళాఖాతంలో మరొకటి ఏర్పడే అవకాశం.. వీటివల్ల విస్తారంగా వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: జూలై నెలలోకి అడుగుపెట్టినా సరైన వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురందించింది. ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. వాతావరణం పూర్తిగా అనుకూలిస్తే ఈ అల్పపీడనాలు ఏర్పడి, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు.
శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీరంలో సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది మరింత బలపడి అల్పపీడనంగా ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
అనేక చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమ జిల్లాల్లోనూ పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మరోవైపు.. ఈ నెల 15న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి, ఏపీ వైపుగా వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు 23న తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడే ఆవర్తనం అల్పపీడనంగా బలపడే సూచనలున్నాయని, ఇది క్రమంగా వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇలా వరుసగా ఏర్పడే ఆవర్తనాలు, అల్పపీడనాలతో రాష్ట్రంలో ఈ నెలలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని చెబుతున్నారు. ఇవి లోటు వర్షపాతం నుంచి అధిక వర్షపాతాన్ని నమోదు చేస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మొదలైనందున, ఈ వర్షాలు అన్నదాతలకు మేలు చేస్తాయని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment