కొత్తవలసలో షూటింగ్ బాల్ శిక్షణ పొందుతున్న క్రీడాకారులు
కొత్తవలస: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో షూటింగ్‌బాల్ క్రీడను పోత్రహించేందుకు ఆ అసోసియేషన్ నాయకులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 100 మంది షూటింగ్ బాల్ క్రీడాకారులు ఉన్నారని, గతేడాది జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పులిబంటి ప్రసాద్ తెలిపారు.
షూటింగ్ బాల్ అంటే..
షూటింగ్ బాల్ అంటే ఒక కంటితో గురి చూసి గన్‌తో కాల్చాలని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. వాలీబాల్‌ను పోలిన ఈ షూటింగ్ బాల్‌లో కూడా ప్రత్యర్థి కోర్టులోకి బంతిని టెక్నిక్‌గా కొట్టి పాయింట్లు సాధించడమే షూటింగ్ బాల్. చిత్తూరు జిల్లాలో ఆదరణ పొందుతున్న ఈ క్రీడ విజయనగరం జిల్లాలో కొత్త క్రీడగా అందరి ఆదరణ పొందుతూ వడివడిగా అడుగులు వేస్తోంది.
1976 నుంచి 39 సార్లు..
1976 నుంచి ఇప్పటివరకూ ఈ క్రీడను జాతీయ స్థాయిలో 39 సార్లు నిర్వహించారు. మన రాష్ట్రం తొలిసారిగా 2018లో విజయవాడలో, 2019లో చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించారు. ఈ క్రీడను అభివృద్ధి చేసేందుకు షూటింగ్‌బాల్‌తో అనుబంధం ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడలను పోత్సహించే విద్యావేత్తలు కమిటీగా ఏర్పడి రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురామ్ ఆధ్వర్యంలో 13 జిల్లాలో అసోసియేషన్‌లు ఏర్పాటుచేశారు. విజయనగరం జిల్లా షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా పులిబంటి ప్రసాద్‌ను నియమించారు. ఇతని ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిగా జే శివకృష్ణ, ఉపాధ్యక్షుడిగా సంతోష్, ట్రెజరర్‌గా పి.అచ్చియ్యమ్మ పనిచేస్తున్నారు.
వాలీబాల్‌కు, షూటింగ్‌బాల్‌కు తేడాలు..
♦వాలీబాల్‌లో 12 మంది క్రీడాకారులు ఉండగా ఆరుగురు ఆడుతూ ఆరుగురు స్టాండ్‌బైగా ఉంటారు.
♦షూటింగ్ బాల్‌లో 12 మంది ఉన్నప్పటికీ ఏడుగురు మాత్రమే కోర్టులో ఆడుతారు. ఐదుగురు స్టాండ్‌బైగా ఉంటారు.
♦వాలీబాల్‌లో 20 నుంచి 25 పాయింట్‌లు వస్తే విజేతగా ప్రకటిస్తారు.
♦షూటింగ్ బాల్‌లో కేవలం 15 పాయింట్లు మూడు సెట్లలో రెండు సెట్లు ఎవరు గెలిస్తే వారే విజేతగా ప్రకటిస్తారు.
♦వాలీబాల్‌లో బాల్ ఒకచేతి వేళ్లతోనే కొట్టి పాయింట్లు సాధిస్తే, షూటింగ్ బాల్‌లో బంతిని రెండుచేతులతో పాస్‌చేస్తూ వేళ్లు అరచేతులు తాకకుండా చూసుకోవాలి.
♦16 ఏళ్లు నిండిన వారిని సబ్‌జూనియర్స్‌గా, 19 ఏళ్లు నిండిన వారిని జూనియర్స్‌గా, ఆపై వారిని సీనియర్స్‌గా పరిగణిస్తారు.
♦వాలీబాల్ కంటే షూటింగ్ బాల్ ఆట సమయం పరిమితంగా ఉంటుంది.
♦వాలీబాల్ కంటే షూటింగ్ బాల్ కొద్దిగా చిన్నదిగా ఉంటుంది.
రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా
వాలీబాల్‌కంటే షూటింగ్‌బాల్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మా కళాశాలలో తొలిసారిగా ఆడించినప్పుడు బాల్ విసురుకోవడం ఏంటా అని అనుకున్నాను. గేమ్ నేర్చుకున్న తరువాత తెలిసింది దీని విలువ ఏంటో. గతేడాది మా కళాశాల నుంచి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా చాలా సులువుగా నేర్చుకోవచ్చు.
–కే గణేష్, షూటింగ్‌బాల్ క్రీడాకారుడు, ప్రగతి వ్యాయామ కళాశాల ఎంపీఈడీ విద్యార్థి, కొత్తవలస మండలం
అవకాశాలు ఎక్కువ
దేశంలో క్రీడామంత్రిత్వశాఖ గుర్తించిన అన్ని క్రీడలతో సమానంగా షూటింగ్‌బాల్‌కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో దీనిపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వ్యాయామ విద్యలో షూటింగ్‌బాల్‌ను భాగం చేయాలని ప్రభుత్వాన్ని మా పెద్దలు ఇప్పటికే కోరారు.
–పి.ప్రసాద్, షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment