శానిటైజర్‌ వాడుతున్నారా... | Special Story On Precautions In The Use Of Sanitizer | Sakshi
Sakshi News home page

శానిటైజర్‌ వాడుతున్నారా...

Published Mon, Jul 20 2020 9:50 AM | Last Updated on Mon, Jul 20 2020 9:50 AM

Special Story On Precautions In The Use Of Sanitizer - Sakshi

శృంగవరపుకోట రూరల్‌: కరోనా వైరస్‌ వ్యాప్తితో చేతుల పరిశుభ్రతకు ప్రాధాన్యం పెరిగింది. ఎక్కడికి వెళ్లినా శానిటైజర్‌ రాసుకోవడం, సబ్బు నీళ్లతో కడగడం షరా మామూలుగా మారింది. స్నేహితులు, సన్నిహితులను కలిసి రాగానే చేతులకు శానిటైజర్‌ రాసుకోవడం పరిపాటైంది. పిల్లల చేతులను సైతం శానిటైజర్‌తో శుభ్రం చేస్తున్నారు. వంట చేసే సమయంలోనూ శానిటైజర్‌ను రాసుకోవడం మానడం లేదు. అయితే.. శానిటైజర్‌తో ఎంత ప్రయోజనం ఉందో అంతే నష్టం కూడా ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా గృహిణులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.  

శానిటైజర్లు ఎందుకంటే.. 
బిజీగా ఉన్న జీవితంలో అన్ని పనులు త్వరత్వరగా చేస్తుంటాం. చేతులు శుభ్రం చేసుకోకుండా కొన్నిసార్లు ఆహార పదార్థాలు తింటూ ఉంటాం. ఇది మంచిది కాదు. ఎందుకంటే, ప్రతిరోజు మన చేతిలో ఒక మిలియన్‌ క్రిములు నిండిపోతాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎప్పుడూ సబ్బు నీటితో చేతులు కడుక్కోవడం సాధ్యం కాదు. కాబట్టి చాలామంది శానిటైజర్లను వాడుతుంటారు. ఇందులో మద్యం ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్ల వినియోగం ఎక్కువగా ఉంది. ఈ హ్యాండ్‌ శానిటైజర్లని వాడితన తర్వాత నీరు అవసరం లేదు. సాధారణ సబ్బు, నీరు లేకుండానే.. చేతులని శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చేతుల్లోని క్రిములు చాలా వరకు నశిస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో వీటి వాడకం మరింత ఎక్కువైంది.  

మండే స్వభావం.. 
శానిటైజర్లలో 60–90శాతం ఆల్కహాలు కలిసి ఉంటాయి. అదే క్రిముల్ని సంహరిస్తుంది. ఈ మిశ్రమానికి వంద డిగ్రీల కంటే తక్కువ వేడిలో మండే స్వభావం ఉంటుంది. ఇది చేతికి రాసుకున్న వెంటనే వంట గదిలోకి వెళ్లి గ్యాస్‌ స్టవ్‌ వెలిగిస్తే నిప్పు అంటుకునే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల గృహిణులు చేతికి శానిటైజర్‌ రాసుకుని అది ఆరిన తర్వాతే వంట చేసే పనులు చేయడం మేలు. 

పిల్లల విషయంలో...  
శానిటైజర్ల వినియోగం ద్వారా సమస్యలు వస్తాయని అంతర్జాతీయ పరిశోధన సంస్థ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రి వెన్షన్‌ సెంటర్‌ నివేదికలు సూచిస్తున్నాయి. పదేళ్ల లోపు పిల్లలు వినియోగించే  సమయంలో తగిన జా గ్రత్తలు తీసుకోవాలి. ఐదేళ్ల లోపు వారికి చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు.  

ఎలాంటి శానిటైజర్లు మేలు..
జిగురు, నురుగు మాదిరి కంటే ద్రావణంగా ఉండే శానిటైజర్లే మంచిది.  
చేతుల్లో వేసుకుని రుద్దుకున్న తర్వాత ఒక నిమిషంలో అది ఆవిరవ్వాలి. అలా కాకుండా చేతులకు అంటుకుని ఉంటే చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయి.  
శానిటైజర్లతో 60–90 శాతం ఆల్కహాల్‌ ఉండాలి. అంతకంటే తగ్గినా, ఎక్కువగా ఉన్నా ఆశించిన ఫలితం రాకపోగా కొత్త సమస్యలు వస్తాయి. 
కనీసం 20–30 సెకన్ల పాటు చేతులకు రుద్దుకోవాలి. 

సబ్బుతో కడుక్కుంటే మేలు.. 
శానిటైజర్ల వాడకంపై విస్తృతంగా ప్రచారం జరగడంతో పలు నాసిరకం శానిటైజర్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటి గాఢత ఎక్కువ ఉండటంతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. శానిటైజర్ల ధరలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. సబ్బు అయితే తక్కువ ధరలో లభ్యమవుతుంది. చేతులు పూర్తిస్థాయిలో శుభ్రమవుతాయి. వైద్యులు సైతం సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement