సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియాలో రూ.లక్షల జీతంతో సాఫ్ట్‌వేర్ కొలువు. విదేశీ పౌరసత్వం. విలాసవంతమైన జీవితం. ఇంతకంటే ఎవరైనా ఏం కోరుకుంటారు. హాయిగా అక్కడే సెటిలవ్వాలని చూస్తారు. కానీ.. అతడు అలా ఆలోచించలేదు. సేంద్రియ వ్యవసాయంపై మక్కువతో 15 ఏళ్లపాటు చేసిన ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరు వచ్చేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి మూడెకరాల్లో సేంద్రియ వరి సాగుకు శ్రీకారం చుట్టాడు. తనలాగే సేంద్రియ పంటలు పండిస్తూ మార్కెటింగ్ చేసుకోలేని రైతులతో చేయి కలిపాడు. 50 మందిని రైతులను కూడగట్టి ‘మన రైతు’ పేరిట సేంద్రియ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేస్తూ వారికి తోడుగా నిలుస్తున్నాడు కృష్ణా జిల్లా పోరంకికి చెందిన బొల్లికొండ ప్రకాశ్.
సొంతూరికి వచ్చేసి..
ప్రకాశ్ ఉన్నత విద్య పూర్తి చేయగానే సాఫ్ట్‌వేర్ కొలువును అందిపుచ్చుకున్నాడు. వివిధ దేశాలను చుట్టి చివరకు కుటుంబంతో సహా ఆస్ట్రేలియాలో సెటిలయ్యాడు. ఆరంకెల జీతం. హాయిగా గడిచిపోతున్న అతడి జీవితంలో ఏదో వెలితి. తన పిల్లలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు తెలియకుండా పోతున్నాయన్న బాధ, సొంతూరికి దూరమైపోయానన్న ఆవేదన ఆయన్ని కలచివేసింది. చివరకు సొంతూరికి వచ్చేసి తన సోదరి వీరంకి ప్రమీల సాయంతో 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టాడు. చిట్టి ముత్యాలు, సిద్ధసన్నాలు, నారాయణ కామినీ, నవారా వంటి వరి రకాలను సాగు చేయడం మొదలు పెట్టాడు.
వాటికి మంచి డిమాండ్ ఏర్పడటంతో సేంద్రియ పద్ధతుల్లో రాజముడి, కాలబట్టి, మైసూర్ మల్లిగ దేశీ, రత్నచోడి, కుజిపటాలియా, బ్రౌన్, సెమీ బ్రౌన్ రైస్ పండిస్తున్న రైతుల నుంచి సేకరించి మార్కెటింగ్ చేయడం ప్రారంభించాడు. చిరు, తృణధాన్యాలు సాగు చేసే రైతులతో కలిసి వారు పండించే గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి మార్కెటింగ్‌కు శ్రీకారం చుట్టారు. ‘మన రైతు’ పేరిట మార్కెటింగ్ చేస్తున్నారు. సొంతంగా వెబ్‌సైట్, యూట్యూబ్ చానల్ ప్రారంభించి విస్తృత ప్రచారం చేస్తున్నారు. తాజాగా గేటెడ్ కమ్యూనిటీస్, అపార్టుమెంట్స్‌లో స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం
సేంద్రియ వ్యవసాయంపై మక్కువతోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి వచ్చాను. ఈ రంగంలో ఉన్న రైతులు పండించే ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేస్తున్నాను. మార్కెట్ ధర కంటే కనీసం 30 శాతం తక్కువ ధరలకే వీటిని అందిస్తున్నాం. మంచి స్పందన వస్తోంది.
– బొల్లికొండ ప్రకాశ్, పోరంకి, కృష్ణా జిల్లా
చిన్నప్పటి నుంచీ మక్కువ
చిరు ధాన్యాలంటే చిన్నప్పటి నుంచి మక్కువ. మా ఇంటిల్లపాదీ వాటినే తింటాం. ఇప్పుడు సొంతంగా పండిస్తున్నాం. ఆస్ట్రేలియాలో సెటిలైన మా సోదరుడు ప్రకాశ్ ప్రోద్బలంతో మరింత ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించా.
– వీరంకి ప్రమీల, సేంద్రియ రైతు, పోరంకి, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment