గుమ్మలంపాడులో నివాస గృహాల చుట్టూ సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేస్తున్న సిబ్బంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనాను నివారించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కట్టడి చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ప్రతి రోజూ రాష్ట్రంలోని ఐదు వేలకు పైగా గ్రామాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తోంది. రాత్రి వేళల్లోనూ ప్రతి రోజూ రెండు వేలకు పైగా గ్రామాల్లో ఫాగింగ్ (పొగ) చేస్తోంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 5,916 గ్రామాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయగా.. ఆదివారం 5,881 గ్రామాల్లో.. శనివారం 5,838 గ్రామాల్లో పిచికారీ చేశారు. సోమవారం రాత్రి సమయంలో 2,380 గ్రామాల్లో ఫాగింగ్ చేయగా.. ఆదివారం 2,296 గ్రామాల్లో, శనివారం 2,435 గ్రామాల్లో ఫాగింగ్ చేశారు. దేశమంతటా, రాష్ట్రంలోనూ కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం గ్రామాల్లో 16 రకాల కరోనా కట్టడి చర్యలు చేపడుతుంది.
మరో ఐదు విధానాల్లో ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఆయా కార్యక్రమాలు గ్రామాల వారీగా అమలు జరుగుతున్న తీరును కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్‌శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, ప్రత్యేకించి కరోనా కేసులు నమోదు అవుతున్న గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన కరోనా కట్టడి చర్యలను ముమ్మరం చేస్తున్నారు. కేసుల నమోదు తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణం కనీసం రోజు విడిచి రోజైనా పిచికారీ చేస్తుండగా.. రాష్ట్రంలోని మిగిలిన గ్రామాలన్నింటిలో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్, మురుగు కాల్వల్లో ఫెనాయిల్ పిచికారీ చేస్తున్నారు. మంచినీటి పథకాల ద్వారా తాగునీటి సరఫరా చేసే సమయంలో సిబ్బంది పర్యవేక్షణలో ప్రత్యేక క్లోరినేషన్ చర్యలు చేపడుతున్నారు. ఒక్కొక్క గ్రామంలో వారానికి రెండు మూడు సార్లు కూడా సోడియం హైపో క్లోరైట్ పిచికారీ చేస్తున్నారు.
గ్రామాల్లో 1.08 కోట్ల కుటుంబాలకు..
పంచాయతీరాజ్ శాఖ వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో మొత్తం 1,08,07,994 కుటుంబాలు ఉండగా.. ప్రతి కుటుంబాన్ని కరోనా కట్టడి సేవల పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామంలో ఏ రోజు ఏ ప్రాంతంలో ఏ రకమైన చర్యలు చేపడుతున్నారన్న సమాచారాన్ని తెప్పించుకుంటూ మండల, జిల్లా, రాష్ట్ర అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment