విద్యుత్‌పై ఉత్త కబుర్లే.. ఆ ‘బాబు’ గొప్పేమీ లేదు  | Sridhar Comments On TDP Government for Power plants | Sakshi
Sakshi News home page

విద్యుత్‌పై ఉత్త కబుర్లే.. ఆ ‘బాబు’ గొప్పేమీ లేదు 

Published Mon, Apr 11 2022 3:42 AM | Last Updated on Mon, Apr 11 2022 7:46 AM

Sridhar Comments On TDP Government for Power plants - Sakshi

సాక్షి,అమరావతి: గతంలో టీడీపీ అధికారంలోకి వచ్చేసరికే రాష్ట్రంలో విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయని, గత సర్కారు హయాంలోనే మొదలయ్యాయనడంలో ఏమాత్రం వాస్తవం లేదని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌ స్పష్టం చేశారు. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్‌తో కలసి ఆదివారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

గుదిబండల్లా పీపీఏలు.. బకాయిలు
ఆర్టీపీపీలో 600 మెగావాట్లు, కృష్ణపట్నంలో 1600 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులు 2009లోనే మొదలయ్యాయని ఇంధనశాఖ కార్యదర్శి వెల్లడించారు. 2014 నాటికి దేశ వ్యాప్తంగా మిగులు విద్యుత్‌ ఉన్నప్పటికీ అధిక ధరలకు 8,000 మెగావాట్ల పీపీఏలు కుదుర్చుకోవడంతో పాతికేళ్ల పాటు ఏటా రూ.3 వేల కోట్లు భారం డిస్కంలపై పడుతోందన్నారు. గత సర్కారు హయాంలో రూ.30 వేల కోట్ల రుణాలు తీసుకుని 2018–19 నాటికి రూ.62 వేల కోట్లకు చేర్చారని, ఏటా రూ.8 వేల కోట్లు చొప్పున ఇవ్వాల్సిన సబ్సిడీలను ఇవ్వకుండా రూ.2 వేల కోట్లే ఇవ్వడం వల్ల బకాయిలు పెరిగిపోయాయని చెప్పారు. గత ప్రభుత్వం ట్రూ అప్‌ చార్జీలను (విద్యుత్‌ కొనుగోలు ఖర్చులు) ఏపీఈఆర్సీకి సమర్పించకుండా, తప్పుడు నివేదికలు సమర్పించడంతో ఆర్థిక భారం పడిందన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు, బకాయిలకే రెండున్నరేళ్లలో రూ.36 వేల కోట్లు ఇచ్చిందన్నారు. 

నెలలోపే కృష్ణపట్నం యూనిట్‌
రాష్ట్ర ప్రభుత్వం పోలవరంలో 960 మెగావాట్ల హైడల్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టును సిద్ధం చేస్తోందని, 2024 నుంచి దశలవారీగా ఆ విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి వివరించారు. సీలేరులో 1350 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు చేపట్టామని, మూడు నెలల్లో టెండర్లు ఖరారు చేస్తామని తెలిపారు. వీటీపీఎస్, కృష్ణపట్నంలో 800 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లను త్వరగా ప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వెల్లడించారు. కృష్ణపట్నం యూనిట్‌ నెలలోపే ప్రారంభిస్తామన్నారు. నెడ్‌ కాప్‌ ద్వారా 6600 మెగావాట్ల సామర్థ్యంతో ఏడు పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని, డీపీఆర్‌ సిద్ధమవుతోందని తెలిపారు. 

సాగుకు సౌర విద్యుత్తుతో భరోసా
వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఇటీవల ఎన్టీపీసీ చైర్మన్‌తో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి తెలియచేశారని ఇంధనశాఖ కార్యదర్శి చెప్పారు. రాబోయే 30 ఏళ్ల పాటు రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వ్యవసాయానికి సెకీ ద్వారా తక్కువ ధరకే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ను రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌ రూ.2.49కే సేకరిస్తోందని, తద్వారా 2024లో వ్యవసాయ మిగులు విద్యుత్‌ను గృహ, పారిశ్రామిక అవసరాలకు అందిస్తామన్నారు. ప్రస్తుతం సగటున విద్యుత్తు కొనుగోలు వ్యయం యూనిట్‌ రూ.5.10 చొప్పున ఉందన్నారు. ఈ లెక్కన సంవత్సరానికి దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి గత సర్కారు హయాంలో విడుదల చేసిన మొత్తం రాయితీలు రూ.13,255 కోట్లు కాగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లలో విడుదల చేసిన సబ్సిడీలు రూ.21,497 కోట్లు అని శ్రీధర్‌ వెల్లడించారు.

బొగ్గు సంక్షోభంతో..
దేశంలో విపత్కర పరిస్థితులు, వ్యవసాయ రంగం డిమాండ్, బొగ్గు సంక్షోభం విద్యుత్‌ కోతలకు ప్రధాన కారణాలని శ్రీధర్‌ తెలిపారు. 2014–15 మధ్య కాలంలో 6 శాతంగా ఉన్న విద్యుత్‌ గ్రోత్‌ (సంవత్సరానికి సంవత్సరానికి మధ్య గ్రోత్‌) 2020–21లో 14 శాతానికి పెరిగిందని తెలిపారు. 2014–19లో కెపాసిటీ ఎడిషన్‌ జరగడం వల్ల డిస్కంలపై, వినియోగదారులపై భారం పడిందని, విద్యుత్‌ కొరతకు ఇది కూడా ఓ కారణమన్నారు.  మే నెలలో మొదలై జూన్, జూలై వరకు మాత్రమే విండ్‌ పవర్‌ తక్కువ సమయం అందుబాటులో ఉంటుందన్నారు. 

తాత్కాలిక సమస్యలే..
ప్రస్తుతం నెలకొన్న విద్యుత్‌ సమస్యలు తాత్కాలికమేనని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇంధన శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం రోజు తక్షణమే తీసుకున్న చర్యల వల్ల గృహావసరాలు, వ్యవసాయానికి ఆదివారం రోజు విద్యుత్‌ కోతలను తగ్గించగలిగామని చెప్పారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గత నెల నుంచి విద్యుత్‌ వినియోగం గరిష్ట స్థాయికి చేరిందని, వ్యవసాయ విద్యుత్‌ వినియోగం ఈ నెలాఖరుకు తగ్గే అవకాశం ఉందన్నారు. సాగు విద్యుత్‌ వినియోగం తగ్గాక పరిశ్రమలకు యథావిథిగా విద్యుత్‌ సరఫరా ఉంటుందన్నారు. పరిశ్రమల నుంచి ఇప్పటికే వినతులు అందుతున్నాయని, త్వరలో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. 

ఎలాంటి బకాయిలు లేవు..
గత అక్టోబర్‌ నుంచి బొగ్గు సంక్షోభం నెలకొన్నా కోల్‌ కంపెనీలకు ఎటువంటి బకాయిలు లేవని, సింగరేణి నుంచి నిరంతరాయంగా సరఫరా జరుగుతోందని ఇంధనశాఖ కార్యదర్శి చెప్పారు. శనివారం రోజు కోల్‌ కంపెనీలకు రూ.150 కోట్లు చెల్లించామన్నారు. కోల్‌ ఇండియా నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేస్తోందని, రైల్వేలు కూడా క్రమం తప్పకుండా ర్యాక్‌లు సమకూరుస్తున్నాయని చెప్పారు. విశాఖలోని హిందూజా పవర్‌కు బొగ్గు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామని, అక్కడ విద్యుత్‌ ఉత్పత్తి జరిగితే పీపీఏ ప్రకారం మనకు 1000 మెగావాట్లు అందుతుందని తెలిపారు. విద్యుత్‌ సమస్యలపై కేంద్రం ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్న సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 

బాబు దూరదృష్టితోనే దేశమంతా మెరుగైందా?
రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విద్యుత్‌ కొరత నెలకొనగా టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే సమస్య తగ్గిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని, అయితే, ఇంధన కొరత తగ్గడం అనేది దేశవ్యాప్తంగా ఏర్పడ్డ పరిస్థితుల వల్లే కానీ గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కాదన్నారు. 2014 జూన్‌ 3న 16 రాష్ట్రాల్లో విద్యుత్‌ కొరత ఉండగా 2016 జూన్‌ 3 నాటికి నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే విద్యుత్‌ కొరత ఉందన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందన్నారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు తన దూరదృష్టితో కూడిన నాయకత్వం వల్లే దేశం మొత్తం విద్యుత్‌ పరిస్థితి మెరుగుపడిందని చెప్పగలరా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చేటప్పటికి 90 శాతం కంటే ఎక్కువ అభివృద్ధి దశలో ఉన్న కృష్ణపట్నం థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌.. ప్రభుత్వం ఏర్పడిన తేదీ నుంచి ఏడాది లోపు కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. గత ప్రభుత్వాల ప్రయత్నాల వల్లే అది సాధ్యమైంది కానీ టీడీపీ సర్కారు గొప్పతనమేమీ కాదన్నారు. 

డిస్కమ్‌లపై తీవ్ర ఒత్తిడి
టీడీపీ పాలనలో డిస్కంలపై తీవ్ర ఒత్తిడి ఉండేదని, చంద్రబాబు తనను తాను దార్శనికుడిగా అభివర్ణించుకునే అవకాశం లేదన్నారు. వాస్తవానికి విభజన తర్వాత మొదటి సంవత్సరానికి 54,225 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ను ఏపీఈఆర్సీ ఆమోదించిందని, 54,867 మిలియన్‌ యూనిట్ల లభ్యతను అంచనా వేయడం విద్యుత్‌ కొరత లేదని సూచిస్తుందన్నారు.ఆ సమయంలో దేశంలో స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 2,43,028 మెగావాట్లు ఉంటే, గరిష్ట డిమాండ్‌ 1,35,918 మెగావాట్లేనన్నారు.  అలాంటప్పుడు దీర్ఘకాలిక ప్రాతిపదికన భారీ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అధిక ఖర్చులతో తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయినా టీడీపీ ప్రభుత్వం  హడావుడిగా 8 వేల మెగావాట్ల పీపీఏలను అధిక ధర (యూనిట్‌ రూ. 4.84 చొప్పున)లకు కుదుర్చుకుందని గుర్తుచేశారు. 

రెట్టింపు అప్పులు.. భారీ బకాయిలు
టీడీపీ హయాంలో  విద్యుత్‌ రంగం అప్పులు  రూ.29,703 కోట్ల నుంచి రూ.58,596 కోట్లకు చేరాయన్నారు. విద్యుదుత్పత్తిదారులకు డిస్కంల బకాయిలు రూ.2,893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్ర పంపిణీ, వినియోగాల నికర విలువ రూ.4,315.72 కోట్ల ప్రతికూల విలువ నుంచి రూ.19,926.27 కోట్ల ప్రతికూల విలువకు క్షీణించిందన్నారు. కనీసం నెట్‌వర్త్‌ సానుకూలంగా ఉంటే చంద్రబాబు దూరదృష్టి గల వ్యక్తి అనే వాదనను కొంతవరకు సమర్థించవచ్చని, కానీ ఆయన హయాంలో నెట్‌వర్త్‌ గణనీయంగా క్షీణించిందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement