సాక్షి, అమరావతి: ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్.. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇవి. స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిపేందుకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు గంటల తరబడి వాటిలోనే గడిపేటంత వ్యసనంగా మారిపోయాయి. ముఖ్యంగా 16 నుంచి 24 ఏళ్ల యువత గంటల తరబడి సోషల్ మీడియాలోనే గడుపుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇంగ్లండ్‌కు చెందిన కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ ‘ఆఫ్‌కమ్’ లెక్కల ప్రకారం పాశ్చాత్య దేశాల్లో 98 శాతం యువత (16–24 సంవత్సరాలు) రోజులో ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతుంటే భారతదేశంలో 33.7 శాతం మంది అదే పనిలో ఉంటున్నట్టు పేర్కొంది. దేశంలో వినియోగంలో ఉన్న స్మార్ట్ ఫోన్లలో కనీసం మూడు యాప్‌ల్లో ఏదో ఒకటి రోజూ 30 నిమిషాలకు ఒకసారి తెరుస్తున్నట్టు గుర్తించారు.
రోజులో గంట కంటే ఎక్కువ సేపు ఆన్‌లైన్‌లో గడిపితే అనర్థాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులు సగటున రోజుకు 2.36 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నట్టు యూఎస్‌కు చెందిన టెక్ జ్యూరీ సంస్థ తెలిపింది.
దేశంలో 4.7% మందికి వ్యసనం
వాస్తవానికి సోషల్ మీడియా వ్యసనాన్ని లెక్కించేందుకు నిర్దిష్టమైన కొలమానాలు ఏవీలేకున్నా.. గంటల తరబడి ఫోన్‌తోనే గడపడాన్ని వ్యసనంగానే భావిస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకోవడం.. ఎలాంటి సందేశాలు రాకున్నా వచ్చినట్టు భావించడం.. కాస్త సమయం దొరికితే యూట్యూబ్, ఫేస్‌బుక్‌లోకి దూరిపోయి సమయాన్ని మరిచిపోవడం.. నిద్ర వస్తున్నా బలవంతంగా ఫోన్ చూస్తూ గడిపేయడం వంటి లక్షణాలు కనిపిస్తే అది సోషల్ మీడియా అడిక్షన్‌గా పేర్కొంటున్నారు.
5 గంటలకు పైగా ఆన్‌లైన్‌లోనే ఉండేవారిని వ్యసనపరులుగా భావిస్తున్నారు. యూకేలో 10 శాతం మందికి ఈ వ్యసనం ఉండగా, మన దేశంలో 4.7 శాతం మందికి సోషల్ మీడియా వ్యసనంగా మారినట్టు లెక్కించారు. ప్రస్తుతం ఇంటర్నెట్ ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుండడంతో వచ్చే రెండేళ్లలో మనదేశంలో ఇది 12 శాతానికి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇష్టమైన యాప్స్ లాగిన్ అయినప్పుడల్లా మెదడులో డోపమైన్ (ఆనందాన్ని కలిగించే ఎంజైమ్) విడుదల స్థాయి పెరుగుతుందని, ఫలితంగా మెదడులోని న్యూరో ట్రాన్స్‌మీటర్లు ఆనందంతో కదులుతాయని వైద్యులు చెబుతున్నారు.
అడిక్షన్ ఉందో లేదో ఇలా గుర్తించొచ్చు..
సోషల్ మీడియా వ్యసనానికి, ఆనందించే అలవాటుకు మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నట్టు చికాగో యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడించింది.
► సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల ఉద్యోగం, చదువు, పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే ఏదైనా నిర్దిష్ట సమయంలో చేయాల్సిన పనికి బదులు ఫోన్‌లో యాప్‌లను తెరిస్తే అది వ్యసనానికి సంకేతంగా చెబుతున్నారు.
► స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పుడు, భోజనం చేసేటప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను తీసుకోవడం, మెస్సేజ్‌లను చూడడం.
► ప్రతి చిన్న సమస్యకు పరిష్కారంగా ఆన్‌లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడటం
► ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండి, ఇంటర్నెట్ రాకుంటే చిరాకు, కోపం రావడం, ఏదో కోల్పోయినట్టు ఆందోళన చెందడం.
► అవకాశం దొరికినప్పుడల్లా వ్యక్తులు ఆశ్రయించే మొదటి అంశం స్మార్ట్‌ఫోన్ కావడం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే సోషల్ మీడియా అడిక్షన్‌లోకి వెళ్లినట్లేనని మానసిక వైద్యులు చెబుతున్నారు.
స్మార్ట్‌ఫోన్‌తో రోజువారీ బంధం ఇలా..
► సోషల్ మీడియాలో అత్యధికంగా
(60 శాతం) ఉండేది 18–34 ఏళ్ల వారే
► ఫోన్ అస్సలు స్విచ్చాఫ్ చేయనివారు 50%
► రోజుకు ఫోన్ అన్‌లాక్ చేసేది 150 సార్లు
► రోజుకు సగటున ఫోన్‌చెక్ చేసుకునేది 63 సార్లు.. ఫోన్ పక్కలో పెట్టుకుని నిద్రపోయేవారు 71 శాతం
► బాత్‌రూముల్లోనూ ఫోన్లు వినియోగించేవారు 40%
► డ్రైవింగ్‌లో ఒక్కసారైనా మెస్సేజ్ చేసేవారు 75%
► పడుకునే ముందు లేదా నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూసేవారు 87 శాతం
Comments
Please login to add a commentAdd a comment