ఆయన జీవితం.. స్ఫూర్తివంతం.. ఫలవంతం | Special Story On Visakha Dairy Chairman Tulasi Rao | Sakshi
Sakshi News home page

ఆంధ్రా కురియన్‌: సేవాతత్పరుడు..క్షీర సాగరుడు

Published Thu, Jan 5 2023 8:11 AM | Last Updated on Thu, Jan 5 2023 10:04 AM

Special Story On Visakha Dairy Chairman Tulasi Rao - Sakshi

రైతుల్లో రైతుగా.. వారికి పెద్దన్నగా నిలిచారు. పొట్ట చేతపట్టుకు వలసపోయే దుస్థితి లేకుండా తమ గ్రామాల్లోనే గౌరవప్రదంగా బతికేట్టు చేశారు. వాళ్లకు ఏ అవసరం వచ్చినా డెయిరీ ఉందంటూ ధీమానిచ్చారు. ఇందుకోసం అహర్నిశలూ శ్రమించారు. పాడిరైతుల పెన్నిధి ఆయన. వారి కుటుంబాలకు కార్పొరేట్‌ వైద్యం.. వారి పిల్లలకు చక్కని చదువులు.. గ్రామాల్లో వంతెనలు,  కల్యాణమండపాల నిర్మాణం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడారి తులసీరావు చేసిన పనులు, సాధించిన ఘనతలు కోకొల్లలు. పదో తరగతి కూడా పాసవని ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఇన్ని పనులు చేశారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. స్ఫూర్తివంతం.. ఫలవంతం ఆయన జీవితం. 

మునగపాక/అనకాపల్లి రూరల్‌:  సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు.. అసామాన్యుడిగా ఎదిగారు.. ఆంధ్రా కురియన్‌గా పిలుచుకునే ఉత్తరాంధ్ర దిగ్గజం ఆడారి తులసీరావు ఒక వ్యక్తి కాదు వ్యవస్థ. 1986లో విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆయన పగ్గాలు చేపట్టారు. ఆ రంగంలో అపూర్వ విజయాలు సాధించారు. విశాఖ డెయిరీ సామర్ధ్యాన్ని ఇప్పుడు 9 లక్షల లీటర్ల స్థాయికి తీసుకువచ్చారు. ఆయన చైర్మన్‌గా ఎన్నికైనప్పుడు 50 సొసైటీలు ఉండగా ఇప్పుడవి 1700 సొసైటీలు, 3,700 పాలసేకరణ కేంద్రాల వరకూ విస్తరించాయి. రూ.11 కోట్ల టర్నోవర్‌ ఉన్న డెయిరీని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ప్రస్తుతం రూ. 2 వేల కోట్ల టర్నోవర్‌ కంపెనీగా అభివృద్ధి చేశారు. 40కి పైగా దేశాల్లో పర్యటించి అధ్యయనం చేసి పాడిపరిశ్రమ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారు. 

సేవల్లోను అగ్రస్థానం 
విశాఖ డెయిరీ అభివృద్ధి విషయంలోనే కాకుండా రైతులకు, డెయిరీ కార్మిక కుటుంబాలకు అవసరమైన సేవలను అందించడంలో కూడా ఆయన ఎల్లప్పుడూ ముందున్నారు. గ్రామాల్లో ఎన్నో రహదారులు, 40 కాలువలు, లెక్కలేనన్ని కల్వర్టులు, రెండు రిజర్వాయర్లు, 20 కల్యాణ మండపాలు నిర్మించారు. పాల ఉత్పత్తిదారులకు, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం విషయంలో బాధ్యత తీసుకొన్నారు. రైతుల పిల్లలకు నర్సింగ్‌లో శిక్షణ ఇప్పించి ఉద్యోగాలను వేయించారు. అంగవైకల్యం ఉన్న అనేకమందికి డెయిరీలో ఉద్యోగాలిచ్చి ఆశ్రయం కల్పించారు.

డెయిరీ లాభాల్లో పాల ఉత్పత్తిదారులకు వాటా ఇచ్చారు. రైతులకు పశుగ్రాసం అందించడానికి కృషి చేశారు. మునగపాక మండలంలోని మెలిపాక నుంచి యాదగిరిపాలెం మీదుగా యలమంచిలి చేరుకునేందుకు వీలుగా రూ.8.5 కోట్ల వ్యయంతో తులసీ వారధి నిర్మించారు. మునగపాకలో కళాప్రదర్శనల కోసం తులసీ కళావేదిక ఏర్పాటుకు రూ.25 లక్షలు మంజూరు చేశారు. అక్కడే రూ.75 లక్షల వ్యయంతో కళ్యాణమండపం నిర్మించారు. మిల్క్‌ ప్రొడ్యూసర్‌ ఎంప్లాయీస్‌ ఎడ్యుకేషన్, హెల్త్‌–మెడికల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ద్వారా వైద్యసేవలందించారు. పాఠశాలలు, జూనియర్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యనందించారు. దాదాపుగా 1700 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించారు. 1500కు పైగా గ్రామాల్లో వ్యవసాయ బోర్‌ వెల్స్‌ ఉచితంగా ఏర్పాటుచేశారు.

 

ఇంతింతై వటుడింతై...
యలమంచిలిలో ఆడారి వెంకట రమణయ్య, సీతయమ్మ దంపతులకు తులసీరావు 1939లో జన్మించారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన తులసీరావు పెద్దగా చదువుకోలేనప్పటికీ ఎన్నో విజయాలు సాధించారు. ఆయన తాత ఆడారి వీరినాయుడు అప్పట్లో విశాఖ జిల్లా బోర్డు సభ్యుడిగా రాజకీయాల్లో వుండేవారు. ఆయన వారసత్వం తులసీరావుకు వచ్చింది. రాజకీయ సువాసనలు ఒంట బట్టించుకున్న తులసీరావు 24 ఏళ్ల పిన్నవయస్సులోనే 1963లో యలమంచిలి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1968, 1981 ఎన్నికల్లో కూడా సర్పంచ్‌గా గెలిచారు. మ«ధ్యలో 11 ఏళ్లు ఎన్నికలు జరగకపోయినా ఆయనే పెద్ద దిక్కుగా వుండేవారు. ఆయన కుమార్తె పిళ్లా రమాకుమారి రెండుసార్లు యలమంచిలి సర్పంచ్‌గా సేవలందించారు. ప్రస్తుతం యలమంచిలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఆయన కుమారుడు ఆనంద్‌కుమార్‌ విశాఖ డెయిరీకి వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.   

దశదిశలా విశాఖ డెయిరీ
గాజువాక/అక్కిరెడ్డిపాలెం: తులసీరావు సుమారు నాలుగు దశాబ్దాల కిందట జిల్లాలోని ఏ ఇతర ప్రాంతాలకూ గాజువాక నుంచి రవాణా సౌకర్యం కూడా సరిగ్గాలేని రోజుల్లో డెయిరీని గాజువాకలో ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాంతాల్లోనూ పాల వ్యాపారం విస్తరించేందుకు గాజువాకను ఆనాడే కేంద్రంగా ఎన్నుకున్నారు. ప్రారంభ దినాల్లో ప్రతిరోజు 3 నుంచి 4 వేల లీటర్ల పాలను సేకరించి సరఫరా చేసేవారు. తులసీరావు కృషితో ఆ సేకరణ ప్రస్తుతం రోజుకు 9 లక్షల లీటర్లకు చేరింది. పాల సేకరణతోపాటు విశాఖ డెయిరీని బహుముఖంగా అభివృద్ధి చేశారు.

అనేక రకాల పాల ఉత్పత్తులు, నెయ్యి పెరుగు, లస్సీ, మిఠాయిలను అందుబాటులోకి తీసుకొచ్చారు. డెయిరీ విస్తరణలో భాగంగా రాజమండ్రిలో 2013లో మరోప్లాంట్‌ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు పాల ఉత్పత్తుల్లో విశాఖ డెయిరీని నంబర్‌ వన్‌గా నిలబెట్టారు. దానికి ఆధునిక టెక్నాలజీని జోడించి పాల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. సహజంగా వేసవి కాలంలో పాలకు కొరత ఉంటుంది. ఈ కొరతను అధిగమించడానికి ఎక్కువ పాలను సేకరించి వాటిని పొడిగా చేసి అందిస్తున్నారు. టెట్రా ప్యాక్, నిల్వ ప్యాకెట్లు తయారు చేసి వినియోగదారులకు నిరంతం అందుబాటులో ఉంచుతున్నారు. విశాఖ డెయిరీ ఉత్పత్తులను విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. అందుకే ఆయన పాల ఉత్పత్తిలో ఆంధ్రా కురియన్‌గా కీర్తినందుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement