టెక్కలి సమగ్ర రక్షిత మంచినీటి పథకం వద్ద బుద్ధుడి విగ్రహాన్ని పరిశీలిస్తున్న కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రాజు, టెక్కలి సీఐ, ఎస్‌ఐ తదితరులు
స్వశక్తితో సోపానమెక్కడం కష్టం. చేతకాక స్వయంకృతం కొద్దీ పతనం కావడం సులభం. మొదటిది తమ తలకు మించిన పని కాబట్టి.. రెండోదే మేలనుకుంటున్నారు ఘనత వహించిన ప్రతి‘పచ్చ’ వర్గీయులు. తమకు మొదటి నుంచీ అలవాటైనదే కాబట్టి.. అదే దారిలో ముందుకు సాగుతున్నారు. వికృత రాజకీయాలకు తెరలేపి.. విగ్రహ విధ్వంస రాజకీయాలతో విద్వేషాలను ఎగదోసి రాక్షసానందం పొందాలనుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో ఇలాంటి అకృత్యాల బాటపట్టిన వారు తాజాగా టెక్కలిలో బుద్ధ భగవానుడి ప్రతిమకు సంబంధించి అతి చేయబోయారు. విగ్రహం విరిగిందిని నానాయాగీ చేసి పబ్బం గడుపుకుందామనుకున్న అచ్చెన్న వర్గీయులు అధికారులు ఇచ్చిన కచ్చితమైన జవాబులతో బొక్క బోర్లా పడ్డారు. డ్రామాకు తెరదించి తోక ముడిచారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టెక్కలి ఆది ఆంధ్రావీధి సమీపంలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకానికి ఆనుకుని ఉన్న పార్కులో బుద్ధుని విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి చేతి మణికట్టు మూడు నెలల క్రితమే ఊడిపోయింది. అప్పట్లోనే తాత్కాలిక మరమ్మతులు చేసి అతికించారు. ఆ మణికట్టు మళ్లీ ఊడిపోయింది. ఇంకేముంది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు దానిని రాజకీయంగా వాడుకోవాలని చూశారు. తన అనుచరులను రంగంలోకి దించారు. విగ్రహ రాజకీయాలతో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు పక్కా ప్లాన్ గీశారు. టీడీపీ మండల అధ్యక్షుడు బి.శేషగిరిరావుతో పాటు నాయకులు, కార్యకర్తలను ఆ స్థలానికి పంపించి హడావుడి చేయించారు. హైడ్రామా నడిపించారు.
దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఆర్.వీ.పీ.రాజు, కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, టెక్కలి సీఐ ఆర్.నీలయ్య, ఎస్‌ఐ ఎన్.కామేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ ప్రకాశ్ తదితరులు సోమవారం సంఘటనా స్థలానికి చేరుకుని వాస్తవాలను వివరించారు. బుద్ధుని విగ్రహం చేతి మణికట్టు మూడు నెలల క్రితమే ఊడినట్లు చెప్పారు. రగడ సృష్టించేందుకు.. ఏదో చేద్దామని భావించి అక్కడికి వచ్చిన టీడీపీ నేతలు అధికారుల వివరణతో కంగుతిన్నారు. ఏం చేయాలో తెలియక డీఎస్పీ శివరామిరెడ్డికి వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు. రాష్ట్రంలో పలు హిందూ దేవాలయాల్లో టీడీపీ నాయకులు చేస్తున్న కుట్రల నేపథ్యంలో ఈ సంఘటనను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ఒక్కసారిగా వికటించినట్టయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ శిబిరంలో మాట పడిపోయింది. వీరావేశంతో ముందుకెళ్లిన టీడీపీ నేతలకు ఊహించని పరిణామంతో తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. (చదవండి: ఆ ఇద్దరూ ద్రోహులే..)
కథనం అవాస్తవం...
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుద్ధుని విగ్రహ ధ్వంసంపై సోమవారం ఓ పత్రికలో వచ్చిన కథనం అవాస్తవమని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ కేఆర్‌వీపీ రాజు స్పష్టం చేశారు. టెక్కలి సమగ్ర రక్షిత మంచినీటి పథకానికి ఆనుకుని ఉన్న పార్కులో గల బుద్ధుని విగ్రహం చేతి మణికట్టు సాధారణంగానే ఊడిందని ఆయన స్పష్టం చేశారు. విగ్రహం చేతిని ధ్వంసం చేశారని ఓ పత్రికలో కథనం రావడంతో డీఈతో పాటు ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహం చేయి మూడు నెలల కిందటే ఊడిపోయిందని, అప్పట్లో అమర్చినా మళ్లీ ఊడిపోయిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment