పెల్లుబికిన ఆగ్రహం | State wide protest over attack on Ambedkars statue | Sakshi
Sakshi News home page

పెల్లుబికిన ఆగ్రహం

Published Sat, Aug 10 2024 5:30 AM | Last Updated on Sat, Aug 10 2024 10:03 AM

State wide protest over attack on Ambedkars statue

అంబేడ్కర్‌ విగ్రహంపై పచ్చమూక దాడిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువ

సాక్షి, అమరావతి: విజయవాడలో సామాజిక న్యాయ మహాశిల్పమైన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాంపై టీడీపీ పచ్చమూకలు దాడిచేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది.

» చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో.. ఎస్వీయూ విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు తిరుపతిలో.. వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురు­మల్లి రామ్‌కుమార్‌రెడ్డి వాకాడులో.. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామినేటి కేశవులు, పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వ­యకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేరూరులో అంబేడ్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహంపై దాడిపట్ల డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ స్పందించాలని ఏపీ అంబేడ్కర్‌ యువజన సంఘం జిలాల్లా కార్యదర్శి వై. శివ డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ నిర్మాతకే దిక్కులేదంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పుత్తూరులో అన్నారు.



» కడపలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ వినోద్‌కుమార్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. బద్వేలు నెల్లూరు రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుండి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి, పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు.

» అన్నమయ్య జిల్లా రాజంపేట, రైల్వే కోడూరులో దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నిరసన వ్యక్తంచేసి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్‌ విగ్రహంపై దాడి సిగ్గుచేటని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు యమలాసుదర్శనం మదనపల్లెలో ఖండించారు.

» కర్నూలులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎ.మధుసూధన్, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఏఎండీ ఇంతియాజ్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, సీనియర్‌ నాయకులు గడ్డం రామక్రిష్ణ తదితరులు నిరసనలో పాల్గొన్నారు



» ప్రకాశం జిల్లాలో మాజీమంత్రి ఆదిమూలపు సురేష్‌ సింగరాయకొండలో.. వైఎస్సార్‌సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌లు నిరసన చేపట్టి అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. 

» అంబేడ్కర్‌ సృతివనంపై దాడి చేయడమంటే దేశ ప్రజలను అవమానించటమేనని పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిశోర్, పార్టీ ఎస్సీ నేతలతో కలిసి అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభి­షేకం నిర్వహించారు. ప్రజాస్వామ్యవాదులు ఈ ఘటనను ఖండించాలని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. గుంటూరులో అంబేడ్కర్‌ విగ్రహాం ఎదుట మాజీమంత్రి అంబటి రాంబాబు, పార్టీ ఇతర నేతలు నిరసన వ్యక్తంచేసి అంబేడ్కర్‌ విగ్రహాన్ని పాలతో శుద్ధిచే­శారు. తెనాలి, తాడికొండ, తుళ్లూరు, పొన్నూరులోనూ అంబేడ్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. 



» ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు క్షీరాభిషేకం చేశారు. కమ్యూనిస్టు ఇండియా జాతీయ కార్యదర్శి తోట సంగమేశ్వరరావు, జై భీమ్‌రావ్‌ భారత పార్టీ జనరల్‌ సెక్రెటరీ పరసా సురేష్‌ దాడిని ఖండించారు. మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ నియోజక­వర్గ ఇన్‌చార్జ్‌ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), నగర మేయర్‌ చిటికిన వెంకటేశ్వరమ్మ అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అవనిగడ్డ, నిడమానూరులోనూ  పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తంచేశారు.  

» పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏఎంసీ చైర్మన్‌ ముప్పిడి సంపత్‌కుమార్, తణుకు బార్‌ అసోసియేషన్‌ వద్ద న్యాయవాదులు.. పాల­కొల్లులో ప్రజాస్వామ్యవాదులు నిరసన తెలిపారు.


దుండగులను వెంటనే శిక్షించాలి 
విజయవాడ స్వరాజ్‌ మైదానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక చారిత్రక ఘట్టానికి ఆద్యుడిగా నిలిచారు. వైఎస్‌ జగన్‌ పేరును టీడీపీ దుండగులు ధ్వంసం చేయడం సరికాదు. ఆపేరు తిరిగి ఏర్పాటు చేయాలి. దుండగులు ఎవరైనా సరే పట్టుకొని వెంటనే శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.   – జూపూడి ప్రభాకరరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు 

మా ఆత్మగౌరవం దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం 
మేము దేవుడిగా చూసుకునే అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి చేసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పశి్చమగోదావరి జిల్లా గరగపర్రులో అంబేడ్కర్‌ విగ్రహం పెట్టనీయకుండా అడ్డుకున్నారు. అక్కడ విగ్రహం పెట్టాలని తలపెట్టిన వ్యక్తిని కూడా చంపించారు. అండగా నిలిచిన కుల సంఘాల ప్రతినిధులను అరెస్టు చేయించారు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి మా ఆత్మగౌరవం నిలబెట్టారు. అది చూసి చంద్రబాబు ఓర్వలేక ఇప్పుడు దాడి చేయించారు.   –నత్తా యోనారాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు

గవర్నర్‌ స్పందించి తక్షణం చర్యలు చేపట్టాలి 
రాజ్‌భవన్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి ఘటనలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలి. ఈ దాడిపై మౌనం వహించడం సరికాదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై, విగ్రహాలు, శిలాఫలకాలపై దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు. ఈ దాడులపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ దాడులపై జాతీయ స్థాయిలో సంఘాలకు,  పార్టీల దృష్టికి తీసుకెళ్లి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం. – పెరికె వరప్రసాదరావు, నేషనల్‌ దళిత జేఏసీ చైర్మన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement