
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా విద్యార్థులే కేంద్రంగా విద్యా విధానాలను అమలు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. దశాబ్దాలుగా అమలుకు నోచుకోని సంస్కరణలను ఈ మూడేళ్లలోనే తీసుకొచ్చామన్నారు. మౌలిక వసతులు, మానవ వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు గట్టిపునాది వేసేందుకే తరగతుల విలీనాన్ని చేపట్టామన్నారు. పాఠశాలల మ్యాపింగ్ మాత్రమే జరుగుతోందని, ఏ ఒక్క స్కూల్ మూతపడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని పలుసార్లు స్పష్టం చేసినప్పటికీ ‘ఈనాడు’ పత్రిక దురుద్దేశంతో తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేసేలా అసత్య కథనాలు ప్రచురిస్తోందన్నారు. విద్యా వ్యవస్థలో వేళ్లూనుకున్న లోపాలకు సరైన చికిత్స చేస్తుంటే దుష్ప్రచారం సరికాదని హితవు పలికారు.
సదుపాయాలు కల్పించాకే..
2021–22లో 2,943 ప్రాథమిక పాఠశాలల తరగతులను 250 మీటర్ల దూరం లోపు ఉన్న 2,800 ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేశామని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. 2022–23లో 620 ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలను కిలోమీటరు దూరంలోపు ఉన్న 4,954 ప్రీ హైస్కూళ్లు మ్యాపింగ్ చేసినట్లు వివరించారు. 5,870 పాఠశాలల్లో తరగతులను విలీనం చేస్తే కేవలం 820 స్కూళ్లకు సంబంధించి సమస్యలున్నట్లు శాసన సభ్యులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారన్నారు. దీనిపై అధ్యయనానికి జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటైన ప్రత్యేక కమిటీ క్షేత్రస్థాయిలో ఇబ్బందులను పరిశీలించి నివేదిక అందిస్తుందన్నారు. విలీన ప్రక్రియ సాధ్యంకాని పక్షంలో ఆ పాఠశాలలను యథావిధిగా కొనసాగిస్తామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్య ఉంటే పరిష్కరించిన తర్వాతే తరగతుల విలీనానికి ముందుకెళ్తామన్నారు.
8,232 మంది ఎస్జీటీలకు పదోన్నతి..
కొత్త విద్యావిధానం అమలుతో ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టూ రద్దు కాదని స్పష్టం చేశారు. పైగా 8,232 మంది ఎస్‌జీటీలకు మేలు చేసేలా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నామన్నారు. అదనంగా పెద్ద సంఖ్యలో హెచ్‌ఎం పోస్టులకు షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక హెచ్‌ఎం, పీఈటీతో పాటు కచ్చితంగా 9మంది సబ్జెక్టు టీచర్లు ఉండేలా పటిష్ట చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు వారానికి 36 పీరియడ్లు మించకుండా, వారిపై తరగతుల విలీన ప్రక్రియ భారం పడకుండా చూస్తామన్నారు. నాడు –నేడు ద్వారా ఇప్పటికే 15,715 పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి 32 వేల అదనపు తరగతులను నిర్మించనున్నట్టు చెప్పారు.
మాకు విద్యార్థులే ముఖ్యం
చరిత్రలో తొలిసారిగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యా విధానాన్ని అమలు చేస్తోందన్నారు. కోవిడ్‌తో రెండేళ్లు పాఠశాలలు సరిగా తెరుచుకోకపోవడంతో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం పడిపోయిందన్నారు. ఇదే విషయాన్ని అసర్, న్యాస్ రిపోర్టులు సైతం చెబుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా పాఠశాలలను గ్రూపింగ్ చేసి 2025 నాటికి సమస్యను అధిగమించాలని సూచిస్తోందన్నారు. గుజరాత్‌తో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీ బాటలో పయనించేందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో సైతం ఈ తరహా విద్యా విధానం అమలవుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment