చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన లోకేశ్
తండ్రి చెప్పిన దానికి భిన్నంగా తనయుడి ట్వీట్
జూన్ 12 నుంచి 8 ట్యాంకర్ల నెయ్యి సరఫరా
అందులో నాలుగు ట్యాంకర్లు వెనక్కి
ఆ రిపోర్టును ట్వీట్‌కు జత చేసిన లోకేశ్
సాక్షి, అమరావతి: ఆ వెంకటేశ్వరస్వామే తనతో నిజాలు చెప్పించారేమో అని చెబుతున్న సీఎం చంద్రబాబు తన తనయుడు నారా లోకేశ్ వ్యాఖ్యలతో అడ్డంగా దొరికిపోయారు! శ్రీవారి సాక్షిగా తండ్రీ కుమారుడు తమ బండారాన్ని తామే బయటపెట్టుకున్నారు!! టీటీడీ లడ్డూల తయారీకి వినియోగించిన నెయ్యి విషయంలో చంద్రబాబు చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా లోకేశ్ సోమవారం ఎక్స్‌లో ట్వీట్ చేయడంతో టీడీపీ శ్రేణులు కంగుతిన్నాయి.
జంతువుల కొవ్వు కలిపిన ఏఆర్ డెయిరీ నెయ్యిని లడ్డూల తయారీకి ఉపయోగించారని, వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు పదేపదే అబద్ధాలు చెప్పి నమ్మించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ లోకేశ్ మాత్రం తాజాగా ట్వీట్‌లో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి లారీలు నాలుగింటినీ టీటీడీ తిప్పి పంపించేసిందని వెల్లడించి సీఎం స్థానంలో కూర్చున్న తన తండ్రి పచ్చి అబద్ధాల కోరని నిరూపించారు. నాలుగు నెయ్యి లారీలను తిప్పి పంపిన టీటీడీ రిపోర్టును తన ట్వీట్‌కు జత చేశారు.
అందులో ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన 8 నెయ్యి ట్యాంకర్లలో నాలుగు టెస్టుల్లో పాసవగా, నాలుగు ట్యాంకర్లలో నెయ్యి ప్రమాణాల ప్రకారం లేకపోవడంతో తిరస్కరణకు గురైనట్లు స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పేది నిజమా? లేక లోకేశ్ చెప్పేది నిజమా? అబద్ధాలు చెప్పడంలో ఇద్దరి మధ్యా సమన్వయం లేదా? కుమారుడికి అబద్ధాఆల ట్రెయినింగ్ సరిగా ఇవ్వలేదా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
జూన్ 12న తొలి ట్యాంకర్ టీటీడీకి
జూన్ 12వ తేదీన ఏఆర్ డెయిరీ నుంచి తొలి ట్యాంకర్ టీటీడీకి చేరింది. అదే నెల 21, 25న రెండు, జూలై 4వ తేదీన మరో ట్యాంకర్ వచ్చాయి. మొత్తం నాలుగు నెయ్యి ట్యాంకర్లు టీటీడీ నిర్వహించిన పరీక్షల్లో నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉన్నాయని తేలింది. అందుకే వాటిని స్వీకరించారు. ఆ తర్వాత జులై 6వ తేదీన వచ్చిన రెండు ట్యాంకర్లు, 12న వచ్చిన మరో రెండు ట్యాంకర్లు ప్రమాణాల ప్రకారం లేకపోవడంతో టీటీడీ వాటిని తిరస్కరించింది.
లోకేశ్ జత చేసిన రిపోర్టులో ఈ విషయం స్పష్టంగా ఉంది. లేబొరేటరీ పరీక్షల్లో ఈ నాలుగు ట్యాంకర్లను తిరస్కరించారంటే అందులోని నెయ్యిని లడ్డూల తయారీకి వినియోగించలేదని విస్పష్టంగా తెలుస్తోంది. కానీ చంద్రబాబు ఆ నెయ్యిని వాడేసినట్లు, వాటితో తయారైన లడ్డూలను భక్తులను తినేసినట్లు చెబుతూ జనాన్ని తప్పుదోవ పట్టించారు.
మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఇష్టం వచ్చినట్లు అడ్డగోలు భాషలో అడ్డంగా మాట్లాడే క్రమంలో లోకేష్ మరోసారి తాను పప్పునని బయట పెట్టుకున్నారు. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి కొవ్వు ఎక్కువైందంటూ అధికారం అండతో అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించిన లోకేశ్ అదే ట్వీట్ ద్వారా తమ బాగోతాన్ని బహిర్గతం చేశారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment