మాట్లాడుతున్న వి.లక్ష్మణరెడ్డి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని కల్గించి మెరుగైన సమాజం నిర్మించే దిక్సూచిలా జన విజ్ఞాన వేదిక కృషి చేయాలని పలువురు వక్తలు సూచించారు. స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం జన విజ్ఞాన వేదిక 4వ జాతీయ మహాసభ జరిగింది. సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్య నియంత్రణ ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. తాను అక్షరాస్యత, సారా వ్యతిరేక ఉద్యమాల్లో జనవిజ్ఞాన వేదిక సభ్యులతో కలిసి పాల్గొన్నానని చెప్పారు. ఏపీఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల మాట్లాడుతూ మూఢ నమ్మకాలను పారద్రోలి సమాజ శ్రేయస్సు కోసం జనవిజ్ఞాన వేదిక పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకుడు డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ తమ వేదిక తరఫున ప్రజలకు అనేక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
జనవిజ్ఞాన వేదిక ప్రభుత్వాలకు సలహాలు ఇస్తుందే కానీ.. వ్యతిరేకం కాదన్నారు. జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఆర్.కృష్ణాజీ, జాతీయ ప్రధాన కార్యదర్శి టీవీ రావు మాట్లాడుతూ.. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలు మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం చేయాలన్నారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఏపీ అధ్యక్షుడు జంపా కృష్ణ కిషోర్, ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్, కోశాధికారి సుగాలి గోపాలనాయక్, తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్‌ఎస్) రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ అశ్లీలతా ప్రతిఘటన వేదిక అధ్యక్షుడు ఈదర గోపీచంద్, ఏపీ హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య, సమాచార హక్కు ప్రచార వేదిక అధ్యక్షుడు యర్రంశెట్టి జగన్‌మోహన్‌రావుతోపాటుగా జనవిజ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు. సభకు ముందుగా మూఢ నమ్మకాలను నమ్మవద్దంటూ కళాకారులు గీతాలను ఆలపించారు. మహాత్మాగాంధీ ఆత్మకథతో పాటుగా మూఢ నమ్మకాలు, అశ్లీలతకు వ్యతిరేకంగా ప్రచురించిన పలు పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు.
జనవిజ్ఞాన వేదిక నూతన కమిటీ
జనవిజ్ఞాన వేదిక మహాసభ అనంతరం నూతన జాతీయ కమిటీని ఎన్నుకున్నారు. వేదిక గౌరవ అధ్యక్షులుగా పి.రామ్మోహనరావు, వి.బ్రహ్మారెడ్డి, కె.నాగేశ్వరరావు, అధ్యక్షుడిగా ఆకునూరి శంకరయ్య, ప్రధాన కార్యదర్శిగా జంపా కృష్ణకిషోర్, కోశాధికారిగా వై.చలపతితో పాటుగా పది మంది ఉపాధ్యక్షులు, పది మంది కార్యదర్శులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment