పాపం కమలనాథులు ఏదేదో ఊహించుకున్నారు.. వాపును చూసి బలుపనుకున్నారు.. జనసైనికుల అండతో సత్తా చాటవచ్చని జబ్బలు చరిచారు.. ఇంతలోనే నమ్ముకున్న పవన్ కల్యాణ్ నట్టేట్లో వదిలేసేసరికి కంగుతిన్నారు.. టీడీపీతో జట్టుకట్టి తమ ఆశలను నిలువునా కూల్చేశారని రగిలిపోతున్నారు.. అనుకూలంగా ఉన్నట్లు నటించి వెన్నుపోటు పొడిచారని మండిపడుతున్నారు.. చంద్రబాబుతో ముందుకు వెళ్లడమంటే ఓటమిని కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. జనసేన అధినేత రాజకీయ అపరిపక్వతకు ఇది నిదర్శనమని విమర్శిస్తున్నారు.. ఏది ఏమైనా ఇన్నాళ్లూ పోటీకి సై అంటూ కాలుదువ్విన నేతలంతా చల్లగా జారుకుంటున్నారు.. పోటీ చేసి పరువు తీసుకోవడం ఎందుకని ప్లేటు ఫిరాయిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఓటు బ్యాంకింగ్ లేకపోయినా.. మీడియా పులులుగా మీసాలు తిప్పుతున్న కమలనాథులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టి షాక్ ఇచ్చారు. చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోని విధంగా పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడవటాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లూ పవన్‌తో జతకట్టడం వల్ల ఉన్న పరువు కూడా పోయిందంటూ మథనపడుతున్నారు.
రాజేసిన మాటలు
వైఎస్సార్‌సీపీ నేతలపై పవన్‌కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో అన్ని వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉన్న నాయకుడు చేసే వ్యాఖ్యలేనా? అని ప్రశ్నిస్తున్నారు. సమాజానికి ఏమని మెసేజ్ ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈక్రమంలో తిరుపతి, మదనపల్లె, చిత్తూరులో పోటీ చేయాలనుకుంటున్న టీడీపీ, జనసేన ఆశావహులు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు పార్టీ టికెట్ వద్దని తేల్చి చెబుతున్నారు. తిరుపతిలో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రస్తుత పరిస్థితిలో ఆలోచనలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా మబ్బు దేవనారాయణరెడ్డి, జేబీ శ్రీనివాసులు మీమాంసలో పడినట్లు తెలుస్తోంది.
తిరుపతిలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉండడంతో పాటు, పారీ్టలో విబేధాలు, మిత్రపక్షమైన జనసేన శ్రేణులతో వర్గపోరు వీరిని అయోమయంలోకి నెట్టేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. జనసేన విషయానికి వస్తే పసుపులేటి హరిప్రసాద్, కిరణ్‌రాయల్, మహాలక్ష్మి తిరుపతి అభ్యర్థులుగా పోటీ చేయాలని ఆశపడ్డారు. అయితే వీరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉంటే.. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు వీరిని భయపెడుతున్నాయి. చంద్రబాబు, పవన్ కలయికతో మదనపల్లె టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న దొమ్మలపాటి రమేష్, జయరాం నాయుడు, బోడిపాటి శ్రీనివాస్ ఆత్మరక్షణలో పడ్డారు. జనసేన నుంచి రామ్‌దాస్‌చౌదరి, మహేష్ కూడా పోటీ చేద్దామా? వద్దా? అనే సంశయంతో ఉన్నట్టు తెలిసింది.
చిత్తూరు విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థిగా డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేయవచ్చేనే అభిప్రాయం ఉండేది. ప్రస్తుతం ఆ ప్రస్తావన కూడా రావటం లేదని ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ నుంచి కొత్త అభ్యర్థి బరిలో దిగే అవకాశం ఉండేది. అయితే వపన్, చంద్రబాబు కలయిక, వారి వ్యాఖ్యలపై జనం నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా పరిస్థితి తారుమారు అయినట్లు ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. మొత్తంగా టీడీపీ, జనసేన జట్టుకట్టడంపై రెండు పార్టీల నేతల నుంచే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండడం గమనార్హం. బాబు, పవన్ వ్యాఖ్యల ప్రభావం వచ్చే ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతోనే ఆశావాహులు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎందుకింత దూరం
మొన్నటి వరకు బీజేపీతో సఖ్యతగా ఉంటూ.. కమలనాథులకు అండదండలందిస్తున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నమ్మించారు. ఆ పార్టీ అధినాయకత్వంతో తరచూ మాట్లాడుతున్నట్టు ఇక్కడి నేతలను బోల్తాకొట్టించారు. అడపాదడపా అధికార వైఎస్సార్‌సీపీ నేతలపై చిందులేస్తూ బీజేపీ నేతలను ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు వచ్చే ఎన్నికల్లో తిరుగులేదని కమలదళం మురిసిపోయింది. అయితే ఇటీవల పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కలవడం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కలసికట్టుగా పోరాడాలనుకుంటున్నామంటూ వ్యాఖ్యలు చేయడం బీజేపీ కార్యకర్తలను విస్మయంలోకి నెట్టింది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ పొత్తుతో తిరుపతి అసెంబ్లీ బరిలో పోటీచేయాలని భావించిన బీజేపీ నేతల ఆశలు ఆవిరయ్యాయని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment