మూడేళ్ల క్రితం..ఏలూరు జిల్లా టెక్కినవారిగూడేనికి చెందిన ఉమ్మడి దుర్గారావు మూడేళ్ల క్రితం వరకూ వైద్య చికిత్స కోసం 15 కి.మీ. దూరంలోని జంగారెడ్డిగూడెం వెళ్లేవారు. అక్కడ కూడా అరకొర సేవలే అందుతుండటంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. రూ.వెయ్యి నుంచి రూ.1,500 దాకా ఖర్చయ్యేది.
మరి ఇప్పుడు..
దుర్గారావు కుటుంబంతోపాటు పరిసర గ్రామాల్లో ఇప్పుడు ఎవరు అనారోగ్యానికి గురైనా జంగారెడ్డిగూడెం పరిగెత్తడం లేదు. లక్కవరం పీహెచ్‌సీలోనే చికిత్స పొందుతున్నారు. నాడు– నేడు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల నిధులతో స్థానికపీహెచ్‌సీని అభివృద్ధి చేసింది. ఇద్దరు వైద్యులతో పాటు ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్ట్, అటెండర్, వాచ్‌మెన్ ఇతర సిబ్బందిని నియమించారు. వీడీఆర్‌ఎల్, టైపాయిడ్ ఇతర పరీక్షలు చేస్తున్నారు.
నాడు సాధారణ వైద్య సేవలే గగనంగా మారిన చోట నేడు ప్రతి సోమవారం చెవి, ముక్కు సమస్యలకు చికిత్స, బుధవారం నేత్ర సేవలు అందుతున్నాయి. 60 ఏళ్లు దాటిన వారికి గురువారం ప్రత్యేక వైద్య శిబిరం, శుక్ర, శనివారాల్లో 13 – 18 ఏళ్ల వారికి వైద్య పరీక్షలు, నెలకొక సారి దంత, మెంటల్ హెల్త్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఒక్కప్పుడు ఇక్కడ రోజుకు 30 లోపు ఓపీలు ఉండగా ప్రస్తుతం 60 నుంచి 80 వరకు పెరిగాయి. గత సర్కారు హయాంలో అత్యవసర ఔషధాలూ అందుబాటులో లేని దుస్థితి నెలకొనగా ఇప్పుడు 240 రకాల ఎసెన్షియల్ మందులు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంటున్నాయి.
చెంతనే స్పెషలిస్టు సేవలు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన చల్లా వెంకట కోటమ్మ ఆయాసానికి చికిత్స కోసం 50 కి.మీ దూరంలో ఉన్న నరసరావుపేట లేదా 80 కి.మీ దూరంలో ఉండే గుంటూరు వెళ్లాలి. చార్జీల భారంతో పాటు రోజంతా పొలం పనులు ఆగిపోయేవి. ఇప్పుడు కరాలపాడు పీహెచ్‌సీలో స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో తమ ఇబ్బందులు తొలగిపోయాయని సంతోషం వ్యక్తం చేస్తోంది.
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 1,145 పీహెచ్‌సీల్లో ఇలాంటి మార్పులే కనిపిస్తున్నాయి. సర్కారు ఆస్పత్రుల్లో వైద్య సేవలకు ప్రాణం పోసి ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల నుంచి బోధనాసుపత్రుల వరకు రూపురేఖలు సమూలంగా మారుతున్నాయి. ప్రతి చోటా ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులతో పాటు ఇతర సిబ్బంది కలిపి 12 మంది ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే 909 మంది డాక్టర్లు, 1,113 మంది నర్సులు, 4233 ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్‌ఎన్‌వో, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, వైద్య సేవల్లో మార్పులు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడయ్యాయి.
టెలి మెడిసిన్ సేవల్లో రికార్డు
సాధారణ వైద్య సేవలతో పాటు టెలి మెడిసిన్ ద్వారా స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. టెలిమెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రజలకు పీహెచ్‌సీలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల నుంచే స్పెషాలిటీ సేవలు అందించడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సాధించింది. ఇప్పటివరకూ ఏకంగా 1.40 కోట్ల కన్సల్టేషన్లు నమోదయ్యాయి. రోగులతో వాయిస్, వీడియో కాల్స్‌లో మాట్లాడి డాక్టర్లు వైద్య సేవలు అందించారు.
దేశంలో తొలిసారిగా ‘స్పెషల్’..
దేశంలోనే తొలిసారిగా తొమ్మిది స్పెషాలిటీల్లో ఓపీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్‌సీల్లో అందుబాటులోకి తెచ్చింది. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఈఎన్‌టీ, ఆఫ్తాల్మాలజీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్ సర్జన్, డెంటల్ సర్జన్, పల్మనరీ మెడిసిన్ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసింది. ఇందుకోసం ఒక్కో స్పెషాలిటీలో 142 మందిని నియమిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,276 మంది స్పెషలిస్టుల అవసరం ఉండగా ఇప్పటికే 979 మందిని నియమించారు.
వైద్య పరీక్షల్లో 57 శాతం పెరుగుదల
నాడు–నేడులో భాగంగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో ల్యాబ్‌లను బలోపేతం చేసి 35 రకాల వైద్య పరీక్షలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 2017–18తో పోలిస్తే 2021–22లో వైద్య పరీక్షలు 57.85 శాతం పెరిగాయి. గతంలో 60,60,854 పరీక్షలు మాత్రమే చేయగా ఇప్పుడు 1,04,76,190 పరీక్షలు నిర్వహించారు.
మంచి స్పందన..
ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరిగింది. ప్రసవాలు కూడా చేస్తున్నాం. స్పెషాలిటీ క్లినిక్‌లకు మంచి స్పందన లభిస్తోంది.
– అల్లాడి అశోక్‌కుమార్, లక్కవరం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి
పట్టించుకోరనుకున్నాం...
ప్రభుత్వ ఆసుపత్రి అంటే సరిగా పట్టించుకోరని భావించాం. అక్కడకు వెళ్లాక ఆ భావన తొలగిపోయింది. వైద్యులు, సిబ్బంది పనితీరు బాగుంది.
– దేవి, టెన్నేరు గ్రామం, కృష్ణా జిల్లా
ప్రైవేట్ కంటే మెరుగ్గా..
ప్రైవేట్ ఆస్పత్రులకన్నా ప్రభుత్వ ఆస్పత్రి పరిశుభ్రంగా ఉంది. సేవలు పెరిగాయి. స్థానికంగా లభించని వైద్యానికే ఇప్పుడు జంగారెడ్డిగూడెం వెళ్తున్నాం.
– పసుపులేటి చిన్నారి, లక్కవరం, జంగారెడ్డిగూడెం మండలం
కీళ్ల నొప్పులకు ట్రీట్‌మెంట్..
కీళ్లు, మోకాళ్లు, కండరాలు, మెడ నొప్పి బాధితులకు ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేకుండా మెరుగైన వైద్యం అందుతోందని బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
– టి. సంజీవ్, తిప్పాయపాలెం పీహెచ్‌సీ వైద్యుడు (ఎమ్మెస్ ఆర్థో స్పెషలిస్ట్) ప్రకాశం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment