నోరూరించే సీతాఫలాలు.. ఫుల్‌ డిమాండ్‌! 100 కాయల రేటు రూ.2500 | Sitaphal Business Tasty Custard Apple High Rates East Godavari | Sakshi
Sakshi News home page

దందా షురూ! భారీ ధర పలుకుతున్న సీతాఫలాలు.. 100 కాయలకు రూ.2500!

Published Mon, Oct 17 2022 9:05 PM | Last Updated on Mon, Oct 17 2022 9:07 PM

Sitaphal Business Tasty Custard Apple High Rates East Godavari - Sakshi

ఊనగట్లలో సీతాఫలాలను విక్రయిస్తున్న దృశ్యం

చాగల్లు (తూర్పు గోదావరి): మండలంలోని ఊనగట్ల, అమ్ముగుంట, చిక్కాల, చిక్కాలపాలెం గ్రామాలు సీతా ఫలాలకు ప్రసిద్ధి. మెట్ట ప్రాంత గ్రామాల్లోని గరువు భూముల్లో రైతులు ఈ తోటలను విస్తారంగా పెంచుతారు. ఏటా అక్టోబర్‌లో కాపునకు కొచ్చే సీతాఫలాలను మండలంలోని అమ్ముగుంట, చిక్కాల కేంద్రాలుగా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. 

రూ.కోట్లలో వ్యాపారం 
మండలంలో పండే సీతాఫలాలు రుచిగా ఉంటాయి. అందుకే డిమాండ్‌ కూడా ఎక్కువ. వీటిని కొనుగోలు చేయడానికి భీమవరం, తణుకు, విజయవాడ, ఏలూరు సహా పరిసర పట్టణ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు ఈ సీజన్‌లో రోజూ ఊనగట్ల, చిక్కాల వస్తారు. రైతులు తమ పొలాల్లో కాసిన సీతాఫలాలను మార్కెట్‌లకు తీసుకొచ్చి వారికి విక్రయిస్తారు.పెద్ద వ్యాపారులు రోజు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల మేర లావాదేవీలు జరుపుతారు. ఇక చిల్లర వ్యాపారులు కూడా ఈ రెండు చోట్లా సీతాఫలాలను కొనుగోలు చేసి కొవ్వూరు, నిడదవోలు పరిసర గ్రామాల్లో విక్రయిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తారు.  


ఊనగట్ల శివారు అమ్మిగుంట సెంటర్లో సీతాఫలాల ఎగుమతి

వర్షాల వల్ల ఈ ఏడాది సీతాఫలాల దిగుబడి ఆశాజనకంగానే ఉంది. వాతావరణ పరిస్థితులు కారణంగా కాయలన్నీ దాదాపు ఒకేసారి పక్వానికి రావడంతో వాటిని ఒబ్బిడి చేసుకోలేక  రైతులు ఇబ్బందులు పడ్డారు. కొంత మేర కాయలు వర్షానికి దెబ్బతిన్నాయని పలువురు రైతులు తెలిపారు. అయితే ఏటా ఈ పరిస్థితి ఉండదని చెబుతున్నారు. వంద సీతాఫలాలను రైతుల వద్ద నుంచి రూ.2,000 నుంచి రూ.2,500 రేటుకు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు రిటైల్‌గా రూ.3,000 నుంచి రూ.4,000 రేటుకు అవకాశాన్ని బట్టి, కాయల సైజును బట్టి విక్రయిస్తున్నారు. 

రెండు వేల ఎకరాల్లో తోటలు 
ఈ ఏడాది సీతాఫలాల ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాగల్లు మండలంలోని సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో సీతాఫలాల తోటలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. రైతులు తమ పొలాల్లో పండిన కాయలను కోసి సైకిళ్లు, మోటారు సైకిళ్లపై తీసుకొచ్చి వ్యాపారులకు విక్రయిస్తారు. వ్యాపారస్తులు తాము కొనుగోలు చేసిన కాయలను మినీ వ్యాన్‌లపై పట్టణాలకు తరలించి అక్కడ  అమ్ముకుంటారు.  

అవగాహన కల్పించాలి 
సీతాఫలాల తోటల పెంపకంపై ఉద్యాన శాఖాధికారులు రైతులకు ఆవగాహన కల్పించాలి. ఈ ఏడాది  సీతాఫలాలు కాపు బాగానే ఉంది. వాతవరణ పరిస్థితులు వలన కాయలు అధిక స్థాయిలో ఒకేసారి పక్వానికి రావడంతో రైతులు కొంతమేర ఇబ్బందులు పడ్డారు. 
 – మిక్కిలి నాగేశ్వరరావు, రైతు, చిక్కాల  

అధిక ధరలకు విక్రయాలు 
ఈ సారి సీతాఫలాలు దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇక్కడి కాయలు వివిధ పట్టణాలకు ఎగుమతి అవుతున్నాయి. రైతులకు అంతగా లాభాలు రాకపోయినా వ్యాపారులకు ప్రయోజనకరంగానే ఉంది. 
– సంసాని రమేష్, చిక్కాల 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement