సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో తనపై టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యాన్ని ఆయన ఖండించారు. తాను గౌతమ బుద్దుడు కాదన్న తమ్మినేని..లైన్ దాటకుండా నిరసన తెలిపే హక్కు సభ్యులకు ఉందన్నారు. ఇకపై పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్ చేస్తానని స్పీకర్ కీలక రూలింగ్ ఇచ్చారు. టీడీపీ సభ్యులు సభను అగౌరవ పరిచారని విమర్శించారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన హేయమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీ సీనియర్ సభ్యులే తనపై దాడులు చేయడం దురదృష్టకరమన్నారు.
నాపై దురుసుగా ప్రవర్తించడం సీనియారిటీనా?.. బడగు, బలహీన వర్గాలంటే ఇంత చిన్న చూపా? అంటూ స్పీకర్ మండిపడ్డారు. తన చైర్ వద్దకు వచ్చే హక్కు సభ్యులకు లేదని స్పష్టం చేశారు. తనకు సభ్యులంతా సమానమేనన్న తమ్మినేని.. సభలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదని తెలిపారు. స్పీకర్ చైర్‌ను టచ్ చేసి ముఖంపై ప్లకార్డులు ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత జరిగినా టీడీపీ సభ్యుల వైఖరిని మౌనంగానే భరించానని తెలిపారు.
‘సభలో దాడులు చేయమని టీడీపీ సభ్యులకు ఎవరు చెప్పారు?. సభను సజావుగా నడిపించడమే నా కర్తవ్యం. సభ్యుల హక్కులు పరిరక్షించడం నా బాధ్యత. టీడీపీ నేతలు పేపర్లు చించి నాపై వేస్తుంటే.. పూలు చల్లుతున్నారనే భావించా. ఎమ్మెల్యే ఎలీజాను టీడీపీ సభ్యులు నెట్టేశారు. సభా సమయం, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రోజాను ఏడాది సస్పెండ్ చేశారు. సభలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తారు. టీడీపీ నేతల తీరు మారాలి’ అని స్పీకర్ వ్యాఖ్యానించారు.
కాగా సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం నుంచే టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించి దౌర్జన్యానికి దిగారు.స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై టీడీపీ సభ్యులు దాడికి పాల్పడ్డారు.స్పీకర్ చైర్ ఎక్కి ఆయన ముఖంపై ఫ్లకార్డులు అడ్డుగా పెట్టారు. పేపర్లు చింపి ఆయనపై విసిరేశారు. తమ్మినేని ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలోనే స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చేరుకున్నారు. వారిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.
చదవండి: టీడీపీ నేతల దాడి: ‘ఇది బ్లాక్ డే.. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే’
Comments
Please login to add a commentAdd a comment