ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం మునిసిపాలిటీల్లో 256 గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ (జీటీఎస్)లు నిర్మిస్తోంది. ప్రస్తుతం మునిసి పాలిటీల్లోని వార్డుల్లో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ఓ ప్రాంతంలో పోగు చేస్తున్నారు. తర్వాత టిప్పర్ల ద్వారా డంపింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. చెత్తను బహిరంగ ప్రదేశంలో పోగేయడం వల్ల అక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం మెరుగు, వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పోగు చేయకుండా 8 నుంచి 10 లేదా స్థానిక పరిస్థితులను బట్టి మరికొన్ని వార్డులను కలిపి ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను పోగు చేయడానికి జీటీఎస్‌లు నిర్మించాలని నిశ్చయించింది.
రూ.213 కోట్లతో 256 జీటీఎస్‌ల నిర్మాణం
రాష్ట్రంలో 123 మునిసిపాలిటీల్లో రూ.213.39 కోట్లతో 256 జీటీఎస్‌ల నిర్మాణానికి ఆ శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వీటిలో 104 మునిసిపాలిటీల్లో 210 జీటీఎస్‌ల నిర్మాణానికి సాంకేతిక అనుమతులు లభించాయి. 92 మునిసిపాలిటీల్లో 189 జీటీఎస్‌ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. 72 మునిసిపాలిటీల్లో 136 జీటీఎస్‌లకు టెండర్లు పూర్తయ్యాయి. 68 మునిసిపాలిటీల్లో 124 జీటీఎస్‌ల నిర్మాణానికి వర్క్ ఆర్డర్లు చేయడం ముగిసింది. శ్రీకాకుళం, మచిలీపట్నం, ఒంగోలు కార్పొరేషన్‌లు, హిందూపురం, వినుకొండ, నంద్యాల, పుంగనూరు, నగరి సహా 30 మునిసిపాలిటీల్లో 46 జీటీఎస్‌ల నిర్మాణం ప్రారంభించారు.
మిగిలిన జీటీఎస్‌ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. 30 సెంట్ల నుంచి అర ఎకరం, ఎకరం, మూడు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కూడా పలు మునిసిపాలిటీల్లో జీటీఎస్‌ల నిర్మాణం చేపడుతున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను నేరుగా ఇక్కడికి తరలిస్తారు. అనంతరం తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు తరలిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment