క్షీర సాగర మథనం నిర్విఘ్నంగా పూర్తి కావడానికి శ్రీమహావిష్ణువు కూర్మరూపంలో అవతరించగా.. ఆ రూపాన్ని మరెక్కడా లేని తీరులో మూలవిరాట్టుగా ప్రతిష్టించి అర్చిస్తున్న విశిష్టత మన జిల్లాలో గోచరిస్తుంది. ఆధ్యాత్మిక భావానికి పరాకాష్టగా కూర్మనాథుడి ఆరాధనను చెప్పుకుంటే.. ఈ కాలంలో అందుకు ఏమాత్రం తీసిపోని మరో మానవీయ సేవ తీరప్రాంతంలో నిర్విఘ్నంగా సాగిపోతోంది. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతతిని పరిరక్షించడానికి.. వాటి గుడ్లను సేకరించి.. ప్రత్యేకించి పొదిగించి.. మళ్లీ సముద్రంలో లక్షలాది చిరుజీవులను విడిచిపెట్టే గొప్ప ప్రయత్నం నిరతం సాగుతోంది. అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్ చేస్తున్న ఈ మంచి ప్రయత్నం సముద్రం చేయూతతో ప్రశంసనీయ రీతిలో నడుస్తోంది.
వజ్రపుకొత్తూరు రూరల్: అరుదైన ఉభయచర జీవుల్లో ఆలివ్ రిడ్లే తాబేలు ఒకటి. జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశ సముద్ర జలాల్లో అధికంగా కనిపించే ఈ రకమైన కూర్మాలు కేవలం గుడ్లు పెట్టేందుకు మన సముద్ర తీరానికి చేరుకుంటాయి. రాత్రి సమయంలో తీరంలోని ఇసుక తిన్నెల్లో గుడ్లు పెట్టి సముద్ర జలాల్లోకి జారుకుంటాయి.
భద్రంగా కాపాడుతూ..
జిల్లాలోని 193 కి.మీ. విశాల సముద్ర తీర ప్రాంతం ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతతికి నిలయంగా నిలుస్తోంది. 16 హ్యచరీలు(తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు)ను అటవీ శాఖ అధికారులు, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు సంయుక్తంగా ఏర్పాటు చేసి అరుదైన తాబేళ్లకు జీవం పోస్తున్నారు. ఇవి అంతరించిపోకుండా జిల్లా వ్యాప్తంగా 41 మంది వలంటీర్లను నియమించి వారి ద్వారా గుడ్లను సేకరిస్తున్నారు. తల్లి తాబేళ్లు ఇసుక తిన్నెలలో పెట్టిన గుడ్లు.. పక్షులు, జంతువులు, దొంగల బారిన పడకుండా సురక్షితంగా భద్రపరుస్తున్నారు.
రాత్రి సమయం కీలకం..
ఏటా జనవరి నుంచి మార్చి వరకు తల్లి తాబేళ్లు గుడ్లు పెట్టే సమయం. రాత్రి 2 నుంచి వేకువజాము 5.30 గంటలలోపు తీరానికి చేరుకుని ఇసుక తిన్నెలలో బొరియలు చేసి గుడ్లును పెట్టి సముద్రంలోకి జారుకుంటాయి. ఒక్కో తాబేలు 30–140 వరకు గుడ్లు పెడతాయి. 28–30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగిన పిల్లలు మగ తాబేళ్లుగా.. 30–32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగినవి ఆడ తాబేళ్లుగా పుడతాయి.
ఇక జిల్లా వ్యాప్తంగా 16 హ్యాచరీలు ఉన్నాయి.
- వజ్రపుకొత్తూరు సెక్షన్: వజ్రపుకొత్తూరు, మెట్టూరు
- బారువ సెక్షన్: కళింగపట్నం, గడ్డివూరు, బట్టి గల్లూరు, బారువ, ఇసకలపాలెం
- కవిటి సెక్షన్: డొంకూరు, చేపల కపాసుకుద్ది, బట్టివానిపాలెం
- శ్రీకాకుళం సెక్షన్: కొచ్చెర్ల, కనుగులవానిపేట
- టెక్కలి సెక్షన్: గుళ్లవాని పేట, కుందివానిపేట, మేఘవరం, భావనపాడు తీరాలలో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
25 లక్షల పిల్లలను సంరక్షించాం..
సముద్ర తాబేళ్ల సంతతిని పెంచడానికి కృషి చేస్తున్నాం. అటవీ శాఖతో కలిసి మా ట్రీ ఫౌండేషన్ పని చేస్తూ తాబేళ్లను సంరక్షిస్తున్నాం. గత పదేళ్లగా దాదాపు 25 లక్షల బుల్లి తాబేళ్లలను సురక్షితంగా సముద్రంలో విడిచి పెట్టాం.
– కోడ సోమేష్, ట్రీ ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్
సంరక్షణకు ప్రత్యేక చర్యలు
ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. హ్యచరీల వద్ద ప్రత్యేకంగా నియమించిన వలంటీర్ల ద్వారా వేలాది సంఖ్యలో తాబేళ్ల గుడ్లను సేకరిస్తున్నాం. వలంటీర్లకు నెలకు రూ.9,200 గౌరవ వేతనం అందిస్తున్నాం.
– రజనీకాంతరావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కాశీబుగ్గ రేంజ్
Comments
Please login to add a commentAdd a comment