ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఎదుట కన్నీటి పర్యంతమవుతున్న తేజేష్‌రెడ్డి తల్లి జ్యోతి
సాక్షి, పీలేరు/కేవీపల్లె: ‘‘నా బిడ్డను అన్యాయంగా చంపేశారు... నిందితులను కఠినంగా శిక్షించండి.’’ అంటూ హతుడి తల్లి బోరున విలపించింది. కేవీపల్లె మండలం ఎగువమేకలవారిపల్లె సమీపంలోని బొప్పాయితోటలో హత్యకు గురైన తేజేష్‌రెడ్డి తల్లి జ్యోతి గురువారం పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఎదుట తనగోడు వెల్లబోసుకుంది. తేజేష్‌రెడ్డి(8) మృతదేహానికి గురువారం పీలేరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. ఎమ్మెల్యే ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతుని బంధువులను ఓదార్చే ప్రయత్నం చేశారు. జ్యోతి మాట్లాడుతూ, తాము ఎవరికీ ఎలాంటి హానీ చేయలేదని, గతంలో అప్పు చేసినా తీర్చేశామని పేర్కొంది. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ అభంశుభం తెలియని బాలుడిని హత్య చేయడం అత్యంత కిరాతకమైన సంఘటనగా అన్నారు. నిందితులు ఎంతటి వారైనా, ఎవరైనా ఉపేక్షించబోమని కఠిన శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు.
ఎస్పీ విచారణ
తేజేష్‌రెడ్డి హత్యాఘటనపై గురువారం రాత్రి ఎస్పీ సెంథిల్‌కుమార్ గ్రామంలో విచారణ చేపట్టారు. వివిధ కోణాల్లో గ్రామస్తులను సమాచారం అడిగి తెలుసుకుని వివరాలు నమోదు చేశారు. ప్రధానంగా తేజేష్‌రెడ్డి తల్లిదండ్రుల ఆర్థిక లావాదేవీలు కారణమై వుండవచ్చన్న అనుమానాలున్నాయి. ఎస్పీతోపాటు సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది ఉన్నారు.
చదవండి: (Devaragattu Bunny Festival: భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే..?)
సంకేనిగుట్టపల్లెలో విషాదఛాయలు
పోస్టుమార్టం చేసిన మృతదేహాన్ని గ్యారంపల్లె పంచాయతీ సంకేనిగుట్టపల్లెకు తరలించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తల్లి జ్యోతితోపాటు బంధువుల రోదనలు కలచివేశాయి. కువైట్‌లో ఉన్న తండ్రి నాగిరెడ్డి స్వగ్రామానికి వస్తున్నట్లు బంధువులు తెలిపారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment