వరదయ్యపాలెం : తిరుపతి జిల్లాలోని శ్రీసిటీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్‌ఓవెన్ మంగళవారం సందర్శించారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు స్వాగతం పలికి శ్రీసిటీలో మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రగతి, సుస్థిర అభివృద్ధి, హరితహిత చర్యలు, వ్యాపార అనుకూలతలు, వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక ప్రోత్సాహకాలను వివరించారు.
శ్రీసిటీలో విభిన్న రంగాలకు చెందిన 8 ప్రముఖ బ్రిటిష్ కంపెనీ ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శ్రీసిటీ ప్రపంచశ్రేణి మౌలిక వసతులు, వ్యాపార అనుకూల వాతావరణం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ శ్రీసిటీ పారిశ్రామిక అభివృద్ధిని అభినందించారు. 15ఏళ్లలో మంచి పారిశ్రామిక అభివృద్ధి సాధించడంతోపాటు పలు యూకే కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కావడం అద్భుతమని ప్రశంసించారు.
త్వరలో వివిధ రంగాలకు చెందిన మరిన్ని బ్రిటిష్ కంపెనీలు శ్రీసిటీకి తరలివస్తాయన్నారు. హెడ్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మిషన్ హెడ్ వరుణ్ మాలి మాట్లాడుతూ.. శ్రీసిటిలో టెక్నాలజీ, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో ముఖ్యంగా సుస్థిరతపై కలిసి పనిచేయాలని వ్యూహరచన చేస్తున్నట్టు చెప్పారు.
పర్యటనలో భాగంగా గారెత్ విన్ ఓవెన్ శ్రీసిటీ పరిసరాలతో పాటు బెర్జిన్ పైప్స్ సపోర్ట్స్ ఇండియా, ఎంఎండీహెవీ మెషినరీ, రోటోలాక్ ఇండియా, ఎంఎస్‌ఆర్ గార్మెంట్స్, క్యాడ్బరీ కంపెనీలను సందర్శించారు. ఈ సందర్భంగా బెర్జిన్ పైప్స్ పరిశ్రమలో 350 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించారు. క్రియా యూనివర్సిటీని సందర్శించి అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment