ఊరంతా ఉపాధి.. ఇత్తడి ఖజానా అజ్జరం  | Special Story On Ajjaram Brass Industry | Sakshi
Sakshi News home page

ఊరంతా ఉపాధి.. ఇత్తడి ఖజానా అజ్జరం  

Oct 10 2021 5:45 PM | Updated on Oct 10 2021 5:46 PM

Special Story On Ajjaram Brass Industry - Sakshi

టంగ్‌.. టంగ్‌.. టక్కుంటక్కుం.. అంటూ లయబద్ధంగా వినిపించే శబ్దాలు.. ఏ ఇంటి ముంగిట చూసిన ఇత్తడి సామగ్రి, కళాకృతుల మెరుపులు.. అజ్జరం ప్రత్యేకం.. సాధారణంగా ఏ ఊరిలోనైనా వర్ణాలను అనుసరించి వృత్తులు చేయడం పరిపాటి. అయితే ఈ గ్రామంలో మాత్రం అన్ని వర్ణాల వారూ కలిసి ఇత్తడి సామాన్ల తయారీని వందల ఏళ్లుగా చేస్తూ ఉపాధి పొందుతున్నారు. దీంతో అజ్జరం ఇత్తడి పరిశ్రమకు పెట్టింది పేరుగా మారింది. గంటల తయారీలో ప్రత్యేకతతో ప్రతి ఆలయంలోనూ ‘అజ్జరం గంట’ మోగాల్సిందే  అన్నట్టుగా నిలిచిపోయింది.

పెరవలి: దాదాపు 200 ఏళ్ల నుంచి అజ్జరంలో ఇత్తడి సామగ్రి పరిశ్రమ ఉంది. నాడు చేతి పనిముట్లతో వస్తువులు తయారు చేయగా ప్రస్తుతం యంత్రాలతో పనులు చేస్తున్నారు. ఇక్కడ తయారైన గంటలు దేశంలోని ప్రముఖ ఆలయాల్లో మార్మోగుతున్నాయి. గ్రామ జనాభా 2,957 మంది కాగా 2,500 మంది ఇత్తడి సామాన్ల తయారీపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి ఇత్తడి పని తప్ప మరే పని తెలియదంటే అతిశయోక్తి కాదు. తరతరాలుగా సామగ్రి, కళాకృతుల తయారీలో వీరు నైపుణ్యం కనబరుస్తుండటంతో గ్రామంలో ఇత్తడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది.


అజ్జరంలోని ఇత్తడి పరిశ్రమలో బిందెలను తయారుచేస్తున్న కార్మికులు 

గంటలు ప్రత్యేకం 
ఇత్తడితో పలురకాల సామగ్రిని తయారుచేస్తున్నా ఆలయాల్లో గంటల తయారీతో వీరి ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. 50 గ్రాముల నుంచి 500 కిలోల వరకూ గంటలను వీరు తయారు చేసి రికార్డు సృష్టించారు. ఇత్తడి గంటల తయారీలో ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. ఇత్తడి అంటే అజ్జరం.. అజ్జరం అంటే ఇత్తడి.. అన్నట్టుగా పేరు సంపాదించారు. పట్టణాల్లో దుకాణదారులు ‘అజ్జరం వారి ఇత్తడి షాపు’ అని పేరు పెట్టుకుని వ్యాపారులు సాగిస్తున్నారు.

మెరుగులు దిద్దుతూ..   

200 ఏళ్ల అనుబంధం 
అజ్జరానికి ఇత్తడితో అనుబంధం 200 ఏళ్లుగా కొనసాగుతోంది. అప్పట్లో ముడిసరుకులను కలకత్తా, మద్రాసు నుంచి తీసుకువచ్చి ఇక్కడ వస్తువులు తయారుచేసేవారు. ప్రస్తుతం ఇక్కడే ఇత్తడి రేకులు తయారుచేసి రాష్ట్ర నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. చిన్నా,పెద్దా తేడా లేకుండా పనులు చేస్తున్నారు. వేకువజామున పని మొదలుపెట్టి రాత్రి వరకూ పనులు చేస్తూనే ఉంటారు. ఇత్తడి బిందెలు, బకెట్లు, పల్లెం, చెంబు, గంగాళా, డేగిసా, పప్పు గిన్నెలు తదితర పెళ్లి సామగ్రి కోసం రాష్ట్ర నలుమూలల నుంచి అజ్జరం వస్తుంటారు. దీంతో గ్రామ ఖ్యాతి దశదిశలా విస్తరించింది.

తరతరాలుగా.. 
మా తాత పేరలింగం, తండ్రి సాంబమూర్తి ఇదే పనిచేసేవారు. నేనూ ఇదే పనిలో ఉన్నాను. 20 ఏళ్ల క్రితం చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ పనికి వచ్చేవారు. తర్వాత కాలంలో చిన్న పిల్లలు పనికిరాకపోవడంతో పనినేర్చుకునే వారు తగ్గారు. 50 గ్రాముల నుంచి 500 కిలోల వరకూ గంటలను ప్రత్యేకంగా తయారుచేస్తున్నాం. ఈ గంటలు దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు అందించాం. అమెరికా కూడా పంపించాం. ఈ మధ్య కాలంలో యంత్రాలపైన తయారీ ఎక్కువయ్యింది.   
– బొప్పే సత్యలింగం, ఇత్తడి పరిశ్రమ యజమాని

చిన్నప్పటి నుంచీ.. 
పుట్టినప్పటి నుంచి ఈ పనిలోనే ఉన్నాను. పని పూర్తిగా ఉండటంతో కుటుం బాన్ని ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నా. ఇటీవల మిషన్లు రావటంతో పనికి డిమాండ్‌ తగ్గింది. దీని వలన కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి.  
– పాటి సత్యనారాయణ, వర్కర్‌

తండ్రి ద్వారా.. 
నా తండ్రి ద్వారా ఈ పని అబ్బింది. పనిని ఇష్టంగా చేస్తాం. మా వద్దకు వచ్చిన కస్టమర్లు మా పనిచూసి ఎంతో అందంగా ఉందని ప్రశంసించినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఈ పనిలోనే హాయి ఉంది.   
– నున్న వీరవెంకట సత్యనారాయణ, వర్కర్‌

ఇదే జీవనోపాధి 
మేము నాయీబ్రాహ్మణులమైనా ఇత్తడి పనినే జీవనోపాధిగా ఎంచుకున్నాం. మిషన్లు రావటంతో పని నేర్చుకునేవారు తక్కువైపోయారు. దీంతో ఈ పని మా తరంతోనే అంతరించిపోతుందేమోనని అనిపిస్తోంది.  
– బొజ్జొరి బాలరాజు, వర్కర్‌

40 ఏళ్లుగా.. 
40 ఏళ్లుగా ఈ పనిచేస్తు న్నా. గ్రామంలో అందరూ ఇదే పని చేస్తుంటాం. ఇతర వ్యాపారాలు ఏమీ తెలియవు. ఇటీవల యంత్రాల రాకతో పని నేర్చుకునేవారు తగ్గారు. భవిష్యత్‌ ఎలా ఉంటుందో తెలియలేదు.  
– యడ్ల పోతురాజు, వర్కర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement