ధర్మవరం రూరల్: ఆ పాఠశాల విద్యార్థులకు ఆటలంటే అమితమైన ఇష్టం. నిరంతరం సాధన చేస్తుంటారు. ఏ టోర్నీ జరిగినా విజేతగా నిలవాలని తాపత్రయపడుతుంటారు. వారి ఇష్టానికి అనుగుణంగానే ఫిజికల్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి కూడా నిరంతరం మెలకువలు నేర్పుతున్నారు. ఆటల్లో వారిని మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. వారే చిగిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు. హాకీ, జూడో క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. తద్వారా పాఠశాలకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. జిల్లాస్థాయి హాకీ పోటీల్లో బాలబాలికల జట్లు ఇప్పటికి పదిసార్లు చాంపియన్‌షిప్ సాధించడం విశేషం. గడిచిన 12 ఏళ్లలో ఈ పాఠశాల నుంచి 50 మంది విద్యార్థులు జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదిగారు.
స్వర్ణ పతకంపైనే గురి..
జూడో క్రీడాకారిణి నిఖిత పట్టు బిగించిందంటే బంగారు పతకం ఖాయం. గత ఏడాది అండర్–14 స్కూల్ గేమ్స్‌లో 21 కేజీల విభాగంలో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. అనంత క్రీడా గ్రామంలో జరిగిన సబ్ జూనియర్ –22 కేజీల విభాగంలోనూ పోటీ పడి జిల్లా, రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు కైవసం చేసుకుంది. జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచింది.
మోహన్‌తేజ అద్వితీయ ప్రతిభ..
జూడో, హాకీ ఆటల్లో విద్యార్థి మోహన్ తేజ అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. గత ఏడాది నంద్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–14 స్కూల్ గేమ్స్ 25 కేజీల విభాగం జూడో పోటీల్లో బంగారు పతకం సాధించి.. జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. హాకీలోనూ రాణిస్తూ చిగిచెర్ల జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
జాతీయస్థాయిలో సత్తా
2018– 19లో అనంత క్రీడా గ్రామంలో జరిగిన జూడో సబ్ జూనియర్, స్కూల్ గేమ్స్ పోటీల్లో ఓపెన్ వెయిట్ విభాగంలో చిగిచెర్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని బి.మైథిలి ప్రతిభ చూపింది. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ బంగారు పతకం సాధించింది. అదే ఏడాది జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది.
ఆట అంటే ప్రాణం..
2018–19లో జరిగిన స్కూల్ గేమ్స్ అండర్ –14 జిల్లా స్థాయి జూడో పోటీల్లో ఆర్.పవిత్ర బంగారు పతకం సాధించింది. అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రజత పతకం సా«ధించింది. 2020–21లో జిల్లా స్థాయిలో జరిగిన జూడో పోటీల్లో బంగారు పతకం సాధించింది. అలాగే అండర్–14 జిల్లా స్థాయి హాకీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.
జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యం..
జూడో క్రీడాకారుడు ఎస్.ప్రసాద్ జాతీయస్థాయిలో రాణించడమే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్నాడు. 2020–21లో ఆర్డీటీ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీల్లో బంగారు పతకం సాధించాడు.
చిరుతలా దూసుకెళుతుంది..
హాకీ, జూడోలో ఎస్.కుసుమ అద్వితీయ ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంది. హాకీలో సెంటర్ ఫార్వర్డ్‌లో ఆడే ఈ క్రీడాకారిణి చిరుత వేగంతో కదిలి గోల్స్ చేయడంలో దిట్ట. ఇటీవల ఆర్డీటీ స్టేడియంలో జరిగిన జిల్లా లీగ్ పోటీల్లో అత్యధిక గోల్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచింది. ఈ పోటీలలో చిగిచెర్ల జట్టును విజేతగా నిలిపింది.
12 ఏళ్లుగా శిక్షణ
నాకు మొదట్లో జైలు వార్డెన్ జాబ్ వచ్చింది. క్రీడలపై మక్కువతో ఆ ఉద్యోగం వదిలి చిగిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీడీగా ఉద్యోగంలో చేరా. ఇçక్కడ ఏడేళ్లు పనిచేసి బదిలీపై వెళ్లా. మళ్లీ 2019లో పదోన్నతిపై చిగిచెర్లకు తిరిగొచ్చా. 12 ఏళ్లుగా ఇక్కడ విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నా. ఇప్పటి వరకు 50 మంది విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దా.
– ప్రతాప్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్, చిగిచెర్ల జెడ్పీ హైస్కూల్
Comments
Please login to add a commentAdd a comment