పేదల ఇళ్ల నిర్మాణాల్లో జోరు | Speedup Navaratnalu construction of houses for poor in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పేదల ఇళ్ల నిర్మాణాల్లో జోరు

Published Sun, May 1 2022 3:55 AM | Last Updated on Sun, May 1 2022 11:04 AM

Speedup Navaratnalu construction of houses for poor in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: తొలి దశలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారులందరికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఇళ్ల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి అయ్యేందుకు వీలుగా ఒక్కో లబ్ధిదారునికి రూ.35 వేల చొప్పున బ్యాంకులు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ పరిపాలన అనుమతి మంజూరు చేసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అన్ని బ్యాంకులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 3,59,856 మంది ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకులు రూ.1,332 కోట్ల మేర పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేశాయి. రాష్ట్రంలో తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు వ్యయం చేస్తోంది. అయితే లబ్ధిదారుల వెసులు బాటు కోసం పావలా వడ్డీకే రూ.35 వేలు చొప్పున రుణాలు మంజూరు చేయిస్తోంది. ఇప్పటికే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 45 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 38, తిరుపతి జిల్లాలో 35, కాకినాడ జిల్లాలో 33, పల్నాడు జిల్లాలో 28 శాతం మేర లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. 

వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ 
పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయడంలో వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేకంగా బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ తెలిపారు. రుణాల మంజూరులో వెనుకబడిన పార్వతిపురం మన్యం, నంద్యాల, కృష్ణా, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో బ్యాంకులతో సమన్వయం చేసుకుని, త్వరితగతిన రుణాలు మంజూరు చేయించాలని ఆదేశించినట్లు తెలిపారు. తరచూ జిల్లా స్థాయిలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని సూచించామన్నారు. దీంతో ఈ వేసవిలో ఇళ్ల నిర్మాణాలు మరింత వేగం పుంజుకోనున్నాయని చెప్పారు. ఈ రుణాలకు సంబంధించి లబ్ధిదారులకు పావలా వడ్డీయే పడుతుందని, మిగతా వడ్డీని ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement