సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు.. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన
న్యాయపోరాటానికి సిద్ధపడుతున్న వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ముఖ్య నేత ఆదేశాలతోనే రాష్ట్రంలో భావ ప్రకటనా స్వేచ్ఛపై పోలీసులు దమనకాండ సాగిస్తున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా గొంతును అణచివేసేందుకు ప్రభుత్వ పెద్దల పక్కా పన్నాగాన్ని పోలీసులు నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.
ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్‌ల పర్యవేక్షణలో..
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించాల్సిందేనని ప్రభుత్వ ముఖ్య నేత పోలీసులకు విస్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. నాలుగు నెలల్లోనే తమ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తుతుండటాన్ని ఆయన గుర్తించారు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతుండటంతో ముఖ్య నేత బెంబేలెత్తుతున్నారు.
ప్రధానంగా శాంతిభద్రతలు పూర్తిగా దిగజారడం.. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం చేతులెత్తేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. దాంతో సోషల్ మీడియా కార్యకర్తలను అణచివేస్తే ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించవచ్చని ఆయన భావించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఉంటూ రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని శాసిస్తున్న ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులకు ఆ బాధ్యత అప్పగించారు.
ఆ వెంటనే టీడీపీ వీర విధేయులైన ఆ ముగ్గురు రిటైర్డ్ అధికారులు రంగంలోకి దిగారు. ఏకంగా డీజీపీ, సీఐడీ చీఫ్, జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ఆ ముగ్గురే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యాలయం నుంచి పంపిన జాబితా ప్రకారం వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించాలని స్పష్టం చేశారు. లేకపోతే వారి పోస్టులు ఊడతాయని కూడా హెచ్చరించినట్టు సమాచారం.
పోలీస్ యంత్రాంగం జీహుజూర్
ప్రభుత్వ ముఖ్య నేత ఆదేశాలతో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు చెలరేగిపోతున్నారు. టీడీపీ కార్యాలయం పంపిన జాబితా ప్రకారం కార్యాచరణకు దిగారు. కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా వందకుపైగా అక్రమ కేసులు బనాయించడం ప్రభుత్వ కుట్రకు నిదర్శనం. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కేసులు పెట్టవద్దని.. 41 ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు.
అర్ధరాత్రి దాటిన తరువాత వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తల ఇళ్లపై పడి వారిని బలవంతంగా తీసుకుపోతున్నారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారన్న సమాచారాన్ని సైతం కార్యకర్తల కుటుంబ సభ్యులకు చెప్పడం లేదు. వచ్చి0ది పోలీసులో.. టీడీపీ గూండాలో తెలియక కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ..
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తల కళ్లకు గంతలు కట్టి పోలీసు వాహనాల్లో ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా హింసిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్ని0చవద్దని హెచ్చరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు న్యాయవాదులతో వెళ్లి ప్రశి్నస్తున్నా పోలీసులు సరైన సమాధానం చెప్పడం లేదు.
కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చేస్తే తప్పనిసరై కొందర్ని విడిచిపెడుతున్నా.. మర్నాడు మళ్లీ రావాలని చెబుతున్నారు. తాము తీవ్రంగా కొట్టిన విషయాన్ని ఎవకైనా చెబితే మరోసారి అంతకుమించిన చిత్రహింసలకు గురి చేస్తామని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా అరాచకాన్ని సృష్టిస్తోంది. ఖాకీ క్రౌర్యంతో లాఠీ రాజ్యం సాగుతోంది.
యథేచ్ఛగా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోంది. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ కూటమి ప్రభుత్వ పాల్పడుతున్న హక్కుల ఉల్లంఘనపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటానికి సిద్ధపడుతోంది.
కొనసాగుతున్న అక్రమ అరెస్టులు
మార్కాపురం/అగనంపూడి (గాజువాక)/తాడికొండ/లక్ష్మీపురం (గుంటూరు ఈస్ట్) : వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, అడ్డగోలుగా కేసుల నమోదు కొనసాగుతోంది. పల్నాడు జిల్లా దమ్మాలపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త కల్లి నాగిరెడ్డిని మంగళవారం ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీసులు అరెస్టు చేశారు. మార్కాపురానికి చెందిన టీడీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు అయ్యప్పమాలలో ఉన్న నాగిరెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో అయ్యప్పస్వామి గుడికి వెళ్తుండగా అదుపులోకి తీసుకుని మార్కాపురం తరలించారు.
» వైఎస్సార్‌సీపీ యువజన విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డిని తాడికొండ పోలీసులు మంగళవారం అక్రమంగా అరెస్టు చేశారు.హరికృష్ణారెడ్డి సెల్‌ఫోన్‌తో పాటు ఆయన తల్లి సెల్‌ఫోన్, ఒక ల్యాప్‌ట్యాప్, డెస్క్‌టాప్‌ను సీజ్‌చేశారు.
» విశాఖ పార్లమెంటరీ సోషల్ మీడియా కో–కన్వీనర్ బోడే వెంకటేశ్‌పై టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు సాకెళ్ల రతన్‌కాంత్ ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
» వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా గుంటూరు జిల్లా కన్వినర్ మేకా వెంకటరామిరెడ్డిని నగరంపాలెం పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment