అక్రమార్కుల చెరలో చిక్కిన డీకేటీ భూమి
కేవీబీపురం(చిత్తూరు జిల్లా): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేవీబీపురం నడిబొడ్డున నిరుపేదలకు ఇంటి స్థలాలు అందజేశారు. సర్వే నంబర్ 53లోని 7.56 ఎకరాలను 396 ప్లాట్లుగా విభజించి కేవీబీపురం, కళత్తూరు, రాయపేడు గ్రామాలకు చెందిన పేద కుటుంబాలకు పంపిణీ చేశారు. సుమారు 200 మందికి పట్టాలను అందించారు. మిగిలిన ప్లాట్లను భవిష్యత్‌లో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా ప్లాట్లను గ్రామ కంఠంగా రెవెన్యూ అధికారులు ప్రకటించారు.
చదవండి: అమ్మాయిల సంఖ్య ‘అనంత’లోనే తక్కువ.. ఎందుకిలా?
నకిలీ పట్టాలతో విక్రయాలు
నైనేరి ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన 364 నంబరు ప్లాట్‌ను బీజేపీకి చెందిన వెంకటముని నకిలీ పట్టాతో ఆక్రమించుకున్నాడు. సదరు స్థలాన్ని ఇటీవలే కువైట్‌లో సెటిలైన నగరివాసి నాదముని అనే వ్యక్తికి రూ.7.40లక్షలకు అమ్మేశాడు. అదీ రూ.100 బాండు పేపర్‌పై హక్కులు రాయించేసి అప్పగించేశాడు. ఇదే తరహాలో కువైట్ వాసికి ఇప్పటికే నాలుగు ప్లాట్లు విక్రయించినట్లు ఆధారాలున్నాయి.
అలాగే స్థానికంగా వ్యాపారం చేసుకునే బొంబాయి రవి అనే వ్యక్తికి టీడీపీ నాయకులు తాము కబ్జా చేసిన 8 ప్లాట్లను అమ్మి కాసులు పోగేసుకున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని ఊతుకోటకు చెందిన ట్రాన్స్‌కో అధికారికి మరో స్థలాన్ని విక్రయించగా, ఆయన ఆ ప్లాటులో ఇల్లు సైతం నిర్మించేసుకున్నారు. టీడీపీ, బీజేపీ నేతల దందా అక్కడితో ఆగలేదు.. షణ్ముగం అనే వ్యక్తికి 3 ప్లాట్లు, మరో ప్రభుత్వోద్యోగికి 4, శ్రీకాళహస్తికి చెందిన వైద్యుడికి 8 స్థలాలు అమ్మేసుకుని రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఈ పెద్దమనుషుల ఆక్రమణలో ఇప్పటికీ మరో 20 ప్లాట్లు ఉన్నట్లు సమాచారం.
బీజేపీ నేత వెంకట ముని నగరి వ్యక్తికి ప్లాట్ విక్రయించిన పత్రం
విషం కక్కుతున్న ‘కాల్’నాగులు!
పేదలకు గూడు కల్పించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాలను కాజేయడంలో కొందరు ‘కాల్’నాగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా మునస్వామి అనే వ్యక్తి అప్పులు ఇచ్చినట్టే ఇచ్చి అధిక వడ్డీలు కట్టి చెల్లించలేని వారి స్థలాలను ఆక్రమించుకుంటున్నాడు. ఈ విధంగా ఇప్పటికే దాదాపు పది ప్లాట్లను బలవంతంగా రాయించేసుకున్నట్లు తెలిసింది. ఆయా స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
వంతపాడుతున్న అధికారులు
ఆక్రమణదారులకు స్థానిక అధికారులు కొందరు సహకరిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం మంజూరు చేసిన డీకేటీ భూమిలోని స్థలాలను విక్రయిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఓ వీఆర్‌ఓ, స్థానిక సచివాలయ సర్వేయర్ మామూళ్లు తీసుకుని భూ దందాకు వంతపాడుతున్నట్లు సమాచారం.
టీడీపీ నేతల దందా
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తమ్ముళ్ల కన్ను ఈ స్థలాలపై పడింది. పెద్దమనుషుల ముసుగులో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ మునికృష్ణయ్య, మాజీ సర్పంచ్ చెంగారెడ్డి, స్థానిక నేత పరంధామ్‌తోపాటు బీజేపీకి చెందిన మండలస్థాయి నాయకుడు వెంకటముని రంగంలోకి దిగి కబ్జా పర్వానికి తెరతీశారు. ముందుగా ఖాళీ స్థలాల్లో ప్రభుత్వం కార్యాలయాలు నిర్మించాలనే ప్రతిపాదన తీసుకువచ్చి 20 ప్లాట్లలో పాగా వేశారు. గుట్టు చప్పుడు కాకుండా తమ కుటుంబ సభ్యుల పేరు మీద ఆయా స్థలాలను రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు. అంతటితో ఆగకుండా పలువురు లబ్ధిదారులకు చెందిన ప్లాట్లను సైతం తప్పుడు పత్రాలు సృష్టించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
పట్టా చెల్లదంటున్నాడు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో మాకు ఇంటి స్థలం ఇచ్చారు. అప్పట్లో వసతి లేక ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడు కట్టుకుందామని వెళితే బీజేపీకి చెందిన వెంకటముని అడ్డుకున్నాడు. నాకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా చెల్లదని దబాయిస్తున్నాడు. తీరా విషయం కనుక్కుంటే నా ప్లాటును కువైట్‌లో ఉన్న వ్యక్తికి వెంకటముని అమ్మేసినట్లు తెలిసింది.
– ప్రసాద్, కేవీబీపురం
బెదిరిస్తున్నారు
అప్పట్లో మాకు ఇంటి స్థలాలకు ఇచ్చేప్పుడు గ్రామానికి చెందిన వెంకటముని, మునికృష్ణయ్య పెద్దమనుషులుగా ఉండి పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పుడు ఆ ప్లాట్లను మాకు సంబంధం లేకుండా నకిలీ పట్టాలు సృష్టించి విక్రయించేస్తున్నారు. అడిగితే మీ స్థలం ఎక్కడ ఉందో వెతుక్కోండని బెదిరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేయించి మా పట్టాలకు స్థలాలు చూపించాలి.
– వెంకటేష్, పట్టాదారు
విచారణ చేస్తాం
ప్రభుత్వం పంపిణీ చేసిన డీకేటీ భూములను ఎవరూ అమ్మకూడదు. కొనకూడదు. చట్టవిరుద్ధంగా కొనుగోలు, విక్రయాలకు పాల్పడినవారిపై చర్యలు తప్పవు. ఇక్కడ పంపిణీ చేసిన ఇంటి స్థలాలకు సంబంధించి లావాదేవీలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తాం. తప్పు చేసిన వారిని ఉపేంక్షించే ప్రసక్తే లేదు.
– ప్రమీల, తహసీల్దార్, కేవీబీపురం
Comments
Please login to add a commentAdd a comment