ఆయన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు. గతంలో అధ్యాపకుడిగా ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన పెద్దసారు.. కానీ తన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు రీయింబర్స్ చేసినా వాటిని విద్యార్థులకు ఇవ్వకుండా స్వాహా చేసేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు పదేపదే కళాశాలకు వస్తుండగా.. ముఖం చాటేసి తిరుగుతున్నారు.
అనంతపురం: ‘పల్లె’ రఘునాథరెడ్డి విద్యా సంస్థల గురించి జిల్లాలో తెలియనివారు ఉండరు. అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించిన ఆయన విద్యాసంస్థల అధిపతిగా మారారు. ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేస్తూ తన పలుకుబడితో ఇబ్బడిముబ్బడిగా కళాశాలలు స్థాపించారు. కనీస సౌకర్యాలు లేకపోయినా నెట్టుకొస్తున్నారు. బోధనా ప్రమాణాలు తుంగలోతొక్కి ఫీజుల వసూలే లక్ష్యంగా విద్యాసంస్థలు నడుపుతున్నారు. తాజాగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల స్వాహాకు సిద్ధమయ్యారు.
పల్లె రఘునాథరెడ్డి టీడీపీ హయాంలోనే అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కళాశాలను స్థాపించారు. ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల ఫీజు నిర్ణయించారు. ఇది చాలా ఎక్కువే అయినప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందన్న ఆశతో చాలా మంది నిరుపేద తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కళాశాలలో చేర్పించారు. 2016–20 బ్యాచ్ విద్యార్థులు ఇటీవలే బీఎస్సీ (హార్టికల్చర్)కోర్సును పూర్తి చేశారు. అయితే గత టీడీపీ ప్రభుత్వం రెండు విద్యా సంవత్సరాల ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేదు. దీంతో ‘పల్లె’ విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఫీజులు చెల్లించకపోతే పరీక్షలు రాయించబోమని హెచ్చరించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు బయట వడ్డీలకు తెచ్చి మరీ ఫీజులు చెల్లించారు.
ఇలా కళాశాలలోని 92 మంది విద్యార్థులు రూ.1.80 కోట్లు కళాశాలకు చెల్లించారు. తాజాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని ఏకకాలంలో మంజూరు చేసింది. 2020 మార్చి 30న ఈ మొత్తాన్ని ఆయా ప్రిన్సిపాళ్ల ఖాతాల్లో జమ చేసింది. ఒక్క అనంతపురం జిల్లాకే రూ. 350 కోట్లు్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే విద్యార్థుల నుంచి కట్టించుకున్న ఫీజులను తిరిగి వెనక్కి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ‘పల్లె’కు చెందిన శ్రీకృష్ణదేవరాయ హారి్టకల్చర్ కళాశాల మాత్రం రీయింబర్స్‌మెంట్ నిధులు విద్యార్థులకు వెనక్కి ఇవ్వకుండా వేధిస్తోంది. ఒక వైపు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకుని.. మరో వైపు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని తీసుకుంది. ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తోంది.
కళాశాల ఆధునికీకరణ సాకుగా చూపి..
తాము నూతనంగా కళాశాల ఏర్పాటు చేశామని, ఆధునీకరణకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశామని, అందువల్ల తమకు వీలైనపుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విద్యార్థులకు చెల్లిస్తామని శ్రీకృష్ణదేవరాయ హారి్టకల్చర్ కళాశాల యాజమాన్యం చెబుతోంది. ఇలా 7 నెలలుగా విద్యార్థుల తల్లిదండ్రులను తిప్పించుకుంటోంది. ఇప్పటికే తాము ఫీజు మొత్తం చెల్లించామనీ...ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఇవ్వాలని కోరినా నిర్వాహకులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పల్లె విద్యా సంస్థ అయిన శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
ప్రాధేయపడినా..
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉందంటే కళాశాలలో చేరాను. గత టీడీపీ ప్రభుత్వం సకాలంలో రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో మాపై ఒత్తిడి తెచ్చారు. చేసేది లేక మా అమ్మానాన్న వడ్డీలకు డబ్బులు తెచ్చి ఫీజులు చెల్లించారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మా ఫీజులను రీయింబర్స్‌మెంట్ చేసి ప్రిన్సిపల్ ఖాతాలో డబ్బులు వేసినా మాకు ఇవ్వడం లేదు. ఎన్నోసార్లు కళాశాల యాజమాన్యాన్ని ప్రాధేయపడినా కనికరించడం లేదు.
– బీఎస్సీ(హార్టికల్చర్ )విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment